Sunday, November 17, 2024

కాలం మాట్లాడుతుంది

- Advertisement -
- Advertisement -

కవిత్వం ఆస్వాదిస్తే, మనసు పెట్టి మాట్లాడిస్తే మనిషిలో ప్రశ్నలు మొలిపిస్తుంది. సందర్భానుసారంగా బుజ్జగిస్తుంది, రెచ్చగొడుతుంది, ఉద్యమింప చేస్తుంది. మొత్తంపై చలనశీలంగా మారుస్తుంది. తనతో పాటు ప్రయాణింపజేసి తన లోకంలోకి తీసుకెళ్తుంది.
గతంలో పత్రికలలో కవితలు ప్రచురితమైతేనే కవులకు గుర్తింపు వచ్చేది. దానివల్ల చాలామంది మొదట్లోనే తుంచేయబడేవారు.కాలం మారింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాట్సాప్, ఫేస్ బుక్ లలో కవిత్వ వేదికలు పెరుగుతున్నకొద్దీ కవులు, కవయిత్రుల సంఖ్య ఎక్కువైంది. వందలాది మంది కవుల సాహిత్యం వెలుగులోకి వస్తున్నది. తమలోని భావాలను అంతర్ముఖంగా ఇంతకాలం అణచి వేసుకున్న వారు తమ సాహిత్యాన్ని విరివిగా వెలువరిస్తున్నారు. ఆ క్రమంలోనే మహారాష్ట్రలోని నవీ ముంబయికి చెందిన సావిత్రి రంజోల్కర్ కవిత్వం విరివిగా రాస్తున్నారు. ’ఆశల ఆమని’ పేరిట తొలి కవితా సంపుటి వెలువరించిన ఆమె ‘కాలం మాట్లాడుతుంది’ పేరుతో రెండవ కవితా సంపుటిని ప్రచురించారు. ఆ కవిత్వంలోకి పయనిస్తే…..
ప్రకృతి ప్రజలందరికీ లభించిన సహజసిద్ధ వరం. దానిపై పెత్తనం చేయడం, విధ్వంసం చేయడం కాదు, దాన్ని కాపాడుకోవాలని చాలా మంది కోరుకుంటారు. కానీ స్వార్థపరులైన పాలకుల చర్యల వల్ల అడవులు, గుట్టలు మొదలైనవన్నీ తరిగిపోతున్నాయి. తన మేధావి తనానికి ఎదురులేదని మనిషి భావించిన తరుణంలో కరోనా వైరస్ ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పింది. దాని దాటికి లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. అనేక మంది కవులు కరోనా మహమ్మారిపై కవితలు రాయకుండా ఉండలేక పోయారు. ఈ విపత్తుపై స్పందించిన వారిలో సావిత్రి రంజోల్కర్ ఒకరు. ఆమె తన కవితల్లో కరోనా మహమ్మారి మాయలాడి సృష్టించిన దయనీయ పరిస్థితిని ప్రస్తావించారు.
నాలుగు గోడల లోనే/ వేసే… అడుగులు../ అయిన దానికీ కాని దానికీ/ కడిగే.. చేతులు/ ఏది తాకితే ఏమవుతుందో.., / దేంట్లో ఏముందో.. అని/ మదిలో మెదిలే అనుమానం/కారు మేఘాలు/ అంటూ ఎదురు చూపులు కవితలో ప్రస్తావించారు.
మాయదారి మహమ్మారి/ రెండేళ్లుగా మనుషులను మసి చేస్తుంటే/ వాసంతపు సవ్వడి సడి చేయకుండా/ సందులో దూరింది/ అని వాసంతపు సవ్వడి కవితలో పేర్కొన్నారు.
ఔను మరి.. మనం/ చీమలనుకున్నాం/ పామై కరిచింది/ గొంతులో వెలక్కాయ ఇరుక్కున్నట్లు/ పెడుతున్న ఇక్కట్లు అంటూ/ యుద్ధం ఇంకా మిగిలే ఉంది కవితలో స్పష్టంగా చెప్పారు. కరోనా లాంటి వైరస్ లతో నిరంతర పోరు తప్పదని స్పష్టం చేశారు.
సాహిత్యం ఎప్పుడూ సమాజ హితం కావాలి. టార్చ్ లైట్ లా దారి చూపుతూ సమాజాన్ని మంచి దారిలో నడిపించాలి. అదే విషయాలు సావిత్రి రంజోల్కర్ కవి సైనికులమై కవితలో స్పష్టం చేశారు. అక్షరాలను అమ్మ రూపంతో పోల్చి అవి మానవ కళ్యాణానికి తోడ్పడాలని కోరారు. అనవరతం అక్షర గాండీవాలను ఎక్కుపెడితేనే మన వంతు కర్తవ్యం నిర్వర్తించినట్లని చాటారు.
అమ్మ రూపాలైన అక్షరాలు/ అమ్ములపొదిలో అస్త్రాలైతేనే/ సమాజానికి పట్టిన మాయదారి/ మహిషాసురులను తుద ముట్టించే/ మారణాయుధాలవుతాయని చాటిచెప్పారు.
మనిషిగా పుట్టినందుకు/ మనం చేసే మానవత్వపు సంతకమే/ తోటివారికి తోడు నిచ్చే ఆలంబనగా/ నా జీవిత చదరంగానికి/ అక్షరాలే సైనికులు అంటూ అక్షరమే నా శ్వాస కవితలో వెల్లడించారు.
రాష్ట్రంలో, దేశంలో పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి ఆత్మహత్యకు గల కారణాలను వెతికి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు కానీ వారి ఆత్మహత్యలు నివారించలేక పోతున్నారు. అదే విషయాన్ని ఆమె అక్షర సేద్యం కవితలో ఇలా ప్రస్తావించారు.
‘నేటి భారతంలో/ కలం సేద్యం మూడుపువ్వులు/ ఆరు కాయలవుతుంటే/ హలం సేద్యం మాత్రం/ మూడు ఆత్మహత్యలు/ ఆరు వేల అప్పుల్లో మునుగుతున్న చోద్యం/ ముక్కు మీద వేలు వేయిస్తున్నది’/ ఈ పరిస్థితులు సర్వదా శోచనీయం అంటూ రైతులు అప్పుల చెదల పాలు కాకుండా కాపాడుకోవాలని కోరారు.
ఏ భాష అయితేనేం ఇతరులకు తమ భావాలను పంచుతుంది. వారి స్పందనలను ఆస్వాదిస్తుంది. భాష మొలకెత్తని, విస్తరించని కాలంలో దేహ భాష లుండేవి.భాష చేసే గమ్మత్తులు అనేకం. అదే విషయాన్ని దేహభాష కవితలో ఆమె చాటి చెప్పారు.
పలుకలేని ఉలుకు భాష/ పంచేంద్రియాలు ఒలికించే / కులుకు భాష/ పదిమందికి పరామర్శించే / నవరసభరిత దేహభాష/ నరులందరికీ గమ్మత్తుగానే / సొంతమైన భాష అంటూనే దేహ భాషను దేవా భాషగా మలుచుకోవాలని సూచించారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి ముందుమాటలో పేర్కొన్నట్లుగా అక్షరాలను అమ్మానాన్నలుగా/ గుణింతాలను తాతముత్తాతలుగా/ సావిత్రి రంజోల్కర్ భాషా బలగం పెంచుకుంటూ ప్రయాణిస్తున్నది. ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు దాస్యం సేనాధిపతి గారన్నట్లు భాషా లక్ష్మి తోనే భాషలు, సంగీతసాహిత్యాలు, హాస్యాలు, లాస్యాలు, చమక్కులు, విరుపులు, రభసల రసాభాసలు మొదలైనవన్నీ ఆమె అక్షర నీరాజనం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News