మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడు దఫాలుగా చర్చించి రూపొందించిన సమగ్ర నివేదిక ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు చేరినట్లుగా తెలుస్తోంది. శనివారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసి మంత్రివర్గ ఉపసంఘం అందించినట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
పోడుభూముల సమస్యపై శుక్రవారం అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో కెసిఆర్ మాట్లాడుతూ, పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టమైన ప్రకటనలో చేశారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని బిఆర్‌కెఆర్ భవన్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు మరోమారు సమావేశమయ్యారు. ఇప్పటికే రెండు దఫాలుగా మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించింది. పోడు భూముల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు, వాటిని ఏ విధంగా పరిష్కరించాలన్న అంశంపై వివిధ కోణాల్లో లోతుగా సమీక్షించారు.
మూడు దఫాలుగా జరిగిన మంత్రివర్గ ఉపసంఘంలో తీసుకున్న నిర్ణయాలపై రూపొందించిన వివరాలను నివేదిక రూపంలో సిఎం కెసిఆర్‌కు అందజేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌ఒఆర్ పట్టాలు ఇచ్చిన 3లక్షల 80 వేల ఎకరాలతో పాటు మరో ఆరేడు లక్షల ఎకరాల పోడుభూములున్నట్లు సమాచారముందని రెండు రోజుల క్రితం జరిగిన అసెంబ్లీలో సిఎం కెసిఆర్ చాలా స్పష్టంగా చెప్పారు.
మొత్తంగా పది లక్షల ఎకరాల్లో పోడు భూముల సమస్య నెలకొందని సభ దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆర్‌ఒఆర్ పట్టాలు ఇచ్చిన వారికి రైతుబంధు ఇచ్చేందుకు కృషి చేస్తామని, ఇందుకోసం 2005 కటాఫ్ గడువును పొడిగించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపుతామని అవసరమైతే అఖిలపక్ష నేతలతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని పరిష్కరించాలని కోరనున్నట్లు చెప్పారు. ఈ తరుణంలోనే పోడు భూముల సమస్యలపై చర్చించి రూపొందించిన తుది నివేదికను సిఎంకు అందజేశారు.