Sunday, December 22, 2024

కల్లోల కాలం మీదుగా నడచిన ‘నెత్తుటి పాదాలు’

- Advertisement -
- Advertisement -

‘Poetry creates a metaphor, which enables the reader to experience what you have experienced with a kind of specificity and depth that is not possible in common language partly because the form also communicates the information’
STEPHEN DOBYNS
The court land Review Spring2004
ఒక సంక్షుభిత కాలం మానవాళి మీద దాడి చేసినప్పుడు,ఒక ఊహించని మిత్తవ మనిషిని నిరుత్తరుడ్ని చేసినప్పుడుమానవుడు తనకు చేతనయిన అన్ని మార్గాల ద్వారా దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేస్తాడు. తనను తాను కూడదూసుకొని కూలిపోతున్న కాలానికి తనదైన ఒక భూమికను అడ్డుగా వేయడానికి ప్రయత్నం చేస్తాడు. భౌతిక చర్యలకు ఊతమిచ్చే ఆంతరంగిక చర్యలు కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తాయి. లోన నుంచి తనలో నిబిడీకృతంగా వున్న థైర్యాన్ని, కర్తవ్యాన్ని, కార్యోన్ముఖంగా పనిచేసే విధానాన్ని ప్రోది చేసేది ఆ ఆంతరంగిక ఘర్షణే.తత్ఫలితంగా ఏర్పడిన భావసంచయంలోంచి మనిషికి ఏర్పడిన ఉత్పాతాలను ఎదుర్కొనే సత్తువ పోగవుతుంది. గడిచిన రెండు సంవత్సరాలలో మానవాళి మీద విరుచుకుపడి, మనిషిని ఆత్మరక్షణాత్మక ధోరణిలో పడవేచి,ప్రాణాల కోసం గిలగిలలాడి, సాటి మనిషి ఉనికికే ఉలికిపడేలా చేసి, ప్రకృతి పాఠాలు నేర్పింది కరోనా వైరస్.

కరోనా నేపథ్యంలో ప్రపంచం చూసే పద్ధతి లోనూ, మనం మన జీవితంలో చాలా వాటిని చూసే పద్దతి లో సమూలమైన మార్పులు అనివార్యంగా వచ్చాయి.మనిషికి మనిషికి మధ్య లుప్తమైన అనేక విషయాలు అనేక రకాలుగా మారిపోయి కొత్త నిర్వచనాలు తొడుక్కున్నాయి.ఈ పెనుమార్పులను అర్థం చేసుకోవడానికి, జీవితాన్ని సరైన దిశలో మలుపుకోవడానికి కళాత్మక వ్యక్తీకరణలు మాత్రమే మార్గం చూపాయి.అనేక ఆపద సమయాలలో మనిషికి మార్గదర్శనం చేసిన సాహిత్యం ఈ కరోనా పాండమిక్ సమయంలోనూ మారిన దుర్భర పరిస్థితులలో ఒక మానవీయ మార్గం ప్రపంచానికి చూపింది.
‘ఇప్పుడు రహస్య భాష ఏదీ లేదు./అంతా తేటతెల్లమే/ఒక అనివార్య దుఃఖ సందర్భంఅన్ని నిర్మానుష్య వీధులు, నిశ్శబ్ద ప్రళయ హోరు /ఇప్పుడు మనిషంటేనే భయంఇప్పుడు బ్రతుకంటేనే భయం..‘ అని కరోనాకాల వాస్తవస్థితిని సంభవామి యుగే యుగే కవితలో చెపుతూ కవి సరికొండ నరసింహ రాజు ’నెత్తుటి పాదాలు’ కవితా సంపుటి ప్రకటించారు.

అయితే కరోనా పట్ల కవుల బాధ్యత ఏమిటి ? జనాల్లో కరోనా ఎడల అవగాహన కల్పించడమా…థైర్యం పాదుకొల్పడమా..ఒకింత మనుషుల్లో భవిష్యత్ భరోసా కల్పించడమా..చేసిన తప్పులు తెలుసుకొని ప్రకృతి ని జీవితంలో భాగం చేసుకోమంటమా..కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులకు గురయిన వివిధ వృత్తుల శ్రామికులకు సంఘీభావం ప్రకటించడమా..ఆపన్నులను ఆదుకోవడమా..ఏమిటి కవులు కళాకారులు చేయవలసింది..చూద్దాం –
కవి నరసింహ రాజు ఏం చేసాడు..? ‘ కాలం చెక్కిట కన్నీటి చారికలు /తుడిచావా ఎప్పుడైనా/నాగరిక కాలుష్యానికి ప్రకృతి హెచ్చరిక/ చెవి పెట్టి విన్నావా ఎప్పుడైనా / అదుపుతప్పిన మనిషి మనుగడలోమార్పు కోసం వచ్చిన కుదుపే కదా కరోనా ‘ ….అనిప్రజలను కరోనా ఉత్పాతానికి గురయిన మనిషులను కర్తవ్యం దిశగా మలుపుతున్నాడు.‘ మట్టిచరిత్ర పుస్తకపు ఆనవాళ్ల సాక్షిగా /మనిషి ఎన్ని భయోత్పాతాలను అధిగమించలేదుఎన్ని ప్రాణాంతక వ్యాధుల గొలుసుకట్టు తెంపలేదు‘ అనిథైర్యవచనాలు కూడా చెబుతున్నాడు.దేశ నిజ పరిస్థితి ని వివరిస్తూ

‘కలలు కనాల్సిన దేశం /శవాలను కంటుంటే../ ఇప్పుడు నా దేశం కాటికాపరి లేని వల్లకాడు‘ అంటున్నాడు దేశంలో వున్న దౌర్భాగ్య స్థితి కి తీవ్ర నిరసనగా..అంతే కాదు కరోనా మానవాళికి కొన్ని పాఠాలు అనివార్యంగా నేర్పింది.‘ వినాశకర కత్తి మొన మీద వున్న లోకంలో / చివరకు మిగిలేది/ మనిషి కాడు /మనిషితనం మాత్రమే ‘…అనే జీవన సత్యం చెబుతూ..‘ ఔను..ఈ జీవన్మరణ పోరులో కరోనా మనిషి భాషను నేర్పింది!! ‘ అన్నాడు.తప్పదు.
లోకం తన సమస్యల నుండి విముక్తి పొందాలంటే మనిషి భాషను నేర్వాల్సిందే.తప్పదు. ఇది మనిషి ఏ వినాశకర సమస్యతో అయినా చేసే యుద్ధానికి వర్తిస్తుంది. రాజు గారిలో ఈ కవితా స్ఫూర్తి మిగతా అన్ని విషయాలకు ప్రసరించింది.ఇక్కడఎక్కడా ఆయన దృక్పథం పక్కకు పోలేదు. తన అక్షరాలు సరైన దిశలోనే ఎక్కుపెట్టాడు.‘బతుకులు భయం బందీఖానాలో బందీ అయినప్పుడుమనిషి చేతిలో థైర్యమనే ఆయుధం అక్షరాలు’

‘అరచేతులు అడ్డుపెట్టి ప్రాణదీపాలను కాపాడేవైద్యుల చేతిలో స్టెతస్కోప్ అక్షరాలు’ ‘చెత్త వీధులకు శుభ్రత వెలుగులద్దే/ పారిశుధ్య కార్మికుల చేతి చీపురు అక్షరాలు’ అనడం కవిశ్రామిక సమాజంతో మమేకమవుతూ..కరోనా కాలంలో సమాజ చలనానికి కారణమయిన వారే తన అక్ణరాలు అంటున్నాడు. అంతే కాదు.ఈ కల్లోల కాలంలో తమ జీవన భృతి కోల్పోయిన వృత్తికారులను ఆర్ద్రంగా తలచుకున్నాడు.
ఆకలి సముద్రం అటువంటి కవిత.ఈ సందర్భంగా ఎవరి చూపు సోకని జాలర్ల మీద కవి చూపు నిలిచింది.‘ కూటి కోసం సముద్రంపై వల విసిరే శ్రమ జీవులేకరోనా విసిరిన షికారీ వలలో చిక్కుకోవడం కాలం వైచిత్రి కదా..‘ అని వ్యాఖ్యానిస్తాడు.ఇది కవి దృష్టి కోణం లోని విభిన్నతను పట్టిస్తుంది.అలాగే కరోనా కాలంలో నిస్వార్థ సేవలు చేసిన వారిని తలుచుకుంటూ రాసిన ఆర్ద్ర కవిత ’ నాలుగో సింహం’.. బ్రతికిన మనుషులు అలాంటి మరో కవిత.

‘మనుషులే అరకలై దున్నే మట్టిలో/ రైతుల కన్నీరు తుడిచి/ ఆకుపచ్చని సేవాగీతమై ఆలింగనం చేసావు‘ అంటూ/ ఎందరినో కష్టకాలంలో ఆదుకున్న ’ రియల్ హీరో’ సోనూ సూద్ గురించిన కవిత కదిలిస్తుంది./ ‘రైతన్నల స్వేదాన్ని /కర్షకుల కార్మికుల శ్రమశక్తిని /తాకట్టు పెట్టావు./ అక్షరాలకు సంకెళ్లు వేసావు /నిజాలను తాకట్టు పెట్టావు./ ఆకాశానికి కాషాయం రంగు పులిమావు. /ప్రభాతాలను తాకట్టు పెట్టావు./ కాళ్ల కింద నేలనూ /తల మీద నింగిని తాకట్టు పెట్టావు./ పౌరహక్కులను తాకట్టు పెట్టావు./అస్తిత్వాన్ని తాకట్టు పెట్టావు./ అమ్మను అమ్మకం పెట్టావు./ప్రశ్నలను ఉరితాళ్లకు వేలాడదీసావు‘ అని దేశంలో నెలకొన్న/ దుర్మార్గ పరిస్థితులను థైర్యంగా ప్రశ్నిస్తూ..’ తక్కెడలో దేశం’/ అని అమ్మకపు సరుకు అయిపోయిందని అంటూ..క్రమంగా / రాష్ట్రంలో విశాఖ ఉక్కును అమ్ముతున్న కేంద్ర వైఖరికి దుయ్యబడుతున్నాడు.దేశంలో జరుగుతున్న అనేక ప్రజా వ్యతిరేక చర్యలపై ధర్మాగ్రహం ప్రకటిస్తున్నాడు. CAA పట్ల తీవ్ర నిరసన కవిత ‘మృత కణాలు’ ఈ విషయంగా వచ్చిన మంచి కవితల్లో ఒకటి.

సమాజంలో తమ ముద్ర వేసిన వ్యక్తుల పట్ల రాసిన ఎలిజీలు ..వాసిరెడ్డి వేణుగోపాల్ గురించి రాసిన ’ మరణం ఒక జయపతాక’,గొప్ప సహృదయ విమర్శకులు, సాహిత్య సంచారి అద్దేపల్లి రామమోహనరావు గురించి రాసిన కవిత ’ సాహితీ సమ్మోహనుడు’ , విశ్వకవి జాషువా స్మృతిలో రాసిన మంచి కవిత ’ గబ్బిలాల దండు కదిలిందిరో..’, దళిత ధిక్కార కవి కలేకూరి ప్రసాద్ తలపోతలో రాసిన ’ అతడే ఒక యుద్ధభూమి’ కవితలు వారి వారి స్మృతులను అక్షర బద్దం చేసాయి.
ఇంకా చెప్పుకోవాల్సిన కవిత ’ నీళ్లు పగబడతాయ్ ’ నగరాల్లో చెరువులు కుంటలు అన్నీ కబ్జాకు గురయితే ఆ నీళ్లు పోయే దోవ లేక నగరాలను వరదల రూపంలో ముంచెత్తే వైనాన్ని సకారణంగా ఏకరువు పెట్టిన కవిత./ ‘ మనిషి పాదం మోపడానికి నేల లేని నగరం /పూడ్చడానికి మట్టి లేని నగరం/ తాగడానికి నీళ్ళు లేని నగరం /ఒక భరోసా ఆకాశం లేని నగరం/ పేదవాడి బతుకుకు /ఒక ఆసరావాక్యం లేని నగరం/ వరదల్లో కొట్టుకుపోతుంటే /అందించే ఓ ఆపన్న హస్తపు తెప్ప లేని నగరం ‘ అని నగర భీభత్సాన్ని,/ నగరంలో మానవత్వం కరువైన వైనాన్ని వర్ణిస్తాడు./ ఎక్స్ రే ప్రధాన అవార్డు పొందిన ’ ఆకలి మాట్లాడితే..’ ఒక సిమిలీల వెల్లువ. కవిత ఒక ప్రవాహంగా కదిలిపోతూంది./ ‘ఊపిరి ఆడటం లేదు ’ జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం మీద వచ్చిన శక్తివంతమయిన కవిత.

‘The poem is both the winding road and the wild horse that gallops past us as we read, so that when we come around the last bend, there it is, waiting for our shock of recognition.’ ANDREW JOHNSTON
Best New Zealand poems, 2005 అన్నట్టే కవిత్వం రాయడానికి సాధన కావాలి.తపస్సాధన కావాలి.వస్తువును తనలో ఉన్మీలనం చేసుకొని కవిత శిల్ప సౌష్టవంతో బయటకు వచ్చేదాకా కవి తపస్సాధన చేయాల్సే వుంది. నెత్తుటి పాదాలు కవితా సంపుటి ఒక కల్లోల కాలాన్ని ప్రతిభావంతంగా రికార్డు చేసిందని ఖాయంగా చెప్పొచ్చు.

పుస్తకం : నెత్తుటి పాదాలు
కవి : సరికొండ నరసింహ రాజు, పేజీలు :216,
వెల : 200/-,
ప్రతులకు : 9398254545.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News