Monday, December 23, 2024

పోడు ప్లాంటేషన్ మాదే

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : జీవనం కోసం సాగు చేసుకుంటున్న పోడుకు ప్రత్యామ్నాయం చూపుతామని నమ్మించి తమ పోడులో ఫారెస్టు అధికారులు ప్లాంటేషన్ వేశారని, ప్రత్యామ్నాయం పోడు చూపలేదంటూ ప్లాంటేషన్ బాధితులు బుధవారం కారేపల్లి పారెస్టు కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో అందోళనకు దిగారు. ప్లాంటేషన్ పోడు మాదేనని దానిని సర్వే చేసి హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయం చూపే వరకు పోడు ప్లాంటేషన్ ను వదిలేది లేదని తేగేసి చెప్పారు.

అందోళన విషయం తెలుసుకున్న కారేపల్లి ఎస్పై పుష్పాల రామారావు ఫారెస్టు రేంజ్ కార్యాలయానికి చేరుకోని అందోళనకారులతో చర్చించారు. తమకు న్యాయం చేయాలని ప్లాంటేషన్ బాధితులు వేడుకున్నారు. ఈసంధర్బంగా సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారులు ప్లాంటేషన్‌కు ప్రత్యామ్నాయ భూమి చూపటంలో అలసత్వం కారణంగానే ప్లాంటేషన్ ధ్వంసం, ఉద్రిక్తత పరిస్థితులు దాపురించాయన్నారు. కారేపల్లి మండలం మాణిక్యారం, ఎర్రబోడు పంచాయతీలలోని 38 కుటుంబాలకు చెందిన 93 మంది పోడు సాగు చేసుకొని జీవిస్తున్నారన్నారు.

పోడులో ప్లాంటేషన్ వేయాలని ఫారెస్టు ఉన్నతాధికారుల ఒత్తిడితో పోడు సాగుదారులతో 2020లో స్ధానిక ఫారెస్టు అధికారులు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ప్లాంటేషన్ బాధితులు తాము సాగు చేసుకుంటున్న పోడు భూమిలో సగం ప్లాంటేషన్‌కు మిగతాది వ్యవసాయం చేసుకోవటానికి అంగీకరించారని గుర్తుచేశారు. దానికి సమ్మతి తెల్పిన ఫారెస్టు, ప్రత్యామ్నాయంగా మిగతావారి దగ్గర నుండి కొంత భూమిని సేకరించి బాధితులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్లాంటే ప్లాంటేషన్‌లో పోడు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపక పోవటంతోనే ప్లాంటేషన్ వద్ద అధికారులు, బాధితులకు మధ్య ఉద్రిక్తత పరిస్థితి తలెత్తుతుందన్నారు.

ఇప్పటికైనా ఫారెస్టు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ప్లాంటేషన్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పోడు భూముల కోసం చేసిన పోరాట సందర్బంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫారెస్టు రేంజర్ సిద్దార్ధరెడ్డి, ఎస్సై పుష్పాల రామారావులకు వినతి పత్రం అందజేశారు. ఉద్రిక్తతలు సౄష్టించవద్దు – ఎఫ్‌ఆర్వో పోడు ప్రాంతంలో వేసిన ఫారెస్టు ప్లాంటేషన్ వద్ద ఉద్రిక్తతలు సృష్టించొద్దని బాధితులను ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సిద్దార్ధరెడ్డి కోరారు. వినతిపత్రం తీసుకున్న అయన మాట్లాడుతూ బాధితుల సమస్యపై ఆలోచిస్తామని, ఆవేశంతో ప్లాంటేషన్ ధ్వంసం, అధికారులను బెదిరించటం వంటి చర్యలకు పాల్పడొద్దన్నారు.

బాధితుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్ళి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు, కరపటి సీతారాములు, పోడు సాగుదారులు సరిత, కళావతి, అరుణ, సుగుణ, కౌసల్య, జాటోత్ హరికిషన్, బానోత్ రమేష్, కాంపాటి రమేష్, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News