Wednesday, January 22, 2025

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించాల్సింది ప్రధాని కాదు : రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈనెల 28న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీచే ప్రారంభింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని కాదని, రాష్ట్రపతి అర్హులన్న వాదన విపక్షాల నుంచి తీవ్రంగా వస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విపక్షాల అభిప్రాయాలకు మద్దతు పలికారు. పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతియే ప్రారంభించాలని, ప్రధాని కాదని ఆయన ఆదివారం స్పష్టం చేశారు. ఇది జాతీయ నిర్మాతలకు తీరని అవమానంగా కాంగ్రెస్ మండిపడింది. గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోడీని కలుసుకుని , కొత్తభవనాన్ని ప్రారంభించాలని కోరుతూ ఆహ్వానం అందించారని లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. పార్లమెంట్ భవన ప్రారంభానికి నిర్ణయించిన తేదీ మే 28, యాధృచ్ఛికంగా హిందూ సిద్ధాంతకర్త వీరసావర్కర్ జయంతి రోజు కూడా అదే కావడం విమర్శలకు దారి తీసింది.

దీనిపై విపక్షాలు ప్రభుత్వాన్ని లక్షంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. వీరసావర్కర్ జయంతి రోజునే పార్లమెంట్ భవన ప్రారంభ కార్యక్రమాన్ని ఎందుకు ఎంచుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సుఖేందు శేఖర్ రాయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మహాత్మా గాంధీని జీవితాంతం విమర్శించిన సావర్కర్ జయంతి రోజునే ఈ కార్యక్రమం ఎలా నిర్ణయిస్తారని మరికొందరు విమర్శించారు. కొత్త పార్లమెంట్ భవనంలోక్‌సభలో మొత్తం 888 మంది , రాజ్యసభలో 300 మంది సభ్యులు కూర్చునే సౌకర్యంగా సీట్లు అమర్చారు. ఒకవేళ రెండు సభలను కలిపి ఒకేసారి సమావేశం నిర్వహిస్తే మొత్తం 1280 మంది సభ్యులు కూర్చోడానికి కూడా తగిన సౌకర్యం ఉంది. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి 2020,డిసెంబర్ 10 న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఇప్పుడున్న పార్లమెంట్ భవన నిర్మాణం 1927లో పూర్తయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News