Thursday, December 19, 2024

బిఆర్‌ఎస్‌కు బిగ్ షాక్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సిఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి తీసుకున్నామని సిఎం రేవంత్ తెలిపారు. రైతులకు సహకరించే ప్రతి ఒక్కరికి స్వాగతమని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల బాగుకోసం పోచారం ఇచ్చిన సలహాలు స్వీకరిస్తామని సిఎం రేవంత్ అన్నారు.

బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కృషి చేశారని సిఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నామని రేవంత్ తెలిపారు. ప్రభుత్వానికి సహకరించాలని కోరగానే పోచారం ఓకే చెప్పారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అనేలా తమ ప్రభుత్వం చేయబోతుందని, తమది రైతు రాజ్యమని, రైతు ప్రభుత్వమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం: సిఎం రేవంత్
తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్‌లో చేరారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకెళతామని, భవిష్యత్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తామని, నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు పోచారం సహకారం తీసుకుంటామని సిఎం రేవంత్ తెలిపారు.

బలవంతంగా కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి నేను చిన్న పిల్లాడిని కాను: పోచారం
బలవంతంగా తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి తాను చిన్న పిల్లాడిని కానని, రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం పోచారం మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుల సంక్షేమం దిశగా సిఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, ఆయన రైతు పక్షపాతి అని పోచారం కొనియాడారు. తాగునీటి ప్రాజెక్టుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తున్నానన్నారు.

తన ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ పార్టీలో అని, సొంతగూటికి రావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో చేరిక వెనుక రాజకీయంగా ఆశిస్తున్నది ఏమీ లేదని, మంచి ఆలోచనలతో సిఎం ఆహ్వానించారని, అందుకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానని పోచారం తెలిపారు. ప్రగతి కోసం కలిసి ముందడుగు వేయాలని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని, పనిచేసే నాయకత్వాన్ని సమర్ధించేందుకే రేవంత్‌కు మద్ధతిస్తున్నానని, ఆయన నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పోచారం స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రగతికి చేదోడు వాదోడుగా ఉంటా: పోచారం
కొత్త ప్రభుత్వంలో సమస్యలు సహజం అయినప్పటికీ చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి దైర్యంతో వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని పోచారం పేర్కొన్నారు. వారిని, రాష్ట్ర మంత్రి వర్గాన్ని అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. తాను కూడా మంచి ఆలోచనతోనే కాంగ్రెస్‌లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. తన జీవితంలో రాజకీయంగా ఆశించడానికి ఏమీ లేదన్నారు. తాను ఆశించేది రైతుల సంక్షేమని ఆయన అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎక్కువగా రైతులతో సంబంధం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిగా, సహకార వ్యవసాయ బ్యాంకు చైర్మన్‌గా చేశానని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రగతికి చేదోడు వాదోడుగా ఉంటూ రైతుల సంక్షేమం కోసం అందరం సమష్టిగా కృషి చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News