Monday, December 23, 2024

జీవితాన్ని అనుభవించి రాసిందే కవిత్వం: జూలూరు గౌరీ శంకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కన్నీళ్లను తాగిన కవిత్వం రాసిన కవులు ఎక్కడ ఉన్నారంటే యాకూబ్ రాసిన జీవన జీవకవిత్వం చూస్తే అర్థమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. జీవనాధారాల్ని వెదుక్కుంటూ జీవన సత్యాలను కవిత్వంగా రాస్తే ఎలా ఉంటుందంటే అది యాకూబ్ ఆత్మ కథానాత్మక కవిత్వంలా ఉంటుందన్నారు. సోమవారం సాహిత్య అకాడమి కార్యాలయంలో ప్రసిద్ధకవి యాకూబ్ రాసిన ‘మనుషుల్రా మనుషులు” కవిత్వ సంకలనాన్ని జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధలు, కష్టాలు పడీపడి జీవితంలో వేసే ప్రతి అడుగును ఒక సవాలుగా చేసుకుని తనను తాను జయించుకుంటూ దీనులను, హీనులను, మూగజీవాలుగా పడివున్న మనుషులను పట్టించుకోండని యాకూబ్ తన కవిత్వంతో గొంతెత్తి అరుస్తున్నాడని చెప్పారు. జీవితాన్ని అనుభవిస్తూ పలవరిస్తూ రాసిన కవిత్వమే జీవ కవిత్వంగా చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మతాలన్నవి మనకొద్దని మానవత్వమే మనుషులకు హద్దు కావాలని యాకూబ్ కవిత్వంగా తపించటాన్ని ప్రతి ఒక్కరూ గుండెలకు హత్తుకోవాలన్నారు.

గీతా, ఖురాన్, బైబిల్ అన్నీ మనిషిని ప్రేమించమనే తత్వాన్నే చెప్పాయనే విశాలతత్వంతో యాకూబ్ కవిత్వంగా వర్ణించారని అభివర్ణించారు. ఏది ఏమన్నా ఏది ఎట్లా విశ్లేషించినా, అంతా మనిషి మీద ప్రేమే కదా అని యాకూబ్ కవిత్వం చదువుతుంటే అర్థమవుతుందన్నారు. స్పష్టతలేని ప్రతి కోణము అది చీకటితో సమానమేనని మనిషికి స్పష్టత అవసరాన్ని నొక్కి చెప్పే కవిత్వం విస్తృతంగా రావాలన్నారు. మనుషుల్ని మతాలుగా, కులాలుగా ఆధిపత్యాల కింద సమాజాన్ని కబళిస్తున్న దుశ్చర్యలను చూసి “మనషుల్లారా మనషులు” అంటూ కవి ఆగ్రహిస్తున్నారని తెలిపారు. మతం మనిషి దేహమైతే అది దేశానికే ముప్పు తెస్తుందని జూలూరు హెచ్చరించారు. ఈ పుస్తకావిష్కరణలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి దాశరథి అవార్డు గ్రహీత శ్రీరామోజు హరగోపాల్, సీనియర్ పాత్రికేయుడు గంధం బంగారు, ప్రఖ్యాత కవి యాకూబ్ లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News