Monday, November 25, 2024

ప్రధాని మహబూబ్‌నగర్ పర్యటన నిరాశ పరిచింది: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

పాలమూరుకు మోడీ మొండిచేయి చూపారు
ప్రధాని పర్యటన వల్ల ప్రజాధనం వృథా

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ పర్యటన తీవ్ర నిరాశ పరిచిందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లాకు ప్రధాని కొత్తగా నిధులు, పథకాలు ప్రకటిస్తారని ఆశించామని, కానీ, జిల్లాకు మొండిచేయి చూపించారని ఆయన విమర్శించారు. ప్రధాని పర్యటన ప్రజా ధనం వృథా తప్ప ఈ పర్యటనతో రాష్ట్రానికి కొత్తగా ఒరిగిందేమి లేదన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లాంటి వాటిపై మోడీ ద్వారా ప్రకటనలు ఉంటాయని ఆశించామని, కానీ, ప్రధాని మాత్రం పసుపు బోర్డును ఏదో కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించారని ఆయన ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్ సభలో మోడీ కుటుంబ పాలన గురించి మాట్లాడారని, కానీ, కుటుంబ దోపిడీ గురించి మాట్లాడలేదని గతంలో ఇదే ప్రధాని కాళేశ్వరం, మిషన్ భగీరథ, సింగరేణి దోపిడీ, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారని, కానీ, ఇప్పుడు వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదని రేవంత్ ప్రశ్నించారు.

ప్రధాని తెలంగాణ వ్యతిరేకి
తెలంగాణ పుట్టుకనే అవమానించిన ప్రధానిని మహబూబ్ నగర్‌కు ఆహ్వానించడంపై బిజెపి క్షమాపణలు చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రధాని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు కాబట్టే విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు పాలమూరు సభకు గైర్హాజరు అయ్యారని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మోడీతో సభలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారన్నారు. 2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఎపిలో కాంగ్రెస్ ఆరు హామీలను అమలు చేశామన్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News