సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివ రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అభ్యుదయ భావాలూ, ప్రజా సాహిత్య వ్యాప్తికి కవులు, రచయితలు కృషి చేసి సమాజ ప్రగతికి దోహద పడాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివ రావు కోరారు. సామజిక వ్యవస్థను జాగృతం చేసిన చరిత్ర ’అరసం’ కు ఉందని తెలిపారు. హైదరాబాద్, హిమాయత్ నగర్, మఖ్డూమ్ భవన్ లో శుక్రవారం తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం ఇటీవలే ఎంఎల్‌ఎగా ఎన్నికైన కూనంనేని సాంబశివ రావు సన్మాన సభ నిర్వహించింది.ఈ సభకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. పల్లేరు వీరాస్వామి అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్ స్వాగతం పలికారు.
రాష్ట్రంలోని నలుమూలలనుండి కవులు, రచయితలు ఈ సభకు హాజరైయ్యారు. ఈ సందర్బంగా డా. పల్లేరు వీరాస్వామి, రాపోలు సుదర్శన్, సంఘం ఉపాధ్యక్షులు బొమ్మగాని నాగభూషణం, నిధి, కార్యనిర్వాహక కార్యదర్శి కెవిఎల్, కార్యదర్శులు డి. కమల రెడ్డి, మద్దిలేటి, కార్యనిర్వాహక సభ్యులు జి. చంద్రమోహన్ గౌడ్, వై. పాండురంగ రెడ్డి, అటుకుల రాజు, బి. మహేందర్ గౌడ్ తదితరులు కూనంనేని సాంబశివ రావు కు శాలువా, గజమాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ బిజెపి తన మతతత్వ విష రాజకీయాలతో భారతదేశాన్ని చీకటి యుగంలోకి నెట్టిందని, దేశంలో స్వేచ్ఛ కరువై అశాంతి, అసహనం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేసారు. మతతత్వ, విభజన రాజకీయాలు దేశానికి ప్రమాదకరం అని, మణిపూర్ హింసతోపాటు వివిధ రాష్ట్రాల్లో మత హింసపై మౌనంవహించొద్దని, ప్రగతిశీల రచయితలు రచనల ద్వారా ఐక్యత, శాంతి వైపు ప్రజలను ప్రేరేపించడానికి కృషి చేయాలనీ అయన కోరారు. సమాజంలో సామాజిక న్యాయం కోసం తీసుకురావాల్సిన మార్పులు ప్రగతిశీల రచయితలు తమ రచనల ద్వారా తెలియజేయాలన్నారు.