ప్రముఖ కవి అబ్బూరి రామకృష్ణారావు పెద్దబ్బాయే వరదరాజేశ్వరరావు. అపురూప సాహిత్య, సాంస్కృతిక మేధో సంపత్తి గల కుటుంబంలో జన్మించి, తాతల నాటి సారస్వత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కవిగా, నాటక రచయితగా, విమర్శకుడిగా సాహితీ లోకానికి విశేషంగా పరిచయమయ్యారు. సకల సాహితీ ప్రక్రియల నిర్మాణంలో ప్రావీణ్యులు అనిపించుకున్నారు. వరద 1923 లో మద్రాసులో జన్మించారు. 1993లో హైదరాబాదులో మరణించారు. సాహిత్యం అనగా మనకు గుర్తొచ్చే ప్రక్రియలు కథ, కవిత, నవల, నాటకం, పద్యం, గేయం. నిజమే ఇవన్నీ సాహిత్యము లోనివే. వీటికున్న ప్రత్యేకత, విశిష్టత ఎలాగునూ ఉంటుంది. కానీ వీటి ప్రక్కన నిలుచునే అర్హత వ్యాసానికి కూడా ఉంది. ఈ విషయాన్ని పూర్వ గ్రంథకర్తలే రూఢి పరిచారు. కావ్య లక్షణాలు లేనప్పటికీ కొన్ని వ్యాస సంపుటాలు స్వతంత్ర కావ్యాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి ఒక వ్యాస సంపుటియే అబ్బూరి వరద రాజేశ్వరరావు ‘కవనకుతూహలం.’ ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో 17-9-1986 నుండి 21-10-1987 వరకు ధారావాహికంగా ప్రచురించబడిన ‘వరద’ వ్యాస వరద.
ఇందులో మొత్తం 37 వ్యాసాలు ఉన్నాయి. వాటిలో 33 వ్యాసాలు వివిధ సాహితీ వేత్తలతో తనకు గల స్నేహబంధం గురించి రాశారు. రెండు వ్యాసాలు సాహిత్య అకాడమీ మరియు అరసావిర్భావం గురించి రాశారు. మరిరెండు వ్యాసాలు కాలదోషం, ఆఖరిమాట పేరు మీద రాయగా, చివరిలో తనకిష్టమైన కథా రచయిత రావిశాస్త్రి గారిపై కొన్ని పద్యరత్నాలు ఉన్నాయి. 1989 లో అబ్బూరి ట్రస్ట్ వారు ఈ కవన కుతూహలాన్ని మొదటిసారి ప్రచురించారు. 1993లో పునర్ముద్రణ కూడా అయ్యింది. ఈ గ్రంథాన్ని రావిశాస్త్రి గారికి అంకితమివ్వడం విశేషం.ఈ సంపుటిలో తన ప్రియమిత్రుడు శ్రీశ్రీ గురించి రాసిన వ్యాసమే తొలుత ఉంటుంది. శ్రీశ్రీకి కమ్యూనిస్టు మేనిఫెస్టోను పరిచయం చేసి అభ్యుదయ మార్గంలో నడిపించిన వారు అబ్బూరి రామకృష్ణారావు. వరదరాజేశ్వరరావును శ్రీశ్రీ గురుపుత్రుడని సంబోధించేవారు. వరదకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు శ్రీశ్రీ 21 ఏళ్ల కుర్రాడు. ఆ వయస్సులో వారిద్దరి మధ్య స్నేహం విడదీయరానిది. ఒకసారి శ్రీశ్రీని విశాఖపట్నమంతా చూపమన్నాడట వరద. అంతే కాలినడకన సముద్ర తీరం వెంబడి వాల్తేరు నుంచి టౌన్ హాల్, కోట, శివాలయం వీధి, కురుపాం మార్కెట్ మీదుగా దండుగోల దిబ్బ వరకు విశాఖపట్నమంతా కాళ్లు నొప్పిపెట్టేలా త్రిప్పి చూపాడు.
ఈ కవనకుతూహలంలో రాసిన ప్రతీ వ్యాసం లోనూ ఏదో ఒక సందర్భంలో శ్రీశ్రీని తలస్తూనే ఉంటాడు వరద. వరదకు శ్రీశ్రీ అంటే పిచ్చి, శ్రీశ్రీకి వరద అంటే మరీ పిచ్చి అనే విషయం తాను రాసిన వ్యాసాలలో అణువణువునా ప్రతిబింబిస్తుంది.
తన మిత్రుడైన ‘బెల్లంకొండ రామదాసు’తో జరిగిన సంఘటనొకటి వరద మననం చేసుకుంటారిలా. ఒక రోజు నేను వచ్చేసరికి చీకటిగా ఉన్న గదిలో ఓ తలుపు పక్కన రామదాసు వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. నేను లోపలికి వెళ్లి దీపం వేసేసరికి ఏడుస్తున్న రామదాసు లేచి నా దగ్గరకొచ్చి నా చెవి దగ్గర మెల్లిగా ఇలా అన్నాడు. వరదరాజేశ్వరరావు నువ్వు భయపడ్డావా? ఇవాళ నాకు ఆత్మప్రబోధం అయ్యింది. నిజంగా ఏడుపు వచ్చి ఏడ్చాను. ఒంటరితనం, ఒంటరితనం&బ్రతుకంతా ఒంటరితనం&నాకు విరక్తి పుట్టింది ప్రపంచం మీద. బ్రతుకంతా కన్నీళ్ళమయం. కన్నీళ్ళలోనే మన తాపోపశమనం. బుద్ధుడిక్కూడా ఇదే అనుభవం అయ్యుంటుంది. నిజం వరదరాజేశ్వరరావు! మనం సుఖం అనడం అంటామే&అవన్నీ దుఃఖములోనించీ, బాధలోనించీ వచ్చేవే. చెబుతున్నాను విను అన్నాడు. అక్కడ నుంచి అతని కవిత్వం చదివినప్పుడల్లా ఆనాటి సంఘటన తలపుకొచ్చేది అని వరద తన వ్యాసంలో హృద్యంగా నెమరు వేసుకున్నారు.
వచన కవిత, మార్క్సిజం, ప్రజలూ వగైరా అంటబెట్టుకుని ఆంజనేయులు తమ ప్రతిభను వ్యర్థం చేసుకున్నాడని నమ్మే వాళ్ళలో నేనొకణ్ణి అని కుందుర్తి గారి గురించి వరద అభిప్రాయపడతారు. కుందుర్తి విశ్వనాథ వారి శిష్యుడు. కానీ కుందుర్తి కమ్యూనిస్టు వ్యవహారాల్లో దూరాక విశ్వనాథ కవితా దారిని వదిలేశాడు. అతని సతీవియోగం వల్ల రాసిన ‘హంస ఎగిరిపోయింది’ అనే ఖండికలో ఆంజనేయులు ఎంత ప్రతిభా సంపన్నుడో, అమాయకుడో అర్థమవుతుంది. మనిషికీ, కవిత్వానికీ కావలసింది మానవత్వం. కానీ కేవలం మార్క్సిజం కాదని రుజువు చేశాడు. మరోసారలా గురువు గారి అడుగుజాడల్లో కుందుర్తి నడిచినట్లు వరద తన వ్యాసంలో చెబుతారు.జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి విద్యార్థి దశ నుంచే చక్కగా పద్యాలు చదివేవాడు. అతనికో చక్కని బాణీ పద్య పఠనంలో ఉండేది. అది అందరినీ ఆకర్షించేది. జరుక్ శాస్త్రి వరదతో మొదటి పరిచయంతోనే జీవితాంత స్నేహితులుగా మెలిగారు. ఒకసారి మిత్రులిద్దరూ సినిమాకు వెళ్లారు. ఆ సినిమా మహాభారతానికి చెందిన కథ. అందులో ద్రౌపది పాట ‘సంహితురా, సంహితురా, రాజరాజాధిరాజుల్ సంహితురా’ అని ఉంటుంది. దానికి జరుక్ పేరడీగా ‘రమింతురా, రమింతురా రాజరాజాధిరాజుల్’ అని పాడాడు. దాంతో అక్కడ పాండవ పక్షపాతులైన ప్రేక్షకులు వారిపై కోప్పడ్డారు.
పదపోదాం, ఈ వెధవలకు సాహిత్యం మజా ఏం తెలుసు? అని శాస్త్రి అన్నాడు. ఇలాంటి అనుభవాలు ఎన్నో వరద తన వ్యాస సంపుటిలో టచ్ చేస్తారు.కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు చదివితే వర్షం కురుస్తున్న భావన అందరికీ కలుగుతుంది. ఆయన మాధవవర్మ గురించి రాసిన పద్యాలు చదివి, ఆహూతులను రసానుభూతికి గురిచేసేవారు. అలా ఒకసారి ఓ సభలో వరదను ఎలా ఉంది? నా పద్యం, పద్యపఠనమని అడిగితే, ఏడిపించేసారు అని అన్నారు. మరోసారి వరద తన స్కూల్లో విశ్వనాథ్ గారి ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. ఆయన వరదను ఏడిపించమంటావా! నవ్వించమంటావా! సభను అని అన్నారు. ఓ క్షణం ఆలోచించి మాధవవర్మ పద్యాలే అని అన్నారు వరద. ఇలా మాధవవర్మ పద్యాలకు తాను రసానుభూతికి గురై శైశవంలో, కౌమారంలో పెద్ద మార్పు పొందినట్లు చెబుతారొక వ్యాసంలో.
ఒకసారి రాయప్రోలు సుబ్బారావు వరద వాళ్ళ ఇంటికి వచ్చారు. వస్తూనే వస్తూనే ఆ వీధిలో ఒక అబ్బాయి పాట పాడడం విన్నారు. ఎంతో శ్రావ్యంగా ఆలపిస్తున్నాడు ఆ అబ్బాయిలా.
ఎన్నాళ్లాయెనే వాన/ఈ వూరొచ్చి ఓ వాన/రావే వానా/ రావే వానా/ఎన్నాళ్లాయెనే వాన మర్నాడు సుబ్బారావు గారు హైదరాబాద్ వెళ్లేందుకు పయనమయ్యారు. ఆ పాట పాడే బాలుణ్ని తాను చూడాలని కోరిక వ్యక్తపరిచారు. కానీ ఆ హరిజన బాలుడు ఆ రాత్రి మరణించాడట. వరద ఆ విషయం సుబ్బారావు గారికి తెలుపగా మిక్కిలి విచారవదనుడై ఎన్నాళ్లాయెనే వాన/ ఈ వూరొచ్చి ఓ వాన అని కళ్ళు చెమ్మగిల్లుతూ పాడారట. ఇలా సుబ్బారావు గారితో గడిపిన మరపురాని క్షణాలను తన వ్యాస సంపుటిలో నింపుతారు వరద.ఓసారి విశాఖపట్నంలో వరదకు పెద్దజుట్టు, ఎడమఛాతీ మీద గుండీలున్న లాల్చీ, ధోవతీ-అదోరకంగా ఉన్నాయనని చూపి ఇతడే కృష్ణశాస్త్రి అని పరిచయం చేశారు చలం గారు. ఆకర్షణీయమైన విగ్రహం, మాట్లాడే తీరులో ఆప్యాయత, ఎవరినైనా ఆకట్టుకోగలడు అదే ఆయన ప్రత్యేకత. ఆయన నడకలో ఓ విధమైన ఠీవి, హుందాతనం ఉండేది. వేషం సరేసరి అని వరద కృష్ణశాస్త్రి రూపురేఖలను వర్ణిస్తారు. విజయనగరంలో జరిగిన సభకు ఆలస్యంగా వచ్చారు కృష్ణశాస్త్రి. వస్తూ వస్తూ అక్కడున్న వారిని అబ్బూరి వారి అబ్బాయి ఏరి? అని అడిగారు.
పక్కనే ఉన్న వరద నిలబడి నమస్కరించారు. అంతే ఆయన వరద పక్కన కూర్చొని ఈ రెండు మూడు రోజులు నాతోనే ఉండు, ఎక్కడికి పోక అన్నారట. ఆ సభలో గొర్తి సూర్యనారాయణ శాస్త్రి భావకవులను, భావకవిత్వాన్ని ఎద్దేవా చేస్తూ ప్రసంగిస్తున్నారు. అప్పుడు సభలో కృష్ణశాస్త్రి లేరు. ‘వాళ్లు భావకవులు ఏమిటి? జడకుచ్చులు పట్టుకొని మూగనోములు పడతారు. తర్వాత ఏడుస్తారు. ఆడపిల్లల వెనక పడి వాళ్లే బావకవులు బాబూ! అని హేళన చేస్తూ’ ఉపన్యసించారు. ఆ విషయం తెలుసుకొని కృష్ణశాస్త్రి తన ప్రసంగం చివరలో ‘వీరే బావకవుల అయితే సూర్యనారాయణశాస్త్రిని అడుగుతాను. మీ అప్పకవులకు మా బావకవులు ఏమవుతారని? అలా మాటలతో గడ్డి పెట్టినట్లు ఆనాటి జ్ఞాపకాలను వరద చెప్పుకొస్తారు. కవులందరూ ఇంటిపేరుతో పిలవబడుతున్నారు. మీరే కృష్ణశాస్త్రిగా ఎందుకో? అని అడిగారు వరద. ఎంచేతనో నాకు తెలియదు. నేను అనుకోవడం ఒకటి ఉంది. కృష్ణశాస్త్రి అంటే నా కవిత్వంతో పాటు నా వేషం కూడా గుర్తొస్తుందనుకుంటాను అని నవ్వుతూ సమాధానం చెప్పారు. కృష్ణశాస్త్రి వాచికంలో హాస్యస్ఫూర్తి ఉండేది. ఆధునిక రచయితల్లో అబ్బూరి రామకృష్ణారావు, గుడిపాటి వెంకటచలం, దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లే మంచి హాస్యప్రియులని చెప్తారు వరద.
కృష్ణశాస్త్రి కూర్చుని మాట్లాడితే ఆకాశమే నవ్వేది. వాళ్లు ముగ్గురు వివిధ సందర్భాల్లో సృష్టించిన హాస్యక్తులని గ్రంథస్తం ఎవ్వరూ చేయలేదు. ఎవరైనా చేసి ఉంటే బాగుణ్ణు అనే అభిప్రాయాన్ని వరద వ్యక్తం చేస్తారు. ‘మరో దురదృష్టం కృష్ణశాస్త్రి పద్య పఠనం రికార్డు కాకపోవడం. ఆయన పద్యం చదువుతుంటే వినడం అదొక విచిత్రానుభవమని చెప్పాలి’ అని అంటారు వరద.
వ్యాసాన్ని కొందరు సృజనాత్మక ప్రక్రియ కాదంటారు. ఇలా సాహిత్యం నుండి వ్యాసాన్ని వేరు చేయడానికి కొంతమంది పూనుకోవడం సరైనది కాదు. కానీ అలాంటివారు అబ్బూరి వారి వ్యాస సంపుటాలు చదువుతుంటే, తమ అభిప్రాయం తప్పనే నిర్ణయానికి వస్తారు. అందుకే అంటారు అత్తలూరు నరసింహారావిలా. ‘గొప్ప కవిత్వం రాయడానికి ఒక ఉద్విగ్న క్షణం చాలు. అదే గొప్ప వాక్యం రాయడానికి ఒక జీవితం చాలదు’. విశాల గ్రంథశాల ప్రచురించిన అబ్బూరి వరదరాజేశ్వరరావు ‘కవనకుతూహలం, నాట్యగోష్టి-నాలుగు నాటకాలు’ తెలుగు సాహిత్య సీమను ఎంతో ప్రభావితం చేశాయి. ఇవికాక 1985 లో ఉదయం దినపత్రికలో ఒక ప్రత్యేక కాలమ్‌గా ‘వరదకాలం’ అచ్చయ్యేది. ఈ రెండింట ఉన్న వ్యాసాలను పరిశీలిస్తే వరద వ్యాస సమ్మోహనం మనకి అనుభవైకవేద్యంగా అర్థమవుతుంది. అందుకే ‘వరద కాలం’ పుస్తకానికి రాసిన ముందుమాటలో ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రను సాధికారికంగా రచించగల వారిలో వరదరాజేశ్వరరావు గారు ప్రప్రథముడని’ సమ్మెట నాగమల్లేశ్వరరావు అభిప్రాయపడతారు.
(‘అబ్బూరి వరదరాజేశ్వరరావు’
శతజయంతి సందర్భంగా రాసిన వ్యాసం)