Monday, January 13, 2025

ఆమె వెళ్ళిపోయింది

- Advertisement -
- Advertisement -

అప్పటిదాక నవ్వుతు తుళ్లుతూ
అందరినీ పలుకరిస్తూ
ఇక్కడే వుండు..
ఇప్పుడే వస్తా అంటూ వెళ్లిన ఆమె
కాలవాహిని పాదాల కింద నలిగి
అందరూ చూస్తుండగానే
భీకరమైన రణఘోర ధ్వనుల్లో కలిసి
బతుకు రోడ్డును దాటలేకపోయిన
ఆమె చీకటి ఆ క్షణాల్లోనే చివరి శ్వాస విడిచేసింది
చెల్లా చెదరైన ఆమె దేహ శకలాలు
ఏరుకుని కుప్పవేయ వీలు లేనంతగా
ఆనవాళ్ళను కూడా మిగలనీయకుండా
ఆమె అనంత విశ్వంలో కలిసిపోయింది

చూపు లేని అతని కను రెప్పలు
అదేపనిగా కొట్టుకుంటున్నాయ్
మునివేళ్ళ నడుమ చిక్కిన చిరుతలు
పల్లవి లేని రాగాలను ఆలపిస్తూ
పలుకలేని అతని స్వరాన్ని వినిపిస్తున్నాయ్
చీమ చిటుక్కుమన్నా
కాలి అందియల శబ్దం వచ్చినట్లుగా
గాజుల సవ్వడి వినిపించినా
ఆమె ఇంటి ఇల్లాలై పరుగుపెట్టినట్లుగా
అతని అంతరంగం నక్షత్రాలను పూయిస్తోంది

జాలి లేని ఈ కాలానికి ఏం తెలుసు?
గూడులో వెలుగు అంతరించినట్లుగా
నల్లని రహదారిపై వెలిగే తారాజువ్వలు
అతని కనుగుడ్లలో మరింత చీకటిని విరజిమ్ముతోంది
ఆకలి దప్పులు కడుపును కోస్తున్నా
అతని చిరుతల పాట సాగుతూనే వుంది
ఆమె గుండె కిందుగా బొట్లు బొట్లుగా
రాలి పడుతున్న రక్తాక్షువులు
నేలపై చీమ్ముతు
ఊపిరి ఆగిపోయిన శాతాబ్దాల
నిశ్శబ్దాన్ని అతనికెవరు చెప్పాలి?

ఎక్కడ అంతరించనుందో తెలియని ఆశ
అతని రెక్కలకు తొడిగి దుప్పటి చుట్టింది
ఎదురుచూపులో ఆమె నడిచి వస్తోంది
రేపటి పొద్దుకై అతను ఈవేళకు సెలవిచ్చి అస్తమించిన వెలుగులో ఆమె వస్తుందని
చిరుతల సవ్వడితో నడుస్తూ కదిలాడు
ఆమె తిరిగి రాదని అతనికెవరు చెప్పాలి?

భండారు విజయ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News