మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : పోచంపల్లి చేనేత కార్మికుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాన ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భరోసా ఇచ్చారు. శీతాకాలం విడిదిలో భాగంగా బుధవారం భూదాన్‌పోచంపల్లి సందర్శనకు వచ్చిన ఆమె తొలుత భూదాన్‌పోచంపల్లిలోని శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కంట్రోల్ యూనిట్స్‌ను సందర్శించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్‌ను సందర్శించి నూలు నుండి వస్త్ర ఉత్పత్తి పరిణామ క్రమాన్ని తెలియజేసే చేనేత స్టాళ్లను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆచార్య వినోబా భావే చిత్రపటానికి రాష్ట్రపతి పూలమాల వేసి, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. మహిళలు చరఖాలతో నూలు వడకడాన్ని రాష్ట్రపతి పరిశీలించారు.
చేనేత కళను వారసత్వంగా అందించడం గొప్పది
చేనేత రంగంలో జరుగుతున్న కృషి చాలా గొప్పదని, ఈ కళను వారసత్వంగా మరొకరికి అందించడం అభినందనీయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అనంతరం సభా వేదికలో ప్రసంగిస్తూ ‘మిమ్ములనందర్నీ ఇలా కలవడం, మీ మధ్యలోకి ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు. గ్రామీణ ప్రజలకు చేనేత రంగం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రతిరోజూ 35 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు అని అన్నా రు. తెలంగాణలో నేసిన వస్త్రాలు ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచాయని, పోచంపల్లి, వరంగల్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట వస్త్రాలకు ఒక ప్రత్యేకత ఉన్నదని,
వీటికి జిఐ టాగ్ వచ్చిందని అన్నారు. చేనేత రంగాన్ని భవిష్యత్ తరాలకు తీసుకువెళుతున్న కార్మికులు నేసే చీరలను చూసి ఆనందం కలిగిందని, ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగమని అన్నారు. యూఎన్‌డబ్లుఒ ప్రపంచ పర్యాటక రంగంలో 2021 సంవత్సరంలో పోచంపల్లి ప్రాంతాన్ని పర్యాటక గ్రామంగా ప్రకటించడం పట్ల మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. సంస్కృతి పరంపర పరిరక్షణను, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళుతున్నారని, శాస్త్ర సాంకేతిక రంగం లో కార్మికుల కృషి ప్రశంసనీయమని, గురు శిష్య పరంపరను కొనసాగిస్తున్నారని, చేనేత రంగంలో కొత్త ఒరవడికి కృషి చేస్తున్న అందరికీ అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.
ప్రభుత్వ కృషికి అండగా నిలబడండి
చేనేత రంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా ఉండాలని రాష్ట్రపతి ముర్ము హితవు పలికారు. చేనేత రంగంలోని సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తమ ప్రాంతం నుండి కొంతమందిని ఇక్కడి తీసుకొచ్చి చేనేత రంగం పనితీరును పరిశీలించనున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే అన్ని సౌకర్యలు వినియోగించుకొని మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఫ్యాషన్ డిజైన్ రంగంలో నేతన్నల కృషి భేష్
ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమని, చేనేత కళను భావితరాలకు అందించడం కోసం చేస్తున్న ప్రయత్నం హర్షణీయమని కొనియాడారు. పోచంపల్లి చేనేత కార్మికులు ఇ చ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుంటానని, పోచంపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.
పోచంపల్లిలో యార్న్ డిపో ఏర్పాటు
చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భూదాన్‌పోచంపల్లికి చెందిన చేనేత కార్మికులు మాట్లాడారు. ఆజాదీ కా అమృత్ వేడుకల్లో భాగంగా తమ డబుల్ ఇక్కత్ ప్రదర్శన చేసుకోవాల్సి రావడం అదృష్టమని డబల్ ఇక్కత్‌లో నిపుణురాలు, కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం గ్రహీత భోగ సరస్వతి అన్నారు. నూలు యార్న్ సరిగ్గా సరైన సమయంలో అందడం లేదన్నారు. యార్న్ డిపో పోచంపల్లిలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం లోక శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ.. చేనేతకు సంబంధించిన జాతీయ సంస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమను కార్మికులుగా కాకుండా కళాకారులుగా గుర్తించాలని వేడుకొన్నారు. కూరపాటి వెంకటేశం మాట్లాడుతూ..
ఇక్కత్ పట్టు చీరల అమ్మకాలకు ప్రచారం కల్పించాలని కోరారు. పోచంపల్లి పట్టు చీరలకు బ్రాండ్ కల్పించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.పోచంపల్లికి హెలికాప్టర్‌లో వచ్చిన రాష్ట్రపతికి వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంఎల్‌ఎ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచన షా, చేనేత శాఖ రాష్ట్ర కార్యదర్శి అలుగు వర్షిణి, కలెక్టర్ హనుమంతు కె.జండగే, యాదాద్రి భువనగిరి జోన్ డిసిపి రాజేష్‌చంద్ర తదితరులు స్వాగతం పలికారు.
రాష్ట్రపతి పర్యటనలో అపశ్రుతి
బందోబస్తులో ఉన్న పోలీసులకు గాయాలు
కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో వచ్చిన హెలికాప్టర్లు ల్యాడింగ్ అవుతున్న సమయంలో వీచిన గాలికి బందోబస్తులో వున్న పోలీసుల్లో పలువురు ఎగిరి పడ్డారు. ఉప్పల్ ట్రాఫిక్ ఎసిపి చెయ్యి విరిగింది. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు కావడంతో ఈ ముగ్గుర్నీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.