Wednesday, January 22, 2025

పోక్సో చట్టం.. మరింత కఠినంగా అమలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్

హైదరాబాద్ : పోక్సో చట్టాన్నీ పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వంలోని వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ జ్యూడిషియల్ అకాడమీ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై సంబంధిత శాఖలు, న్యాయాధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. సదస్సుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ రాధారాణి, జస్టిస్ నందా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డిజిపి మహేందర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్ కీలకోపన్యాసం చేశారు. పోక్సో చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయడం ద్వారా మహిళలు, పిల్లలకు భద్రతా ఏర్పడుతుందని స్పష్టం చేశారు. సిఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ పొక్సో చట్టం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉందని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. చట్టం అమలు పట్ల ప్రభుత్వం కృషిని పలువురు న్యాయమూర్తులు ప్రశంసించారని ఆయన అన్నారు. పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల నేతృత్వంలో ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను ఆయన వివరించారు. ప్రభుత్వం ఇటీవలనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు చేసి 40 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించిందని గుర్తుచేశారు. పొక్సో చట్టం పట్ల అవగాహనా పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, మహిళలు, పిల్లల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. పోలీస్ విభాగంలో ప్రత్యేకంగా అడిషనల్ డిజి నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రత్యేకంగా షీ- టీమ్‌లు, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. బాధిత కుటుంబాలకు, పిల్లలకు సత్వర న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సదస్సులో అడిషనల్ డిజి స్వాతిలక్రా, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి దివ్య, న్యాయశాఖ కార్యదర్శి నర్సింగ్ రావు, జ్యూడిషియల్ అకాడమీ డైరెక్టర్ తిరుమలాదేవి, సుజన. అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News