Monday, December 23, 2024

కలల రాత్రుల కవిత్వ రంగు

- Advertisement -
- Advertisement -

జీవితాన్ని కవిత్వ వాక్యాలుగా చదువుకుంటూ వెళ్లాలి అనే అనుభూతి కవి రహీమొద్దీన్.. అర్థవంతమైన భావాలను ఆర్థ్రవంతమైన వాక్యాలుగా చెక్కగలనేర్పు తన సొంతం.. తన కవిత్వం అత్తరు సుగంధం.. తోటివారి మనసుల్నిఇట్టే అలుముకుంటుంది.. ఆలస్యంగానైనా ఇటీవల ’ కలల రంగు ’ అనే కవిత్వ సంపుటితో సాహిత్య జగత్తులోకి అడుగుపెటాడు.. అనుభంధాలు ఆప్యాయతా లతలతోపాటు నిశ్సబ్ద విప్లప్రభోధ సామాజిక సందేశం ఈ పుస్తకంలో ఉంది..
హరివిల్లు లాంటి పేజీల నిండా కవిత్వరంగు. నిజానికి కలలరంగు వెనుక ఏళ్ల రాత్రుల కలలెన్నో..వాటన్నిటినీ కదిలించి,కరిగించి ఇలా మన కళ్ల వాకిళ్ళలో కవిత్వతోరణం కట్టాడు… తన కవిత్వంలోని సజీవత్వం ప్రవాహ ఏటి నీటి తేటగుణం.. అర్దమవుతూ, అవగతమవుతూ ఆనదింపచేయటమో, ఆలోచన రేకెత్తింపచేయటమో మించి కవిత్వ పరమార్ధమేమున్నది..

తన నలభయ్ ఆరో మైలురాయివద్ద నుంచి ఈ పుస్తకం విడుదల చేస్తున్నా అని తన పరిచయంలో చెప్పుకున్నాడు. రూపంలో వయస్సును మించి కనిపించే ఈ కవి కవిత్వంలో సైతం అనుభవతనంతో కనిపిస్తాడు. తను కవిత్వం కోసం కలం పట్టినప్పటినుచి నాకు పరిచయం. మహబూబాద్ లో ఊరూరా కవిసంగమం అనే సత్ సంగమ సందర్భలో చూశా తనను. కవిసంగమంపలమీద ఓనమాలుదిద్దుతూ అంతలోనేఎదిగిపోయాడు. ఈ కవిలో నిరంతర అధ్యయన గుణముంది.. సాహిత్య పుస్తకాలు, కవిసంగమ పాఠాలతోపాటు ముఖ్యంగా తోటివారిని చదివేగుణం తననితీర్చిదిద్దింది.. ఎవడేం రాస్తే నాకేం..నాకుతోచిందేదో రాసిపోతా అనుకునే వ్యక్తి కాదు..తోటివారినుంచి నేర్చుకునే సుగుణం అతిత్వరగా కవిత్వ దరిచేర్చింది..

తన ప్రతి కవితలో తీరుగానే మొదటి కవిత్వ సంకలనం లో మానవసంబంధాలకు పెద్ద పీటవేశాడు.. మృగ్యమవుతున్న తరుణ సమాజంలో సృజనకారులు చేయాల్సిన పనే ఇది.. మనిషి మాయమవుతున్నాడనే దెయ్యం ప్రకటనను ఇతడు అతీతం.. శోకండాలు పెట్టిలాభంలేదు.. ఆశావహ దృక్పదమే అంతిమం అని తనవంతు నిరూపించాడు. తోటివారిలో, సొంతఊరిలో మనుషులను మానవ సంబంధాలను గుర్తించగల కళ్ళున్న కవి ఇతను..అఖండ భారతదేశంలోని తన వర్గం అభద్రతా స్థితిని నిరసిస్తూ తనదైన కంఠంతో గావుకేకపెట్టాడు. ఈదేశం నాది ఈమట్టినాది, నేనిక్కడి బీజాన్ని అని ఇప్పటికీ నిరూపించుకోవలసిన దుస్థితిని ఎరుక చేస్తూ అందుకు కారణమైన స్థితిని ఎండగట్టాడు.. ’ నేను ఒంటరిని గాను ’ అనే కవితలోని వాక్యాలు తనలోని ఆవేదనకు, ఆర్ద్రతకు అక్షర సాక్ష్యాలు. ’ మతాన్ని గుళ్ళోనుంచి రధమెక్కించి పోలింగ్ బూత్ దాకా మోసుకొచ్చినవ్ ’ అంటూ నడి వీధిలో నిలదీస్తాడు..

అంతలోనే..నువ్వెన్ని కుట్రకత్తులతో ముక్కలు చేస్తున్నా, ఒకే గాయం దగ్గర ఒక్కటవుతున్న సోదరులంతా నావెంటే’ అని హెచ్చరిస్తాడు. ’ నాలాంటి అనేక అడుగులు ఒక్కటై కవాతు చేస్తే గానీ హింసా గృహాలు ధ్వంసం కావు ’ అని ’ హింసా గృహం ’ అనే కవితలో మహిళా స్వరంతో గృహ హింసలపై నిరసన స్వరం వినిపిస్తాడు..‘మహాజనులారా ఎవరిపనుల్లో వారు పడిపోయి అందరూ ఒక్కటయ్యే పని మరిచారా’ వెలుగురాగాల పాట అనే కవితలో సమాజం ఒక్కటవ్వాల్సిన తిరగబడాల్సిన ఆవశ్యకతను బోధిస్తాడు. ’ చాలు ఇకలెండి పాదాలకు కవాతు పరిచయం చెయ్యండి ’ అని అదే కవితలోని వాక్యాలతో తిరుగుబాటు ప్రభోధాన్ని పతాక స్థాయికి తీసుకెలతాడు. ‘ఇంట్లో చెత్త ఊడ్చేసినట్తు మగబుద్ధిని కూడా ఊడ్చేస్తే బావుండు ’ అని అమ్మచేతి ఆసరాలో ఆవేదన చెందుతాడు.‘మసీదు మినారు మీదనుంచి కనిపించే పండుగ నెలవంకకోసం అందరూ వెతుకుతుంటే అమ్మముఖంలో మెరిసే నెలవంకకోసం నేను వెతుకుతున్నా. అమ్మను ఏడిపిస్తే నాన్నైనా నాకుశతృవే.. అని తను ఎవరి పక్షమో స్పష్టం చేసిన కవి..

అంతలోనే మరో కవితలో ’ బాపూ ఏ వేమన పద్యమూ ఏ సుమతీ శతకమూ నేర్పని నీతిని నీ బతుకు పద్యం నుంచి నేర్చుకున్నా.. అందుకే నువ్వంటే నాకు మూడు రంగుల జెండా’ అని కీర్తించటాన్నీ మనం గమనించొచు. ఏవో కొన్ని వాక్యాల లైన్లను రాసి కవిత్వం అని బుకాయించలేదు.. తన కవితల్లో అనేక చిక్కని కవిత్వ వాక్యాలను మనం గమనించొచ్చు.‘మట్టిని పిసికి బతుకులోకి ఇంత తిండి పిండుకుంటున్నవాడ్ని ’ .. ’ ఇప్పుడు నేను ఏ పందిరికోసమో పాకులాడె తీగను కాను ’ ’ ఎప్పుడూ నిశ్సబ్ద గబ్బిలం మా ఇంటిదూలామికి వేలాడుతుంది ’ ’ పాతబడిన బతుకులాల్చీ బక్క దేహమ్మీద కప్పుకొని తప్పిపోయిన నా అన్నం మెతుకును వెతుక్కుంటున్నా’ ’ నీ కథ నిండా చిక్కుపడ్ద కష్టాలు, నామనసునిండా అల్లుకున్న దుఖ వాక్యాలూ, ’ ఇంటి చాకిరీ ఎంత చేసినా అమ్మ స్థానం చీపురు కట్తలా మూలకే ’ ఇప్పటి ఈవానకు ఎప్పటిదో వాసన ఎట్లా అంటుకుందో తెలీదు ’ ’ ఎవరినుంచి ఎంత తీసుకున్నామో,

ఎంత ఇచ్చామో లెక్క ఎంతకూ తెలీదూ ’ జీవితాన్ని కవిత్వంలా చదువుకుంటూ వెళ్లాలి ’ ఇవన్నీ తన కవిత్వ వాక్యాల్లోని కొన్ని మెచ్చు తునకలు… కరోనా, లాఖ్ డవున్ నేపద్యంలో రాసిన కవితలు ప్రాసంగిత కోల్పోయాయి కనుక వాటిని ఈపుస్తకంలోకి వేయకుండా ఉండాల్సింది..మానవసంబంధాల వైయుక్తిక పరిధిదాటి సమాజహిత చైతన్యందిశగా విశ్వనరుడిగా అవతరించాలని కోరుతున్నా..

శ్రీనివాస్ సూఫీ
9346611455

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News