Thursday, January 16, 2025

బాన్సువాడకూ సెంటిమెంట్ ఉంది!

- Advertisement -
- Advertisement -

మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా ఇక్కడ ఆసక్తికరంగా ఎన్నికలు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలు నియోజకవర్గాల్లో వ్యక్తులు గెలుస్తే మరికొన్ని చోట్ల పార్టీ జెండా గెలుస్తుంది. కానీ, బాన్సువాడలో మాత్రం పేరు గెలుస్తుందంటూ ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. అక్కడ జరిగిన 16 అసెంబ్లీ ఎన్నికల్లో 10 సార్లు ఒకే పేరున్న అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ ఎన్నికల్లో రకరకాల సెంటిమెంట్లు వర్కవుట్ అవుతుంటాయి. కొన్ని సార్లు పార్టీ ఏదైనా సరే వ్యక్తిని బట్టే విజయం వరిస్తుంది. ఇంకొన్నిసార్లు మాత్రం నిలబడిన అభ్యర్థి ఎవరైనా పార్టీ జెండానే గెలిపిస్తుంటారు.

ఈ నియోజకవర్గంలో మాత్రం ముందు రెండింటికీ భిన్న పరిస్థితులు నెలకొనడం విశేషం. కామారెడ్డి జిల్లాలోనే బాన్సువాడ నియోజకవర్గం అందరికీ సుపరిచితమే. 1952లో బాన్సువాడ నియోజకవర్గం ఏర్పడగా ఇప్పటివరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా ఈ 16 ఎన్నికల్లో 10 సార్లు ఒకే పేరున్న అభ్యర్థులే ఎమ్మెల్యేలు గెలుపొందటం గమనార్హం. ఆ పేరు ఏదో కాదు ‘శ్రీనివాస్‘. అయితే ఇది యాదృశ్చికమో, కాకతాలీయమో తెలియదు కానీ, మొత్తానికి మెజార్టీ ఎన్నికల్లో శ్రీనివాస్ అని పేరున్న అభ్యర్థులే ఎక్కువ సార్లు గెలుపొందటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన శ్రీనివాస్ రావు
అయితే బాన్సువాడలో 2018 ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా ఈసారి కూడా ఆయనే బరిలో ఉన్నారు. దీంతో ఈ శ్రీనివాస్ అనే సెంటిమెంట్ మీద సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే 1952 నుంచి 2018 వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 1952లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి సంఘం లక్ష్మిబాయి విజయం సాధించారు. 1957లోనూ కాంగ్రెస్ నుంచి సీతాకుమా రి గెలుపొందారు. ఇక 1962లో మాత్రం మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందగా ఆ తర్వాత 1967, 1972, 1978లో జరిగి మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.శ్రీనివాస్ రావు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు.

నాలుగు సార్లు పోచారం గెలుపు
ఇక అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అడ్డగా ఉన్న బాన్సువాడ 1983 నుంచి టిడిపికి అడ్డాగా మారిపోయింది. 1983లో టిడిపి నుంచి కిషన్ సింగ్ అనే అభ్యర్థి గెలుపొందగా 1985లోనూ టిడిపి అభ్యర్థి సుర్య దేవర విజయం సాధించారు. ఇక 1989లోనూ టిడిపి అభ్యర్థి కత్తేర గంగాధర్ గెలిచారు. ఆ తర్వాత జరిగిన 1994లో టిడిపి తరపున బరిలోకి దిగిన పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయ ఢంకా మోగించారు. ఆ తర్వాత 1999లోనూ పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. అయితే 2004లో మళ్లీ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన బాజిరెడ్డి గోవర్దన్ విజయం సాధించారు.

మళ్లీ 2009లో టిడిపి తరపున పోటీ చేసి గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత టిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి వరుసగా 2011, 2014, 2018లో విజయం సాధించారు. దీంతో బాన్సువాడలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి రికార్డు బ్రేక్ చేశారు. ఇలా మొత్తంగా చూసుకుంటే 1962లో శ్రీనివాస్ రెడ్డి గెలవగా, 1967 నుంచి 1978 వరకు జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఎం శ్రీనివాస్ రావు, 1994, 1999 ఎన్నికల్లో రెండు సార్లతో పాటు 2009 నుంచి 2018 వరకు వరుసగా నాలుగుసార్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు.

దీంతోపది సార్లు శ్రీనివాస్ అనే పేర్లు ఉన్నవాళ్లే అందులోనూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరు సార్లు గెలవటం గమనార్హం. శ్రీనివాస్ అనే పేరుతో బాన్సువాడ నియోజకవర్గానికి ఏదో అవినాబావ సంబంధం ఉంద ని జనాలు ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఈసారి కాంగ్రెస్ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి, బిజెపి నుంచి యెండల లక్ష్మీనారాయణ పోటీలో దిగుతున్నారు. బిఆర్‌ఎస్ నుంచి మాత్రం ఈసారి కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డే బరిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News