Friday, November 22, 2024

అందరికీ వర్తించే కవి ప్రసేన్

- Advertisement -
- Advertisement -

Poet Prasen new collection of poems 'Evariki varthisthe vaariki'

సీనియర్ కవి ప్రసేన్ పదిహేనేళ్ల విరామం తరువాత తన కొత్త కవితా సంపుటి ‘ఎవరికి వర్తిస్తే వారికి’ తో మళ్ళీ తెలుగు కవిత్వ లోగిలిలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు . ఈ కవిత్వ సంపుటికి తానే రాసుకున్న ‘బ్యాక్ టు ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ’ అనే ముందు మాటలో ఇది తన రెండవ రాకడగా చెప్పుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్, రెండవ రాకడ పేరు ఏదయితెనేం ఇదొక పునఃప్రారంభం, తన సుదీర్ఘ విరామానికి వివరణ లాంటి ముందుమాటలో తెలుగు కవిత్వం గురించి, తెలుగు విమర్శ గురించి అందరికీ తెలిసినవే అయినా, కొన్ని వ్యాఖ్యలను సరికొత్తగా చేసాడు.

కవులు ఎలా ప్రెజుడైస్ అవుతారో, ఎలా మొగ్గలుగానే రాలిపోతారో, ఎలా అర్థం కాకుండా అనర్థం అవుతారో , అర్థాలకోసం పదాలను అన్వేషించకుండా పదాల కోసం అర్థాలను ఎలా వెతుకుతారో, తన స్వానుభవంలో నుండి కొంత, తన సహానుభావంలో నుండి కొంత తీసుకుని వివరించే ప్రయత్నం చేశాడు.
ఈ కవిత్వ సంపుటిలో కవిత్వం ఒక ఎత్తు. సంపుటికి రాసుకున్న ముందుమాట ఒక ఎత్తు. నిజానికి రెండూ సమీక్షించవలసిన, సమాలోచించవలసిన విషయాలు. ఈ ముందు మాటలో ప్రసేన్ నిర్ధారణ చేసిన విషయాలు రెండు. కవిత్వానికి విమర్శకులు రెడీమేడ్ టెంప్లేట్ తయారు చేసిపెట్టారని, ఆ టెంప్లేట్‌లో ఇమిడే కవిత్వం రాయకపోతే, అలా రాయని కవిని ఇగ్నోర్ చేయడమో, లేక ఎలిమినేట్ చేయడమో లేకపోతే ఏదో ఒక బ్రాండ్ వేసి ఆ రంగుటద్దాలలో నుండే చూస్తారని చెప్పడం ఒకటి.

ఇప్పటి తరం ఆ టెంప్లేట్ మాయలో పడి తాము రాయవలసిన కవిత్వాన్ని , రాయదల్చుకున్న కవిత్వాన్ని రాయవలసినంత తాత్విక గాఢతతో రాయడం లేదని చెప్పడం. రెండవది తన తొలి రోజుల కవిత్వం ఏ టెంప్లేట్ కి అనుగుణముగా లేకపోవడం వలన టెంప్లేట్ సృష్టికర్తలు అయిన సమకాలీన విమర్శకులు తన కవిత్వం పై చేసిన విమర్శ వలన, ‘ప్రసేన్ రూపపరంగా తన సమకాలీన కవుల కంటే వందేళ్లు ముందున్నాడు’ అని చెప్పిన వేగుంట మోహన ప్రసాద్ వ్యాఖ్య వలన తాను కవిత్వం పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నట్లు చెప్పుకున్నాడు. అవుట్ ఆఫ్ ది బాక్స్ రాసిన తన కవిత్వం తాము సృష్టించిన టెంప్లేట్‌కి అనుగుణంగా లేకపోవడం వలన అర్థం చేసుకోలేక పోయిన విమర్శకులు, మోహన ప్రసాద్ వ్యాఖ్యల వెలుగులో ‘ప్రసేన్ కవి త్వం మృదు కఠినం, జర్నలిస్ట్ మింగిన కవి, సాహిత్య రౌడీ లాంటి బ్రాండెడ్ ఇమేజెస్‌తో ఇగ్నోర్ చేశారని ప్రసేన్ ఆరోపణ.

తన తరువాతి తరం కవులు అయిన శ్రీనివాస్ సూఫీ, తోట సుభాషిణి, ఫణి మాధవి, సి వి సురేష్ లాటి కవులు తన కవిత్వాన్ని అక్షరాక్షరం చదివి, సారం తో సహా అర్థం చేసుకున్నారని రాస్తూ ప్రముఖ విమర్శకుడు ఖాదర్ మొహియుద్దీన్ పాతికేళ్ల తరువాత వేగుంట మోహన ప్రసా ద్ చేసిన వ్యాఖ్యలోని రహస్యం తనకు అర్థమైందని అన్నాడని చెప్పాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రసేన్ చెప్పదలుచుకున్నది ఒక్కటే. తెలుగులో కవిత్వ విమర్శకులు తెలుగు కవిత్వ పురోగమనానికి తమ స్వయం ప్రకటిత మేధో ప్రాబల్యంతో అడ్డం పడుతున్నారని, కవిని నియంత్రిస్తున్నారని. కవులు ఆ నియంత్రణలోకి ప్రైజుడైస్ అవుతూ తమ పూర్తి సృజనాత్మక శక్తి తో కవిత్వ సృష్టి చేసి ఒక సతత హరితారణ్యంలా విస్తరించకుండా బోన్సాయి మొక్కల్లా మిగిలి పోతున్నారని విమర్శకేమిటి ? కవిత్వానికేమిటి ? అసలు మానవ జీవితమే ఒక పెద్ద టెంప్లేట్ .

జననం దగ్గర నుండి మరణం దాకా విధాత సృష్టించిన ప్రోగ్రాం ఇది. ఆ ప్రోగ్రాం లోకి అలవోకగా ఇమిడి పోయే కోటానుకోట్ల మామూలు మనుషులు లాగా బుద్ది జీవులు ఉండరు. వాళ్ళు కాస్త అవుట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ బయటకు వస్తారు. తాము చెప్పాల్సినవి ఏవో తమదైన పంథాలో చెప్తారు. ఆ పంథా కూడా మళ్ళీ ఒక టెంప్లేట్ గా మారిపోతుంది . ఈ ప్రపంచం లో వచ్చిన అనేక మతాలూ , రాజకీయ భావ జాలాలు, సామాజిక ఉద్యమాలు అలా అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చినవే . అలాగే కవిత్వం కూడా . మ స జ స త త గ , ఒక నియమం. ఒక టెంప్లెట్. స భ రనమయవ ఒక నియమం, ఒక టెంప్లెట్. ఆ టెంప్లెట్ దాటి రాసిన వచన కవిత్వం కూడా ఒక టెంప్లెట్. కందం రాయని వాడు కవే కాదు అనడం మరొక టెంప్లెట్.

ఈ టెంప్లెట్స్ ను ప్రసేన్ ఎక్కడ బ్రేక్ చేశాడు. అంటే అది తన కవిత్వ భాషలో. తన కవిత్వ రూపంలో. ఇలా బ్రేక్ చేయడానికి ప్రధాన కారణం తాను చదువుకున్న తెలుగేతర కవిత్వం. వేగుంట మోహన ప్రసాద్ కవిత్వం మధ్యలో ఒకానొక లాటిన్ పదాన్నో, గ్రీక్ కవి కవిత్వ చరణాన్నో ఒక పదబంధంగా మారిస్తే ఆ పద బంధం మూలంలోకి వెళ్లి అన్వేషించే ఓపిక లేని విమర్శకులు, అప్పటికే తాము తయారు చేసి పెట్టుకున్న మార్కిస్టు సూత్రాల వెలుగులో ఆ పద బంధాన్ని పరిశీలించి మో, ఏమో అని ఎలా అన్నారో, ప్రసేన్ విషయంలో కూడా అలాగే నాలుగైదు బ్రాండ్ ఇమేజ్‌లు కలేజ్ చేసి అతడి కవిత్వానికి అంటించి వదిలేసారు.

ఒక్క వేగుంట మోహన ప్రసాద్ మాత్రమే ‘ప్రసేన్ రూపపరంగా తన సమకాలీన కవుల కంటే వందేళ్లు ముందున్నాడు’ అని ఎలా అనగలిగాడు? ఎందుకన్నాడు. అంటే మోహన ప్రసాద్ కేవలం కవి మాత్రమే కనుక. కవిత్వ రహస్యం తెలియని విమర్శకుడు కాదు కనుక. నిజానికి రూపం అంటే కవిత బయటకు కనిపించే ఓపెన్ స్ట్రక్చర్ మాత్రమేనా ? అంతకు మించి ఇంకా ఏమైనా ఉన్నదా? చంద్రకాంత మురా సింగ్ లాంటి ఈశాన్య భారత కవులు కవి రాసే భాష కూడా స్ట్రక్చర్ లో భాగమే అంటారు
కవి మనసులో తటిల్లతలా మెరిసిన భావం ఒకటి బయటకు రావడానికి తనకు కావలసిన రెక్కలను తానే తొడుక్కుంటుంది అనే మాట పాతకాలపు మాట అని మీరు అనుకోవచ్చు కానీ అది నిజంగా నిజం. భావం రెక్కలు తొడుక్కోవడమే రూపం. భావానికి సరి అయిన పదాలు ఇవ్వడం ద్వారా రెక్కలకి బలాన్ని ఇవ్వడమే కవి చేసే ప్రయత్నం.

ఆ ప్రయత్నం అప్పుడప్పుడు కొన్ని నూతన ఆవిష్కరణలకి చోటు కల్పిస్తుంది. ఆ నూతన ఆవిష్కరణ పాఠకుడు గుర్తించగలిగినంత , విమర్శకుడు పట్టుకోగలిగినంత బలంగా ఉండవచ్చు, లేదా గమనించలేనంత లేశ మాత్రంగా అయినా ఉండవచ్చు. మనం జాగ్రత్తగా చూడాలి కానీ ప్రతి కవీ రాసే ప్రతి కవితకి తన రూపాన్ని మార్చుకుంటాడు. అలా మార్చుకోక పోతే అతడు కవే కాదు. ప్రసేన్ కవిత్వం లో ఉన్న ఆ సూక్ష్మ స్థాయి మార్పులను కూడా వేగుంట మోహన ప్రసాద్ పట్టుకోగలిగారు .

ప్రసేన్ ఉద్దేశ్య పూర్వకంగా పదాలను స్థానభ్రంశం చెందించి అర్ధ విపర్యం సాధిస్తాడు అని అన్న విమర్శకుడు అది ప్రసేన్ కవిత్వ స్ట్రక్చెర్ లో , కవిత్వ రూపం లో ఒక భాగం అని గుర్తించలేక పోయాడు . గుక్క పట్టిన నవ్వు , హరిజన వాలాబాగ్ , స్పాన్సర్డ్ దుఃఖం లాంటి శీర్షికల కూర్పు కూడా కవిత్వ రూపం లో భాగమే . ఈ కూర్పు ఓపెన్ స్ట్రక్చర్ కాదు. అదొక ఇన్నర్ మెకానిజం . క్రితం క్షణం ఈ క్షణం కాదు అన్నాడు మన కాలపు మహా తత్వవేత్త కృష్ణాజీ . నిజం. మారుతున్న సమాజం తో పాటు తాను కూడా మారుతూ వున్నాను అన్న ఎరుక సృజన జీవికి చాలా ముఖ్యం . ఆ ఎరుక లేక పోతే ఆ సృజన అంతా గతకాలపు తలపోతల జలపాతంగా మిగిలిపోతుంది. సమాజం లో మణి ప్రవాళ భాష రాజ్యం ఏలుతున్నప్పడు కవిత్వం కూడా మణిప్రవాళ భాష లోకి మారుతుంది అన్న స్పృహ తన సమకాలీన కవుల కంటే ప్రసేన్ లో ఎక్కువ . అలా ఎక్కువగా ఉండటాన్ని మోహన ప్రసాద్ మాస్టారు వందేళ్లు ముందు ఉండటం అన్నారు. ఇక్కడ మణి ప్రవాళ భాష అన్నది కవిత్వ బాహ్య అంతర్గత రూపాల నిర్మాణాన్ని సింప్లిఫై చేయడానికి వాడిన ఒక టూల్ కిట్ మాత్రమే . ప్రసేన్ లో వున్న ఆ స్పృహ ఇవాళ ఒక ప్రోజ్ పోయెమ్ ను ఎవరికీ వర్తిస్తే వారికి లో బ్రెత్ లెస్ పోయెమ్ అనిపించింది.

ఎవరికి వర్టిస్తే వారికి లో కొన్ని కవితలు చదువుతున్నప్పుడు ముఖ్యంగా బ్రీత్ లెస్ పోయెమ్స్ చదువుతున్నపుడు అరుణ్ సాగర్ గుర్తుకు వస్తాడు. కానీ అరుణ్ ఆరంగేట్రం చేయడానికి ముందే ప్రసేన్ భాష తో ఆ ఫీట్లు చేశాడు. ప్రసెన్ నిశబ్దం లోకి వెళ్ళిపోయాక అరుణ్ ఆ మూడ్ ఆఫ్ రైటింగ్‌లో మాస్టర్ చేశాడు.

ప్రసేన్ సినిమా విమర్శకుడు కూడా కావడం వలన బాపు, మణి రత్నం తో పాటు కురసోవా, అబ్బాస్ కియరిస్తామీ లాంటి దర్శకుల craftsmen ship ను తెలుగు కవిత్వ నిర్మాణం లోకి తెచ్చుకున్నాడు. మోహన ప్రసాద్ మాటలకి ప్రిజుడిస్ అవడం వలన ప్రసేన్ కి కలిగిన నష్టం ఎంతో ఎవరికీ వర్తిస్తే వారికి ఒక పాఠకుడిలాగా చదువుకుంటే అతడికే తెలుస్తుంది . ఇంతకూ ప్రసేన్ టెంప్లెట్స్ కి అవతల నిలబడి రాసే తన స్వభావాన్ని వదులుకుని క్రిటిక్ ఫ్రెండ్లీ కవిత్వం ఈ ఎవరికీ వర్తిస్తే వారిలో రాశాడా అన్న సందేహం ముందు మాట చదివిన తరువాత మీకు కలిగితే , కవిత్వం అంతా చదివిన తరువాత మీకు వచ్చే జవాబు ఒక బిగ్ నో . ఎందుకంటే ప్రసేన్ కవిత్వం దానికి అదే ఒక పెద్ద టెంప్లెట్ ఎవరికీ వర్తిస్తే వారికి ని తను భావ వ్యాకరణం అన్నాడు. భాషకి వ్యాకరణం ఉంటుంది కానీ భావానికి వ్యాకరణం ఉంటుందా అన్నదొక సాధారణ ప్రశ్న.

ఉంటుందని రుజువు చేసాడు ఈ సంకలనం లో ప్రసేన్. ఇటువంటి ప్రయోగాలు జీర్ణం చేసుకోలేని వారు ప్రసేన్ పుస్తకాల గురించి కవిత్వం గురించి మాట్లాడరు . కానీ ఈ పుస్తకం మాట్లాకుండా ఉండలేని స్థితి ని పాఠకుడికి విమర్శకుడికి కూడా కలుగచేస్తుంది . ప్రసేన్ గత కవిత్వానికి ఈ తాజా తాజా కవిత్వానికీ చాలా అంతరం వుంది . చాలా మందికి అర్ధమయ్యే విధంగా తన భాషను సరళీకరించుకున్నాడు . అలా అని ‘ ముక్త వ్యధ గ్రస్త ‘ లాంటి తన మార్క్ కవిత్వ పంచ్ లను వదులుకోలేదు .
బ్రెత్ లెస్ పోయెమ్స్ లో అయితే గొప్ప మ్యాజిక్ చేశాడు . బాలు నో , హరి హరనో బ్రెత్ లెస్ సాంగ్ పాడుతుంటే ఎలా ఊపిరి బిగపట్టి , తనువంతా చెవిని చేసుకుని వింటామో ఈ పోయెమ్ ను కూడా తనువంతా కళ్ళు చేసుకుని చదువుతాము . నిజానికి ఆ కవిత ఒక ప్రవాహం . మన పఠనం కూడా అంతే ప్రవాహ సదృశంగా ఉంటే ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది .

ఏమి చెపుతున్నాడు ? ఎలా చెపుతున్నాడు లాంటి ప్రశ్నలు అన్నీ పక్కన పెట్టేసి మనం పఠనానుభవం లో కొట్టుకుపోతాము. కవిత పూర్తి అయ్యే సరికి ఒక ఉద్విగ్నత, ఒక సంభ్రమం మనసంతా నిండి పోతుంది. ఏదీకాదులో కూడా ఇలాంటి ప్రోజ్ పోయెమ్స్ ప్రసేన్ రాసాడు కానీ ఈ బ్రెత్ లెస్ పోయెమ్ లో మాత్రం ఒక మాస్టర్ క్రాఫ్ట్ మెన్ షిప్ అలవోకగా సాధించాడు.
ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఈ కవితలో ‘తోటి కాపురాన్ని హ్యాక్ చేయడమే కావ్యమైనప్పుడు బూతు ఒక క్లాసిక్ ‘ అన్నపుడు ఒక వ్యంగ్య వైభవం తో కవిత ఆకట్టుకుంటుంది . ఈ సెటైరికల్ టోన్ కవిత కి కావలసిన బలాన్ని ఇచ్చింది.
ఈ కవితా సంకలనమ్ ఆంగ్లంలోకి కూడా అనువదితమైంది. లంక శివరామ ప్రసాద్ అందంగా అనువదించారు.

పూల నివ్వగలం కానీ పరిమళాన్ని ఎలా నేర్పగలం? దృశ్యా న్ని ఇవ్వగలం కానీ దృష్టిని ఎలా ఇవ్వగలం అని మొదట్లోనే ఒక కన్ఫెషన్ లాంటి అశక్తత ను ప్రసేన్ వ్యక్తం చేసాడు. ఆ అశక్తత కారణంగానే ఏమో ఎవరికి వర్తిస్తే వారికి అన్నది. కానీ ఈ కవిత్వ సంపుటి లో వాసన లేని పువ్వులు లేవు. దృష్టిని ఇవ్వలేని దృశ్యాలు లేవు. అనేకానేక భావాల కలేజ్ లాగా కనిపిస్తుంది కానీ ప్రతి భావమూ సంపూర్ణమే . ప్రతి భావమూ అనుభవమే. భవమే ప్రసేన్ మిగతా కవిత్వ సంపుటాల లాగే కాలానికి నిలిచే కవిత్వం ఇది.

                                                                                                 – వంశీ కృష్ణ

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News