Sunday, December 22, 2024

బిసి కులగణన చేస్తామని ప్రధాని సభలో ప్రకటించాలి

- Advertisement -
- Advertisement -

బిసి ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీలకే బిసిల మద్దతు
టికెట్ల కేటాయింపులు అన్ని పార్టీలు అన్యాయం చేశాయి
స్థానిక ఎన్నికల నాటికి బిసిల పార్టీ ఏర్పాటు
బిసిలకు ద్రోహులెవరో…దొంగలెవరో రెండు రోజుల్లో తేలుస్తాం
బిసిల రాజకీయ మేధో మదన సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో అన్ని రాజకీయ పార్టీలు బిసిలకు అన్యాయం చేశాయని బిసిల రాజకీయ మేధోమదన సమావేశం విమర్శించింది. అరశాతం, ఐదు శాతం వారికిచ్చిన విలువ 60 శాతం ఉన్న బిసిలకు ఇవ్వలేదని పేర్కొంది. ప్రధాన పార్టీలు పోటీపడి రెడ్లు రావులకే టికెట్లు ఇచ్చి బిసిలను పచ్చి మోసం చేశాయని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రెండు మూడు రోజుల్లో బిసిల ద్రోహులు ఎవరో దొంగలు ఎవరో తెలుస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆదివారం హైదరాబాద్ లకిడికాపూల్ లోని ఓ హోటల్లో బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిసిల రాజకీయ మేధో మదన సమావేశం జరిగింది, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జాజుల శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చిరంజీవి, 20 బిసి సంఘాల అధ్యక్షులు, వివిధ కుల సంఘాల నేతలు, మేధావులు అన్ని జిల్లాల నుండి బిసి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ బిసిలకు 23 టికెట్లు ఇస్తే, కాంగ్రెస్ 20 టికెట్లు ఇచ్చిందని, బిజెపి 33 టికెట్లు ఇవ్వడంతో పాటు బిసిని సిఎం చేస్తామని ప్రకటించిందని తెలిపారు. ఈ నెల ఏడో తేదీన జరిగే బిసి సభలో ప్రధాని మోడి పాల్గొంటున్నందున, ఇదే సభలో బిసి సిఎంతో పాటు, బిసి కులగణన, మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్‌కోటా , బిసి రిజర్వేషన్ల పెంపుపై ప్రధాని ప్రకటన చేయించాలని జాజుల డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బిసిలు ఈ డిమాండ్ల ను నెరవేర్చాలని చాలా కాలంగా కోరుతున్నారని, ఈ డిమాండ్లను బిసి అయిన ప్రధాని మోడి నెరవేర్చాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే బిసి కులగణన చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లులో బిసిలకు సబ్ టా కల్పిస్తామని ప్రకటించడాన్ని స్వాగతించారు. రెండు రోజుల్లో తిరిగి బిసిల విస్తృత సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు రాజకీయ కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. బిసిలకు మిత్రులెవరో, రాజకీయ శత్రువులెవరో ఈ నెల తొమ్మిదిన నిర్ణయిస్తామన్నారు.

ప్రాంతీయ పార్టీలలో కులతత్వం కుటుంబ తత్వం తప్ప సామాజిక న్యాయం ఉండదని బిసిలు ప్రాంతీయ పార్టీలను నమ్ముకొని ఆగం కావద్దని బిసిలే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చిరంజీవిలు అన్నారు ఎన్నికల్లో బిసిలు ఐక్యతను చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవి క్రిష్ణ ,బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి, బిసి విద్యార్థి సంఘం కేంద్రకమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, యువజన సంఘం అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ, బిసి నేతలు దుర్గయ్య, పాండు, ఈడిగ శ్రీనివాస్ ,మహేష్ యాదవ్, వడ్లకొండ వేణుగోపాల్, జాజుల లింగం, చాప శివరాములు, కొత్త నరసింహస్వామి, కనకయ్య గౌడ్ ,కోనపురి కవిత, రవీందర్ ముదిరాజ్, వరికుప్పల మధు, బడేసబ్, జలజ, దేవిక, నరసింహ నాయక్, గూడూరు భాస్కర్, ఇంద్రమ్ రజక, మలుసురుగౌడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

BC 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News