Monday, January 20, 2025

పిఎం సూర్య ఘర్ యోజన ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సౌర్య విద్యుత్ శక్తి ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా
ఒక కోటి ఇళ్లలో విద్యుత్ కాంతులు
ప్రాజెక్ట్‌కు రూ. 75 వేల కోట్ల పెట్టుబడి అవసరం

న్యూఢిల్లీ : సౌర విద్యుత్ శక్తికి, సుస్థిర ప్రగతిని ప్రోత్సహించేందుకు ‘పిఎంసూర్య ఘర్ : ముఫ్త్ బిజ్లీ యోజన’ను తన ప్రభుత్వం ప్రారంభించిందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. ప్రతి నెల 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయడం ద్వారా ఒక కోటి ఇళ్లలో విద్యుత్ కాంతులు నింపడం ఈ పథకం లక్షమని ప్రధాని వెల్లడించారు. ఈ పథకానికి రూ. 75 వేల కోట్లకు పైగా పెట్టుబడి అవసరం అవుతుందని మోడీ తెలియజేశారు. ‘సుస్తిర అభివృద్ధిని కొనసాగించేందుకు, ప్రజల సంక్షేమార్థం ‘పిఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజ్లీ (ఉచిత విద్యుత్) యోజన’ ప్రారంభిస్తున్నాం.

రూ. 75 వేల కోట్లకు పైగా పెట్టుబడితో చేపడుతున్న ఈ పథకం లక్షం ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఒక కోటి ఇళ్లలో విద్యుత్ కాంతులు నింపడం’ అని ప్రధాని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో వివరించారు. గణనీయమైన సబ్సిడీల నుంచి భారీ రాయితీతో బ్యాంక్ రుణాల వరకు ప్రజలపై వ్యయ భారం ఏదీ పడకుండా కేంద్ర ప్రభుత్వం చూస్తుందని మోడీ హామీ ఇచ్చారు. ఆ సబ్సిడీలను ప్రజల బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదలీ చేస్తారని ఆయన తెలిపారు. సంబంధితులు అందరినీ ఒక జాతీయ ఆన్‌లైన్ పోర్టల్‌కు సమీకృతం చేయనున్నట్లు మోడీ తెలియజేశారు.

అట్టడుగు స్థాయిలో ఈపథకాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు తమ తమ పరిధులలో ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు. ‘అదే సమయంలో ఈ పథకం ప్రజలకు అదనపు రాబడికి, తక్కువ విద్యుత్ బిల్లులకు, ఉపాధి కల్పనకు దారి తీస్తుంది’ అని మోడీ తెలిపారు. ‘సౌర విద్యుత్ శక్తిని, సుస్థిర ప్రగతిని ప్రోత్సహిద్దాం. ఇళ్ల వినియోగదారులు, ముఖ్యంగా యువజనులు అందరూ ‘పిఎంసూర్యఘర్.గవ్.ఇన్’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయడం ద్వారా ‘పిఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజ్లీ యోజన’ను పటిష్ఠం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News