Tuesday, December 24, 2024

పచ్చనాకుల నెత్తుటి గాయం

- Advertisement -
- Advertisement -

అది వసంత రుతువు ముగిసి వేసవి మరింత ముదురుతున్న కాలం అక్కడ రాలిపడ్డవి ఎండుటాకులు, రాలకులు కాదు అడవి నుంచి వరుసబెట్ట్టి వచ్చిన పచ్చనాకులు తమ హక్కుల కోసం, జీవనం కోసం, అడవి ఉత్పత్తులపై ఆధిపత్యం కోసం, పోడు వ్యవసాయం కోసం నినదించిన పాపానికి గుండ్ల వర్షం కురిపించగా అడవి అంతా నెత్తురుమయమై ఎందరో ఆదివాసులు నేలకొరిగారు. మూగజీవులైన ఆదివాసులపై తూటాల వర్షం కురిసి ఎంతో మంది గిరిజనులు తమ ప్రాణాలు కోల్పోయినారు. ఈ గిరిజన పోరాటం ఖండాంతర ఖ్యాతిని పొంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పోరాటంగా చరిత్రకెక్కింది. అనేక దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసులు కూడు లేక కనీస సౌకర్యాలు లేక జల్ జంగిల్ జమీన్ అనే అటువంటి నినాదం మీద సమీకృతం అవుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో 52% భూభాగం అడవులతోటి నిండి ఉంటుంది. ఆదివాసీలపై ఒకవైపు ఫారెస్ట్ సిబ్బంది దౌర్జన్యాలు అణచివేత ఉండగా, మరోక వైపు షావుకార్ల దోపిడీ విపరీతంగా కొనసాగేది. తిండిలేక వారు విషపు గడ్డలు, కందలు తిని బతికే పరిస్థితులు. స్వాతంత్య్రం రాక పూర్వ పరిస్థితుల ఎలా ఉండెనో 1981 నాటికి కూడా ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల దుస్థితి అలాగే ఉంది. అభివృద్ధి లేక దారులు లేక గూడాలలో వాగులు వంకలు దాటుకొని ఇప్పపువ్వు, బంక, తేనె లాంటి అటవి ఉత్పత్తులపై ఆధారపడి బతికేవారు. అడవిలో గోండు కొలాం, కొయితూర్, కోయ తదితర 7 జాతుల ఆదివాసులు జీవిస్తుంటారు. గిరిజనులలో ఒక హక్కుల కోసం అలజడి మొదలైంది. గిరిజనుల గూడాలలోకి పొరకల దొరలు (అన్నలు) రంగ ప్రవేశం చేశారు. శ్రీకాకుళం పోరాటానంతరం 1978లో జగిత్యాల, సిరిసిల్ల, రైతాంగ పోరాటాల నిప్పురవ్వ క్రమంగా ఆదిలాబాద్ జిల్లా గిరిజన గూడాలలోకి పాకింది. జిల్లాలోని తూర్పు ప్రాంతానికి చెందిన విప్లవ నాయకులు గిరిజన గ్రామాలల్లోకి వెళ్ళి గోండు భాషను, వారి సంస్కృతిని నేర్చుకొని వారి సమస్యలపై వారిని చైతన్య పరచడం మొదలుపెట్టారు.

గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటే ఫారెస్ట్ అధికారుల, చౌకీదారుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయబడినది. ఈ క్రమంలో ఉట్నూరు సమీపంలోని పలు గోండు గ్రామాలైన పిప్పల్‌దరి, కేస్లీ గూడ, దస్నాపూర్, తిప్పిరి, పిట్టబొంగారం తదితర గ్రామాలో గిరిజనులు చేసుకుంటున్న పోడు వ్యవసాయాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని కేసులు బనాయించారు. అయినా ఆదివాసులు తమ పోడు వ్యవసాయం కోసం గుట్టలపైన, కొండలపైన కొనసాగిస్తూ ఉండేవారు. జొన్నలు, మక్క, కందులు, పత్తి, సోయ తదితర పంటలను పండించేవారు. ఈ క్రమంలో ఫారెస్ట్ వారు గిరిజనుల పోడు వ్యవసాయాన్ని అడ్డుకోవడానికి పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని గోండు గ్రామాలపై ఉసి కొల్పారు. ఇలాంటి సమయంలో ఉట్నూరు సమీప గ్రామాలలో పోడు చేసుకుంటున్న గిరిజనులను అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను ఎదురించి ఏడుగురు పోలీసులను అడ్డుకొని తరిమికొట్టారు. దీనితో ఈ ప్రాంతంలోని గ్రామాల గిరిజనులపై పోలీసుల వేధింపులు, నిఘా పెరిగింది.గిరిజనులలో అన్నల సంబంధాలు, కార్యకలాపాలు మరోవైపు విస్తృతమైనవి.

ఆకుల రేట్లు, కూలీ రేట్లు, ఇతర వారి హక్కుల కోసం వారు పోరాట కార్యక్రమాలు మొదలుపెట్టినారు. పీపుల్స్‌వార్‌కు చెందిన జిల్లాలోని అగ్ర నాయకులు గిరిజన హక్కుల కోసం పోరాడేందుకు, గిరిజన రైతు కూలీ సంఘాన్ని 1981 ఆరంభంలోనే ఏర్పాటు చేసి మొట్టమొదటి సభను ఉట్నూరు తాలుకాలోని ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న నిర్వహించ తలపెట్టినారు. అయితే ఈ సభను విజయవంతం చేయాలనే సంకల్పంతో వార్ నాయకులు నెల రోజుల ముందు నుండే సన్నాహక కార్యక్రమాలను ప్రారంభించారు. అప్పటికే జిల్లాలో నలుదిశల వారి కార్యక్రమాలు వ్యాపింప జేస్తున్న నాయకులలో ఇరుగురు ప్రధాన అగ్ర నాయకులైన గజ్జెల గంగరాం, ఆనంద్ లు ఈ కార్యక్రమం విజయవంతానికి పూర్తిగా పూనుకున్నారు. వీరిని అనుసరిస్తూ సాగర్ బందెల రాములు, పులి మధునయ్య అజ్ఞాతంగా గిరిజనుల్లో పట్టు సాధిస్తూ గిరిజనుల్లో సంఘాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇంద్రవెల్లి సభ కోసం దాన్ని అన్ని విధాలుగా సక్సెస్ చేసేందుకు 20 మంది వరకు యువకులను 20 రోజుల ముందే ఆదిలాబాద్‌కు పంపించి అక్కడ ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్ , జయనూర్ ఏరియాలలో పలు కార్యక్రమాలను చేపట్టారు.

చందాలు పోగు చేయడం, కరపత్రాలు పంచడం, ప్రచారం చేయడం, సాంసృ్కతిక కార్యక్రమాల శిక్షణ ఇవ్వడం, వాల్ రైటింగ్ పోస్టర్లు వేయడం వంటి మొత్తం సభా కార్యక్రమాలన్నీ ఆనంద్ పర్యవేక్షణలో విస్తృతంగా నడుస్తుండేవి. పోస్టర్లు, కరపత్రాలు, మరాఠి, హిందీ, తెలుగు భాషల్లో అచ్చు వేసినారు. ఈ గిరిజన సంఘానికి గోండు తెగకు చెందిన కటియాను కార్యదర్శిగా పెట్టినారు. సభ పర్మిషన్‌కు అతడినే డి.ఎస్.పి వద్దకు పంపిస్తే పోలీసులు అటే అరెస్ట్ చేసినారు. సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. 4 రోజుల ముందు నుండే ఆదిలాబాద్, ఉట్నూరు చుట్టు ప్రక్కల ప్రాంతాలలో నిర్బంధం, నిఘాను పెంచారు. ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీ ముందు ఒక రూంను అద్దెకు తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతిని పోలీసులు పసిగట్టినారు.
బెల్లంపెల్లి ఏరియా నుండి అధికంగా కాగజ్‌నగర్ ఏరియా నుండి కొందరు వచ్చి ముమ్మరంగా ప్రచారాలు చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్టులు చేసినారు. అదిలాబాద్‌లో గిరిజన నేత కటియాతో పాటు కొందరిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో వాల్ పోస్టర్లు వేస్తున్న వారిని సభకు 2 రోజుల ముందే అరెస్టులు చేసినారు. గదిపైన దాడి చేసి 15 మంది పైగా యువకులను తీసుకు వెళ్ళినారు.

మొత్తం సభ జరుగకుండా 144 సెక్షన్‌ను విధించి నిషేధాజ్ఞలను ప్రకటించినారు. అయినా ఈ విషయం తెలియని గిరిజనులు 1981 ఏప్రిల్ 20, సోమవారం ఇంద్రవెల్లి సభకు భారీ ఎత్తున తరలిండ్రు. ఉట్నూరు, ఇంద్రవెల్లి చుట్టుప్రక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున తుడుం మోగిస్తూ బుర్రలు ఊదుతూ, నినదిస్తూ గిరిజన వేషధారణతో గుస్సాడి నృత్యాలతో సభకు తరలినారు. తాకతాకమున్నెతాక కోయదాద రగల్‌జెండాకే అంతాన్ కోయదాద అని పాటలు పాడుతూ వస్తుండగా అడుగడుగున పోలీసులు వారిని నిలువరించినారు. ఇంద్రవెల్లి రహదారులన్నీ మూసివేసినారు. ఆ రోజ ఇంద్రవెల్లిలో వార సంత ఉండడం వల్ల సంతకు వచ్చేవారు కూడా చేరుకుంటున్నారు. మరోదిక్కు ఇందిరావాయి దేవత జాతరకు కూడా వస్తున్నారు. దీనితో ఇంద్రవెల్లి పట్టణం కోలాహలంగా మారింది. పోలీసులు ఒకవైపు హెచ్చరిస్తున్నారు, పోలీసులు చెట్ల మీద కూడా చేరుకొని నిఘా పెట్టి ఉంచినారు. సభాస్థలి నిండిపోడంతో చెదరగొట్టే ప్రయత్నం చేసినారు. అయినా గిరిజనులు వెనుదిరగకపోవడంతో అక్కడే ఉన్న ఆర్‌డిఒ గిరిజనులపై ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చినారు.

దీనితో ఆదివాసులపైన పోలీసులు తూటాల వర్షం కురిపించినారు. గిరిజనులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పరుగెత్తినారు. అనేక మంది తూటాలకు నేలకొరిగినారు. ఒక మహిళపైన అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసును తన చేతిలో ఉన్న కొడవలితో పోలీసును రెండుగా చీల్చింది. 63 మంది గిరిజనులు అక్కడ నేలకొరిగినారు. ఇది దేశంలో మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా మారినది. హక్కుల కోసం ఐక్యతను ప్రకటించిన మూగజీవాలపై తుపాకులతో ప్రభుత్వం సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా దేశంలోని ప్రజాస్వామిక శక్తులు నివ్వెరపోయాయి. కేవలం 13 మందే చనిపోయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. గిరిజన సంఘాలు 20 మంది పేర్లను సేకరించి ప్రకటించింది.

ఈ ఘటనలో చనిపోయిన వారిలో.. పిట్టబొంగరంకు చెందిన మడావి రాము, కోట్నక్ ఘగృ, మండా జంగు, ఎర్మదేవ్‌రావు, వెట్టి ఇస్రుబాయి, వడగాం నుండి కనక సోము, జాకెట్ గూడకు చెందిన డోంగురావు, ఎగోతిరావు, తొడసం భీంరావు (జోరుపల్లి) కుమ్మర కొద్దు (ఖన్నాపూర్), పెందోర్ దేవ్‌రావు (నిజాంగూడ), ముత్తు (గౌరపూర్), కోవరాం (డోంగల్ గ్రాం), హేరే కొమ్రా (బోజర్‌గూడ), అరక గంగు(మోహన్‌గూడా), చిడాం బాపురావు (బంగారు గూడ), మెస్రం సురేష్ (మామిడి గూడ) పెందోర్ బండు (ఇచ్చోడ), పెందోర్ గంగు (సిరికొండ) వున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ మహత్తర తిరుగుబాటు పాలక వర్గాలను కుదిపివేసింది. గిరిజనుల సమస్యలను ఏనాడూ గుర్తించని ప్రభుత్వాలు ఉలిక్కిపడ్డాయి. ఒక్కసారిగా వారు వారి హక్కుల కోసం నినదించడంతో వారిని కాల్చిన చంపిన ఘటన భారత దేశంలో ప్రజాస్వామిక శక్తులను ఆలోచింపజేసినది.42 సం॥లు గడిచినప్పటికీ ఇంద్రవెల్లి పోరాట నెత్తుటి గాయం అక్కడి ప్రజలు, గిరిజనులు ఇంకా మరిచిపోలేదు.

1983లో అమరవీరుల స్థూపాన్ని గిరిజనుల రైతు కుల సంఘం ఆధ్వర్యంలో నిర్మించుకొని స్మరించుకుంటే మళ్ళీ పోలీసులే 1985లో ఆ స్థూపాన్ని కూల్చివేసినారు. తిరిగి మళ్ళీ 1986 తర్వాత మళ్ళీ ప్రభుత్వమే అక్కడ స్థూపాన్ని నిర్మించి ప్రభుత్వ ఆధ్వర్యంలో గోండులకు ప్రతి యేడు నివాళులు అర్పిస్తూ రావడం జరిగింది. ఇంద్రవెల్లి మారణకాండ భారతదేశ ఆదివాసుల జీవితాలలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అప్పటి నుండి గిరిజనుల సమస్యల మీద వారి జీవన ప్రమాణాల మీద ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకు వస్తున్నప్పటికీ గిరిజనుల జీవితాల్లో ఇంకా పూర్తి స్థాయిలో ఎలాంటి మార్పులు జరగడం లేదు. ఒక బిరుసా ముండా, ఒక కొమురం భీం, ఒక అల్లూరి సీతారామరాజు వంటి అనేక చరిత్రాత్మకమైన పోరాటాలతో పాటు ఇంద్రవెల్లి తిరుగుబాటు దేశంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి గిరిజన పోరాటంగా ప్రసిద్ధికెక్కింది.

ఏబూసి ఆగయ్య
9849157969

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News