బాన్సువాడ: తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి దేశం మొత్తం కదులుతోందని రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బీర్కూరు వ్యవసాయ మార్కెట్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ… ”తమ రాష్ట్రాలలో కూడా తెలంగాణ పథకాలు కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో దేశంలోనే నెంబర్ వన్.సిఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల పథకాలతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది. రైతులు బాగుపడ్డారు. దేశంలో వరి పంట సాగులో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్. వరి ధాన్యం దిగుబడిలో బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ వన్. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరంటు ఇస్తుంటే, కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టమని చెబుతుంది. మీటర్లు పెట్టె ప్రసక్తే లేదని కేసీఆర్ చెప్పారు. ఎంత కష్టమైనా రాష్ట్ర ప్రభుత్వం కాంటాలు పెట్టి ధాన్యాన్ని మద్దతు ధరతో కొంటుంది. ధాన్యం కొనుగోలు బాధ్యత నుండి కేంద్రం తప్పుకుని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని ఆలోచన చేస్తుంది. రైతులు అధిక ఆదాయాన్ని ఇచ్చే ఇతర పంటల వైపు దృష్టి సారించాలి. ఆయిల్ ఫాం పంటతో రైతులకు 30 సంవత్సరాలు ఆధాయం అందుతుంది. రైతు ఆనందంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది. మహిళలను గౌరవించాలి.. మహిళలను గౌరవించే చోట లక్ష్మీ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను మహిళల పేరు మీదనే అమలు చేస్తుంది.రాష్ట్రం వచ్చిన తరువాతనే ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుంది. ప్రేమతో అక్కా, చెల్లెలకు ఇచ్చే కానుక బతుకమ్మ చీర. చీర ధర కాదు.. ప్రేమ ముఖ్యం. ప్రేమతో ఇచ్చే కానుక విలువైనది. బతుకమ్మ పండుగకు పుట్టింటికి వచ్చిన ఆడపడుచుకు చీర పెట్టడం మన సాంప్రదాయం. అన్నగా, తమ్మునిగా మీకు పండుగ చీర అందిస్తున్నాం. పండుగ రోజు అన్న ఇచ్చిన చీరను కట్టుకునే అక్కా- చెల్లెలి సంతోషం వేరు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ. బాన్సువాడ నియోజకవర్గంలో లక్షా మూడు వేల మంది ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశాం. మంచి మనసున్న ప్రజలు ఉన్న ఊర్లు ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటాయి. గ్రామస్థులు అందరూ సమిష్టిగా ఉంటే అభివృద్ధి సాద్యమవుతుంది” అని పేర్కొన్నారు.
Pocharam Srinivas Reddy speech at Athmiya Sabha in Banswada