Monday, December 23, 2024

అమానవీయతపై ఎక్కుపెట్టిన కవితాస్త్రం

- Advertisement -
- Advertisement -

అంతరంగంలోని ఆలోచనలకు రెక్కలు మొలిపించేది కవిత్వం. రోజువారి సంఘర్షణ పూరితమైన అనుభవ సాంద్రతల నుంచి మొలకెత్తేది కవిత్వం. దిగులు మేఘాలను పటాపంచలు చేసి, ఆపన్నహస్తంలా భరోసా నిచ్చేది కవిత్వం మాత్రమే. పదపదాల్లోని అక్షరాల ఉత్తేజాలను తనువంతా అల్లుకోవడానికి ఒక సుదీర్ఘమైన పోరాటాన్నే చేయాలి. నిన్ను నువ్వు దహించుకుంటేనే తప్ప ఒక సారవంతమైన వాక్యం వెలువడదు. అట్లాంటి సత్తువ గలిగిన వాక్యాలతో ‘జ్ఞాన వాక్యం’ కవిత మనల్ని హత్తుకుంటుంది. మనల్ని కలవర పాటుకు గురిచేస్తుంది. నెమ్మదిగా ఆలోచించమంటుంది. అప్పుడొక ఆత్మీయమైన సమీరాల వంటి వాక్యం మన గుండెలోకి జొరబడుతుంది. ఇట్లాంటి వాక్యాలను రాయడంలో బహు నేర్పరైన ప్రసిద్ధ కవి విల్సన్ రావు కొమ్మవరపు. ఆయన కవిత్వం నిండా ఇట్లాంటి కవితా పాదాలు తొణికిసలాడుతుంటాయి. ఈ కవితా పాదాల్ని ప్రశాంతమైన వాతావరణంలో చదువుతుంటే కళ్ళల్లో మెరుపుల వంటి కాంతి రేఖలు ప్రసరిస్తుంటాయి.

‘స్వచ్ఛమైన బీజాలను నాలో నాటి/ ఆకుపచ్చ కాంతులు వెదజల్లుతూ/ మళ్ళీ రేపు కలుద్దామని చెప్పి/ జీవితపు పల్లవులు పాడుకుంటూ/ అత్యంత నిర్మలంగా వెళ్ళిన జ్ఞానవాక్యం/ ఇంతవరకు తిరిగి రాలేదు/ ఇప్పుడెక్కడుందో !’/ ఆత్మీయ కవి మిత్రులు విల్సన్ రావు కొమ్మవరపు నాలుగో కవితా సంపుటి’ నాగలి కూడా ఆయుధమే..!’. కవిత్వం ఆయనకు పంచప్రాణాలు. ప్రతివాక్యాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుతారు. బండను శిల్పంగా చెక్కడానికి శిల్పి పడే యాతన ఎట్లా ఉంటుందో.. ఈ కవి ఒక కవితను సృజించడానికి పడిన వేదన కూడా అట్లాగే వుంటుంది. ‘నాగలి కూడా ఆయుధమే..!’ కవితా సంపుటిలోని 69 కవితలను చదువుతున్నప్పుడు ఆయన తండ్లాట మనకు బోధ పడుతుంది. కష్టజీవుల పక్షపాతిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడని చెప్పడానికి ఈ కవితా సంపుటిలోని ప్రతి కవితను ఉదాహరించ వచ్చును.

మనకు అన్నం పెడుతున్న రైతన్న గురించి, అతని దుఃఖ గాధలను గురించి కవి మాట్లాడలేకుండా ఉండలేక పోతాడు. మనమంతా రైతు వైపే ఉండాలని ఎలుగెత్తి నినాదంలా చాటుతాడు. అందుకే ఈ కవితా సంపుటి శీర్షిక కూడా అన్నదాత గురించి రాసినదే పెట్టారు. కాలంతో సమరం చేస్తూ మనకింత ఆహారాన్ని పెడుతున్న రైతన్న గురించి రాజ్యం విస్మరించరాదని హెచ్చరిస్తున్నాడు. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలని ఉద్యమ స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఈ కవితా పాదాల్లో నాగలి ఒంటరి కాదని అంటే రైతు ఒంటరివాడు కాదని అతనికి అండగా మేమంతా ఉన్నామని, ఎప్పుడైనా సరే అతనితోనే ఉంటామని ప్రకటించిన సాహస కవి విల్సన్ రావు. ఇప్పుడు/ నాగలి ఒంటరి కాదు/ నాగలి ఒక సమూహం/ నాగలి ఈ దేశపు జీవితం/ నాగలి ఉత్పత్తికి జీవం/ నాగలే మా సర్వస్వం/ ఇప్పుడు నాగలే మా ఆయుధం’/ ‘నాగలి కూడా ఆయుధమే..!2’ అనే కవితలో ఆరుగాలం కష్టపడి పండించిన రైతు పంట దళారుల పాలవుతున్న తీరును నిర్మోహమాటంగా వ్యక్తీకరిస్తున్నారు. రైతన్న బతుకు మారేదాక బలమైన కవిత్వాన్ని రాసే వాళ్లలో ఈ కవి కూడా ఒకరిగా చేరిపోయారు. అందుకనే ఇంత సారవంతమైన కవిత్వాన్ని రాయగలిగారు. ఈ కవితా పాదాల్ని ఒకసారి గుండెలకు హత్తుకుని మనమంతా కవితో పయనిద్దాం.

కూటి గింజల కోసం/ కరువు బారిన పడకుండా కాపాడిన/ కర్షక వీరుడా!/ మనస్ఫూర్తిగా నీతో గొంతు కలిపి/ నిన్ను కౌగిలించుకొని/ నువ్వు కన్న సామూహిక/ స్వప్న ప్రపంచపు రహదారులను విస్తరిస్తా../ చీకటి మేఘాలపై/ పోరు మంటల మెరుపు పాటై/ నూతన యుగ ద్వారాలు తెరుస్తూ/ ప్రశ్నించే తత్వాన్నై నీకు తోడుంటా../జీవన ప్రస్థానంలో చివరి అంకంకు చేరిన వృద్ధ తల్లిదండ్రుల పట్ల పిల్లలు తమ ప్రేమను పంచాలని కవి ఆవేదనాత్మకంగా వ్యక్తం చేస్తున్నారు తన కవిత్వం ద్వారా. సమాజంలో నిత్యం జరుగుతున్న పలు విచారకరమైన సంఘటనల నేపథ్యంతో కవి మనసు గాయపడింది. హృదయం కలత చెందింది. మానవీయమైన అంశంతో ‘జీతే రహో బేటీ’ అంటూ కళ్ళు చమర్చే కవితను రాసారు. విశాలాక్షి మాస పత్రిక నిర్వహించిన కవితల పోటీలో ఈ కవితకు ప్రథమ బహుమతి లభించింది. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల్ని దీవిస్తూనే ఉంటారు. తమను ఆదరించినా ఆదరించకున్నా పిల్లల శ్రేయస్సునే వాళ్ళు కోరుకుంటారు. ఇది కాదనలేని వాస్తవం. అందుకు ఈ కవితా పాదాలే సాక్ష్యం.

‘గుప్పెడు మెతుకుల కోసం ఎదురుచూడని/ ఈ వయసుడిగిన పావురాలపై/ కొన్ని దయాపూరిత వాక్యాల/ తేనెల సొనలు చిలకరించండి/ మా ఆకలి తీరి శక్తి కూడా కట్టుకొని/ జ్ఞాపకాల భాండాగారం తెరిచి/ సంతోషాల సారంగులను మీటి/ జీవనోత్సాహపు సౌరభాన్ని/ నలుదిశలా వెదజల్లుతాము/ ప్రవాహ గానమై పరవళ్ళు తొక్కుతాము’/ మనుషుల మధ్యన విభజన రేఖలు అనేక రకాలుగా ఉంటాయి. ఎవరి సిద్ధాంతాలు వారివే. ఎవరి నమూనాలు వారివే. ఎవరి వాదనలు వారివే. పనికొచ్చే వాటిని పట్టుకోవడమే కవులు చేసే పని. ఎరుపు మార్పుకు నిదర్శనం అయితే నలుపు నిరసనకు నిదర్శనం. నలుపు అణగారిన వర్గాలకు నిదర్శనం. నలుపు ధిక్కార స్వరానికి నిదర్శనం. నలుపు ఐక్యతను చాటే ముక్తకంఠానికి నిదర్శనం. ఈ కవికి అణగారిన వర్గాల పట్ల అచంచలమైన ప్రేమ. నలుపు గెలుపు కోసం అహర్నిశలు తాపత్రయ పడుతుంటారు. అందుకే దేనిని చూసినా ఆయనకు నలుపే కనిపిస్తుంది. ఆ నలుపులోని సారాన్ని మనకు ఒక నర్మగర్భమైన ‘నల్ల చంద్రుడు’ కవిత ద్వారా వినిపిస్తున్నారు.

‘దేహమంతా నలుపు రూపెత్తాక/ పున్నమి చంద్రుడు కూడా/ నాకు నల్లగానే కనిపిస్తున్నాడు భ్రమో,చిత్రమో గానీ/ నియాన్ లైట్ల కాంతి కూడా నల్లగానే ప్రవహిస్తున్నట్లుంది/ అక్కడక్కడా/ తెల్లని నలుసులు కొన్ని/ కాంతి స్తంభాలై నిలబడ్డాయి/ నల్ల పిల్లి కళ్ళలా’/ మనచుట్టూ అసంఖ్యాకమైన మనుషులున్నారు. మనకు కావాల్సిన వాళ్ళు మాత్రం లేరు. మనుషులంతా సమానమే అయినప్పుడు ఈ అసమానతలు ఎందు కున్నాయి. ఎక్కువ తక్కువ అనే భేదభావాలెందుకు ఏర్పడ్డాయి. యుగయుగాలుగా మనిషి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఒక తాత్వికమైన పునాదిని వేస్తూనే ఉన్నాడు . ఎంతమంది ఎన్ని రకాలుగా విడమర్చి చెప్పినప్పటికీ మానవ జీవితం రోజురోజుకు సంక్షోభితం అవుతూనే ఉంది. ఏకాకితనంలో మగ్గుతున్న జీవితాల్ని సామూహిక జీవనంలో భాగం చేయడానికి కవిత్వం ద్వారా, పలు రచనల ద్వారా కవులు రచయితలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ కోణం నుండి రాసిన కవితే ‘ఆకలి యాత్ర’ ./ ‘ఏం పోగొట్టుకున్నానో/ ఎక్కడ తోవ తప్పానో/ కొట్టుమిట్టాడుతున్నాను/ ఏకాకితనంలో/ బాల్యపు వసంతంలోంచి/ క్షతగాత్రపు జీవితంలోకి/ విసిరి వేయబడ్డాను../

ఎడతెగని వైరుధ్యాల సంఘర్షణ../ పోరాట కెరటాల్ని నెత్తిన మోసుకుంటూ/ అనంత ఆకలి యాత్ర’/ మానవ జీవితమంటేనే అంతు చిక్కనిది. ఎన్నెన్నో ప్రశ్నలను సంధిస్తూనే ఉంటుంది. సమకాలీనమైన సమస్యల వలయంలో చిక్కుకున్న మానవ జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. అభివృద్ధి చెందిన సాంకేతిక సమాచార విప్లవంలో మానవతా విలువలు మృగ్యమైపోతున్నాయి. సృజన కారులు తమ శక్తి మేరకు సున్నితమైన భావాలతో కూడిన రచనలతో మానవ జీవనాన్ని వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఒక సంస్కారవంతమైన సమాజ నిర్మాణం కోసం కవులు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. వర్తమాన కవిత్వంలో ఈ అంశాలన్నీ విభిన్న రకాలుగా కవిత్వంలో వ్యక్తం అవుతున్నాయి. ఈ కవితా సంపుటిలోని చాలా కవితల్లో ఇదే విషయాన్ని గమనిస్తాము. కవి అంటేనే కష్టజీవుల పక్షపాతి అనే కదా. కొమ్మవరపు గారి కవితా వాక్యాలు కూడా అంతే. ‘అన్ని ఋతువులూ, మట్టి స్వప్నం, భూమి చూపు, కొంచెం వెసులుబాటు కావాలి, ఒక అయుద్ధ గీతం, పర్యాయపదం, బాధల జడివాన, ఆశల మొక్క, జ్వలితులు, సరికొత్త ప్రవేశిక’ వంటి కవితలు కవి యొక్క అంతరంగంలోని ఆవేదనలకు ప్రతిబింబాలుగా నిలిచాయి.

కవి కాలంతో నడుస్తుంటాడు. తనకు పరిచయమైన ప్రతి వారిని ఏదో ఒక రూపంలో గుర్తుంచుకుంటూనే ఉంటాడు. తనకు ప్రేరణగా నిలిచిన వాళ్లను పదే పదే గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అలా వాళ్ళ రచనలతో మమేకమై తనను తాను ఉత్తేజపరుచుకుంటారు. లబ్ద ప్రతిష్టులైన ఆ కవులకు సముచితమైన రీతిలో తన కవిత్వంతో ఆరాధిస్తుంటారు. అట్లా ఈ కవిత్వ సంపుటిలో కూడా కె. శివారెడ్డి, ఎం.నారాయణ శర్మ, దేవి ప్రియ, ఆచార్య కొలకలూరి ఇనాక్, అయిల సైదాచారి గూర్చిన కవితలు మనల్ని హత్తుకుంటాయి. ఈ కవితా సంపుటిని ‘నాలుగు తరాలను/తన అక్షర సమ్మోహనంతో ప్రభావితం చేసి/కవిత్వంలో సరికొత్త నిర్వచనాలకు ప్రతీకైనవాడు/నిత్యం నా ఆలోచనలకు చమురైనవాడు/పచ్చటి వేప చెట్టు లాంటి/సరస్వతి సమ్మాన్ శ్రీ కె.శివారెడ్డి గారికి ప్రేమతో’ అంకిత మిచ్చి తన అచంచలమైన ప్రేమను చాటుకున్నారు కవి విల్సన్ రావు.
40 వసంతాల తన వైవాహిక జీవితాన్ని గురించి, తననే నమ్ముకుని వచ్చిన తన సహధర్మచారిని గురించి ‘ఒక పదునెక్కిన ప్రేమ సంభాషణ’ అంటూ ఆత్మీయమైన కవితను రాసి బహుకరించారు.

ఈ కవితను చిన్న కరపత్రాలుగా ముద్రించి పంపిణీ చేయవచ్చు. ఆడవాళ్ళకు రెండు జీవితాలు. ఒకటి పుట్టింట్లో ఉంటే మరొకటి మెట్టింట్లో ఉంటుంది. రెండు ప్రదేశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. కుటుంబాన్ని నిలబెడుతుంది. పిల్లలకు ఆదర్శంగా నిలుస్తుంది. జీవితంలోకి ప్రవేశించిన దగ్గర్నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న తమ అనుబంధపు జ్ఞాపకాలను దృశ్యమానం చేశారు కవి కొమ్మవరపు.
‘విశ్వమంత విస్తారమైన/ మన ప్రేమైక జీవనంలో/ నా అడుగులకు మడుగులోత్తుతూనే/ విషాదపు దినాల్ని/ నిద్ర కరువైన రాత్రుల్ని తోసిరాజని/ చిరునవ్వుతోనే బ్రహ్మజెముడు ముళ్ళలాంటి/ వేల ప్రశ్నల బాణాల్ని/ నువ్వు సంధించినప్పుడు/ పద్మవ్యూహంలో చిక్కుకున్న/ అభిమన్యుడనయ్యాను/ సమాధానం కోసం వెతుక్కుంటూ/ మేలు జ్ఞాపకాలకు మేలుకొలుపు/ గీతం పాడుతూ..’/ ఆమెతో కలిసి జీవితాన్ని కొనసాగిస్తున్న తీరును కవిత్వంలో రికార్డు చేయడం అభినందనీయమైనది. ఈ సంపుటిలోని ప్రతి కవిత ఒక ఆయుధంలా మనకు దర్శనమిస్తుంది. స్పష్టమైన చూపుతో కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్న కవిత్వ సంపుటిది. సమాజ హితం కోసం అవిశ్రాంతంగా సాహితీ సేద్యం చేస్తున్న కవి విల్సన్ రావుకి అభినందనలు. సాహితీ బంధువులందరూ తప్పకుండా ఆస్వాదించవలసిన ఒక ఉత్తమ కవిత్వ పరిమళమిది. ఒక ఆత్మీయమైన కరచాలనమిది. అమానవీయతపై ఎక్కుపెట్టిన కవితాస్త్రమిది.
-గోపగాని రవీందర్, 94409 79882

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News