Saturday, April 5, 2025

అఫ్రూజా నాకు ఖర్జూరాలు పంపింది

- Advertisement -
- Advertisement -

రమజాన్ మాసం
అఫ్రూజా నాకు ఖర్జూరాలు పంపింది,
సోదరత్వం ముద్ర వేసిన చిన్న ప్యాకెట్లో

ఒక చిన్న చిట్కాలో రాసి ఉంది-
‘భాయ్జాన్, ఆనందంగా రుచిచూడు!‘
నాకు రోజా తెలియదు,
సహరి, ఇఫ్తార్ అలవాటులే కావు,
అయినా అఫ్రూజా తన ఇఫ్తార్ లోంచి
నా కోసం కొంత పంపించింది,
సోదరత్వం నిండిన చిన్న ప్యాకెట్లో

ఎవరో నా చెవిలో చప్పున గొణిగారు
‘మక్కా ఖర్జూరాలు నిషిద్ధం!’
అఫ్రూజా పంపింది మక్కా ఖర్జూరాలు
నల్లని రంగులోవున్న వాటిని చేతుల్లోకి
తీసుకున్నపుడు నా మనసుకు
అల్లాహ్ గాని, దేవుడు గాని స్మరణ రాలేదు

ఒక ఎండిన ఎడారి అంచున
నిటారుగా నిలిచిన
ఖర్జూరపు చెట్ల స్వప్నమే
నా చూపుల తెరపై మెరిసింది.

సూర్య తాపాన్ని సొంతంగా మోస్తూ,
మబ్బుల తేమను ముద్దుగా చుట్టుకుంటూ,
నిశీధి మబ్బుల్లో తడిసి మెరిసే
ఆ చెట్ల ప్రతిబింబమే నా హృదయాన్ని తడిమింది

అవి అల్లాహ్ని పిలవవు, దేవుణ్ణి వదిలిపెట్టవు,
మనుషులనే ఊగిసలాడుతూ పిలుస్తాయి,
మౌనంగా, అంతులేని ప్రేమతో

ఆ చెట్లకు తెలీదు-
అల్లాహ్ ఎవరో?.. దేవుడు ఎవరొ?

అఫ్రూజా నాకు ఖర్జూరాలు పంపింది.

అఫ్రూజా అఫ్రూజా అఫ్రూజా
ఆ అదే అఫ్రూజా, మసీదు ఉండగానే,
తన హృదయంలో ఒక గుడిని కట్టుకున్న ఆమే

రమజాన్ మాసం,
అఫ్రూజా నాకు
ఖర్జూరాలు పంపింది,
సోదరత్వం ముద్ర వేసిన
చిన్న ప్యాకెట్లో,
సెక్యులరిజం చిరునామాకు
అస్సామీ మూలం, ఆంగ్లానువాదం:
నీలిమ్ కుమార్
తెలుగు అనువాదం: వారాల ఆనంద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News