Monday, December 23, 2024

వృద్ధులకు ఇళ్ళలో గౌరవం పెరిగింది: పోచారం

- Advertisement -
- Advertisement -

Pocharam Srinivas Reddy distributed aasara pension

కామారెడ్డి: దేశంలో అత్యధిక మంది పేదలకు ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీర్కూరు మండలం దామరంచ, అన్నారం, రైతునగర్ గ్రామాలలో మంగళవారం పర్యటించారు. గ్రామాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం అనంతరం జరిగిన గ్రామ సభలలో పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ… వృద్ధులు, వికలాంగులతో పాటుగా వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బోదకాలు బాధితులకు పెన్షన్లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పెన్షన్ లతో వృద్ధులకు ఇళ్ళలో గౌరవం పెరిగిందన్నారు. ఇంటికి పెద్ద కొడుకుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వృద్దులకు పెన్షన్ ఇస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 45 లక్షల మందికి పెన్షన్లు అందుతాయి. మన కంటే పెద్ద రాష్ట్రాలు అయిన గుజరాత్ లో కేవలం 12.40 లక్షల మందికి, మహారాష్ట్ర లో 31.50 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు.

ఆసరా పెన్షన్ల కోసం నెలకు రూ. 1,250 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 15,000 కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తుంది. బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం 40,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్ రూ. 2016 మరియు వికలాంగులకు ఇస్తున్న రూ. 3016 దేశంలోనే అత్యధికం. ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడా పెన్షన్ రూ. 750 లు మాత్రమే. అది కూడా 80 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే ఇస్తున్నారు. కేరళలో 75 ఏళ్ళు దాటిన వారికి పింఛన్ రూ. 1000 ఇస్తున్నారు. రాజస్థాన్ లో 75 ఏళ్ళు దాటిన వృద్ధులకు రూ. 750 ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అందరికీ పెన్షన్ రూ. 500 లు మాత్రమే. కేరళ లో రూ. 1400 మాత్రమే పశ్చిమ బెంగాల్ రూ. 1000. పంజాబ్ లో రూ.800, తమిళనాడులో రూ.1000 మాత్రమే. కొన్ని చిన్న రాష్ట్రాలలో అయితే రూ.200 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లను ఆమలు చేసి చూపించండి. ప్రభుత్వ పథకం అందని ఇళ్ళు రాష్ట్రంలో లేదన్నారు.

ప్రభుత్వ పథకాలు కుల మతాలకు, పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ అందుతున్నాయి. ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్ అందరికీ అందుతున్నాయి. ఎంత కష్టమైనా రాష్ట్ర ప్రభుత్వం కాంటాలు పెట్టి ధాన్యాన్ని మద్దతు ధరతో కొంటుంది. కేంద్ర ప్రభుత్వం కొనను అంటుంది. రైతు ఆనందంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది. ఉచితంగా కరంటు ఇస్తున్న ప్రభుత్వం కావాలా లేక మీటర్లు పెట్టె ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టనని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. బాన్సువాడ నియోజకవర్గంలో నిజాంసాగర్ కాలువల ఆధునికీకరణ కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేసామన్నారు. ఇప్పుడు చివరి డిస్ట్రిబ్యూటర్ వరకు సాగునీరు అందుతుంది. నియోజకవర్గంలో ఇళ్ళు లేని పేదలందరికి స్వంత ఇంటి కలను నిజం చేస్తాను. ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో అత్యధికంగా పదివేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయ్యాయి. మెజారిటీ ఇళ్ళ నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశారు. త్వరలోనే మూడు లక్షల రూపాయల స్కీం వస్తుంది. అర్హులైన వారందరికీ ఇంటిని మంజూరు చేయిస్తాను. నియోజకవర్గంలో 13,000 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ల ద్వారా రూ. 110 కోట్లు అందించాం. దామరంచ బ్రిడ్జి నుండి చింతల నాగారం చెక్ డ్యాం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ..60 లక్షలు మంజూరు అయ్యారు. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి. బాన్సువాడ ఆర్డీవో రాజా గౌడ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News