Wednesday, January 22, 2025

వశంకాని పరవశం

- Advertisement -
- Advertisement -

ఒక ప్రముఖ వార్తా పత్రికలో తన ఇంటర్వ్యూ వచ్చేంత వరకూ నాకు మానసా చామర్తి కవిత్వం పై ఆసక్తి కలిగింది కాదు. కవిత్వం గురించిన ఆమె అభిప్రాయాలూ, అటుతరువాత తన కవితలూ రెండింటినీ కలగలుపుకుని చదవడం మూలానే ఒక అంచనాకు వీలు పడింది. ఏ కవిగారైనా తన కవితా వస్తువులూ, వ్యక్తీకరణలోని ప్రత్యేకతలవల్ల మనకి సరికొత్తగా, ఆశావహంగా కనిపిస్తారు. మానస కూడా అంతే. ఎన్నో సౌందర్యాత్మక భావనలతో, ప్రాణవంతమైన పదసౌరభంతో ఆమె కవిత్వం ఒక అనంతమైన జీవనేఛ్ఛను ప్రకటిస్తుంది. ఆమెకు శాంతీ, సంభ్రమాలు కవిత్వ ప్రేరకాలు. జీవితంలోగల అసలుసిసలు అశాంతికి మూలాలు దాచేయడం వలన, మనం ఇందులో సంభ్రమాన్నే ఎక్కువ అనుభూతి చెందుతాం.పాఠకుల ఇంద్రియ జ్ఞానానుభవాల్ని ఏ రకంగా తాదాత్మ్యస్థితికి చేర్చినా, మానస వస్తురూప విన్యాసాలకు సున్నితమైన మానవ స్వభావం ఆదరువు. ఆమె కవితల్లోని భావోద్వేగాలన్నింటికీ ఒక ఉదారమైన నవజీవన సంక్లిష్ట మానవ హృదయమే పునాది. భద్రుడుగారు మానసని మేఘసందేశకారుడి పరంపరకి చెందిందని చెబుతారు. మానసకి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇష్టమైన కవి.

ఏది ఏమయినా మానస వంటి కవులు వ్యక్తిగత అనుభవ తలమ్మీదనుంచే సార్వజనీన సమ్మతి సాధిస్తున్నామన్న భ్రమ కల్పిస్తారు. నిజానికి ఈ కవుల్ని చదువుతున్నప్పుడు అనుభవాన్ని విడదీసుకుని పలవరించ కూడదేమో. అది లౌకికమా కాదా అని తర్కించవలదు కామోసును. అతి సామాన్యుని అనుభూతికి చాలా కవితలు దూరంగా ఉంటాయి. అయినప్పటికీ పాణి ఎక్కడో ’జీవన వాస్తవం నుంచి మానవ ఉద్వేగాలను వేరు చేయలేం’ అనడం ఎందుకు గుర్తొస్తుందంటే; మానస ప్రమాణాల్లో ఉన్న స్త్రీ హృదయపు వ్యామోహామ్మొత్తమూ కేవలం కల్పనే కాదు కనుక. ఆమెకు కలిగిన అనేక వాస్తవికానుభవాలను ఈ కవిత్వం ’రవ్వంత’ ప్రతిబింబిస్తుంది. చిరంజీవి (పే 71), అమ్మ వెళ్ళిన రాత్రి (పే 46), ఆహ్లాదజనని (పే 29), చంద్రకాంత మణి (పే 95), కవితల సారం, మన హృదయాల్ని ఎంతో కదిలిస్తుంది. తల్లీ పిల్లల అనుబంధాన్ని చదివి మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోతాం. ప్రేమ (instinct) మానస యొక్క ముఖ్యమైన కాన్వాసు. ఆమె కవిత్వాభిరుచిలో మనిషి ప్రాకృతిక సంబంధాలలో ఉండే హెచ్చు తగ్గులు, ఇష్టాయిష్టాలు భలే కవ్విస్తాయి. మనిషి దౌర్భల్యాన్నీ, మనోబలాన్నీ మానస సమపాళ్ళలో తవ్వి బయటకు తీస్తుంది.

శిక్ష, రా, లోలకం, మీకు తెలియందేం కాదు, సరే గుర్తుచేయన్లే, సరాగతీరాల్లో, ఎందుకంటే – ఇవన్నీ ఉన్మత్త ప్రేమ కేంద్రకంగా ఉన్న కవితలు. చాలామట్టుకు నేల విడిచినట్టుగా తోస్తాయి. వీటిని చదివాక ఊబిలాంటి దైనందిన యాంత్రికత మధ్య ఎంతటి సుకుమారమైన క్షణాల్ని చేజార్చుకుంటున్నామో కదా అని విస్తుపోతాం. ఇది మనిషిలోని జఢత్వాన్ని, స్తబ్దతనీ పెకలిస్తున్న ప్రయత్నంగా చూడవచ్చు. కానీ మనిషి జీవితమంటే ఇవేనా ? మానస కొన్ని కవితల్లో పెట్టే తీపిగాట్లు; ఆమెలోని చిలిపిదనాన్ని, ఎదుటివారిలోని ప్రేమ రాహిత్యాన్ని మాబాగా అంచనా వేయగలిగిన పరిణితినీ; అభినందించకుండా ఉండలేం. బాహ్య ప్రపంచపు ఒత్తిళ్ళనుంచి మనిషి తనదైన ఊహా ప్రపంచంలోకి ప్రవేశించగల మార్మిక సంవాద వాక్యాలను బాణాలుగా సంధిస్తుందామె. ’కావలింతల్లో ఊరటుంటుంది, రా’ అని గడుసుగా లాక్కెళుతుంది. ఈ అబ్బురం ఏ కవిత్వానికైనా కొంత అవసరమే, కానీ పరవశ లో ఉన్న వాస్తవికతను ఎక్కువపాళ్ళు కాల్పనికత డామినేట్ చేస్తుంది. ఊహల వేళ్ళు (ఆమె ముట్టుకున్న మధ్యతరగతి) నిర్దిష్ట జీవన నేపధ్యాల్లోంచి కదా నాటుకుని నిలబడాలి. అది కనబడదు.

సామాజిక సందర్భాల గౌరవాన్ని తగ్గించేట్టు తాను కవిత్వం రాయలేనని మానస నిజాయితీగా చెప్పింది. తనది కాని విషాదాల్ని స్పృశించలేనని స్పష్టతనిస్తుంది. శిశిర కాల విషాదపు అసంతృప్తి, నిర్లిప్తత తప్ప మానసకి మానవ జీవితంలోని ఎట్టి సంక్షోభమూ, ఆరాటమూ, ఉరుకులు పరుగుల వెనుక గల విషాద వర్తమానం తెలియనిదనుకోలేము. జీవన తాత్వికత పట్ల మానసకు గల చూపే అసలు భిన్నంగా ఉంది. ఆమె ఆత్మాశ్రయ లక్షణంలో ఆధునిక బౌద్ధికత కొంత ఊరట. లేకపోతే సెర్చ్ ఇన్జన్లకి దొరకని ప్రేమంటే మోజు’ లాంటి వాక్యాలు మనల్ని కరెంట్ షాకుకి ఎందుకు గురిచేస్తాయి ? ప్రేమకోసం ఈ తరం గూగుల్నీ, క్రోమ్ నీ వేడుకుంటోన్న దయనీయ సత్యం చెబుతూ ఎన్ని మెమొరీ కార్డులు ముడేసినా తన మనసు కన్నా పెద్ద జ్ఞాపక భాండాగారం లేదంటుంది. అదేవిధంగా ’ముద్దాడకుండా, మాట్లాడకుండా ప్రేమిస్తున్నామని ఎవరికైనా చెప్పగలమా’ (ఒక మెలకువ లోకి) అంటుంది. బహుశా కరోనా కాలపు గుండె తలుపులు మూసుకుపోయిన ఒంటరితనం ఆమెని కుదిపివేసింది. ‘నిప్పులు’ (పే 83), లాంటి కవితల్లో ’ఎంగిలి పడ్డం మొదలవుతుంది,

నిప్పులు పొగలు కక్కుతుంటాయి, గాలులు వేడెక్కిపోతాయి; నులక మంచం మీద మసక వెన్నెల వెల్లకిలా పడుకుని వేడుక చూస్తుంది’ అన్నప్పుడు రోజంతా శ్రమతో నలిగిపోయిన కష్టజీవులు ఒకరికొకరు సాంత్వన పడ్డంలో ఉండే అపారమైన కరుణ, బెంగ తాలుకు ఒక విషాదం మనల్ని కదిలించివేస్తుంది. ఇలాంటివి చదివాకే మానసకి స్వర్గ ద్వారాల దగ్గర నిలబడ్డ జ్ఞాపకాల ఆకర్షణతో బాటు, మానవ సంఘర్షణల్లోని అసహనం, అన్వేషణల్లోని కాంక్షా తెలియకుండా ఉండవనిపిస్తుంది.
కనుక ఆమె కాల్పనిక తర్కంలో, విషాద వాస్తవికతని తన అనుభవాన్నుంచి ఎలా వేరు చేసుకున్నదీ, లేదా అక్కరలేదనుకున్నదీ ఒక స్వీయ చైతన్యానికి చెందిన నిర్ణయమని నా అభిప్రాయము. కవిత్వ వస్తు నిర్ణాయక ప్రతిభ, కల్పన రెండూ వేర్వేరు విషయాలు. కొన్ని అనుభవాల్నుంచి తాము ఎప్పుడు పరాయికాగలరో ప్రతీ కవికీ స్పష్టంగా తెలుస్తుంది. మానస కూడా ’ఎంతో వ్యక్తిగతమైనవే సార్వజనీనం కాగలవు కూడా’ అనడం అలాంటి తప్పించుకోజూడటమే. ఇదొక సాంస్కృతిక తడబాటు. సామాజిక సంబంధాల రాపిడికి గురికాని భావసముదాయం. ఫెమినిష్టులు ‘All personal is political’ అన్నారంటే స్త్రీల విషయంలో ఏదీ వ్యక్తిగతం కాదు,

అన్నీ రాజకీయ పరమైనవే అనడం ఇక్కడ జ్ఞాపకం తెచ్చుకోవడం తప్పు కాదు. మానస కవితలన్నీ వ్యాసాలు, ద్వేషాలు, ప్రకటనలు, సిద్దాంతాలూ కావు. సంతోషమే. కానీ అనియత భావోద్వేగాలు, అపరిమితమైన వ్యక్తివాద స్వేచ్చ ఆమె కవిత్వ చలన వ్యూహానికి సార్వజనీనత చేకూర్చదు. ఇందుకు నైరూప్యత లేకపోవడం కూడా మరొక దోహదకారి.
తన సామాజిక స్పృహకున్న పరిమితి బాహాటంగా చెప్పుకోవడం చేత ఆమె కవిత్వ దృక్పధాన్ని తప్పుబట్టను. ఆమె నవీనురాలు. కళ యొక్క వినియోగ పరిధి విశాలమైనది కనుక, ఏకీభవించకపోయినా ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తాను. కానీ కేవలం జీవితానందాల్ని భిన్న కోణాల్నుంచి నిర్వచించడం, ఆత్మానుభూతుల్ని సరికొత్తగా వ్యక్తీకరించడం, ఒక అంతర్ముఖీన జీవన సౌందర్యాన్ని చూపి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయడం; ఇవన్నీ ఏ వాస్తవికతనుండి పుట్టాయో కవికీ, చదివే పాఠకుడికీ తెలియకుండా ఉండవని మాత్రం చెప్పగలను. ప్రకృతి నిజం. ఆ సృజనాత్మక ఉపాసనలోకి ఏది ఆరోపించి మనతో సహా ఎవర్ని మురిపించినా ఆ నిజం తాలూకు సంపూర్ణ, ఖాళీతనాల్ని కేవలం పదాలతో నింపితే సరిపోదు. బలమైన కారణాలుంటాయ్, వెతకాలి. మరీ ముఖ్యంగా మనం బతికే

’లిబెరలైజ్డ్’ బ్రతుకుల మూలాలకి అందరమూ ఎక్కడ ముడిపడి, అతుక్కుని ఉన్నామో ‘పరవశ’ చెబితే ఎంత బాగుణ్ణో కదా అనిపిస్తుంది. మానస మాట అందరూ వింటారు. ఆ సౌందర్యాత్మక విద్య తనకుంది. కవి స్థల కాల వాస్తవికతా బంధితుడు, విముక్తుడు కూడా అని అంటాడు పాపినేని శివశంకర్. పరవశ దేంతో మనల్ని బంధిస్తోంది ? మరిదేన్నుంచి విముక్తం చేస్తోంది ? సకల సామాజిక జీవనానుభవాల్ని గౌరవించగలననుకున్న మానస కవిత్వ స్వభావానికి చెప్పలేనంత వస్తు పరిమితి ఉంది. గోచరాగోచరత్వముంది. ఉపమలూ, రూపకాల్లో కాదు; దాని మూలం తన కవిత్వ వాస్తవిక కార్యకలాపంలో దాగి ఉంది. మాంత్రికబంధనంలోనున్న పంచ వన్నెల చిలుక రెక్కలు సాచి సువిశాల నింగిలోకి ఎగిరితే చూడాలని ఎవరికి ఉండదు. ప్రేమ ప్రశ్నార్ధకమైనా ప్రేమించినవాణ్ణి వదులుకోలేనట్టు, వాన ఏం చేసి పోతుందో తెలీకున్నా చేతులు చాపడం మానలేకున్నాను‘ (ముసురు) అంటుంది మానస. ఈ అందమైన కవిత్వ పుస్తకంతోనూ అదే మన పేచీ.

పరవశ (కవిత్వ సంకలనం), రచన: మానస చామర్తి, పేజీలు :111, వెల: 150, ప్రతులకు: అనల్ప 7093800303

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News