ప్రధాని మోడీకి మమత చురకలు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించిన ప్రధాని నరేంద్ర మోడీ “మన్ కీ బాత్”కు బదులుగా “పెట్రోల్, వ్యాక్సిన్ కీ బాత్” నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. బుధవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో కేంద్ర క్యాబినెట్ విస్తరణను ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రిమండలి నుంచి బాబుల్ సుప్రియోను తొలగించడాన్ని బట్టి 2024కు ముందే తన ఓటమిని బిజెపి ప్రభుత్వం అంగీకరించినట్లు కనపడుతోందని మమత వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీకి తాను రాసిన లేఖలకు ఎటువంటి స్పందన లేదని ఆమె చెప్పారు. రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను తొలగించాలన్న తన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోవడం లేదని ఆమె చెప్పారు. దేశమంతటా ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉందని, నిత్యం ఇంధన ధరలు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. మన ప్రధాని మన్ కీ బాత్‌తో చాలా బిజీగా ఉన్నారని, ఆయన దీనికి బదులుగా పెట్రోల్ కీ బాత్, డీజిల్ కీ బాత్, వ్యాక్సిన్ కీ బాత్ నిర్వహిస్తే బాగుంటుందని ఆమె ఎద్దేవా చేశారు.