ఆదిలాబాద్: జిల్లాలోని ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు కాస్తలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు తాగే మంచి నీటి ట్యాంకులో, మధ్యాహ్న భోజన సామగ్రిపై కొందరు దుండగులు పురుగుల మందు చల్లారు. ఈ విషయాన్ని సిబ్బంది గ్రహించి పిల్లలను వాటికి దూరంగా ఉంచారు. శనివారం, ఆదివారం సెలవులు కావడంతో సిబ్బంది వంటగదికి తాళం వేసి వెళ్లారు. ఆ సమయంలో దుండగులు వచ్చి పురుగుల మందు చల్లారు.
సోమవారం స్కూల్ తెరిచి మధ్యాహ్న భోజనం కొరకు పాత్రలు శుభ్రం చేయాలని చూడగా.. వాటి నుంచి నురగ, చెడు వాసన వచ్చింది. దీంతో అక్కడ గమనించగా.. పురుగుల మందు డబ్బ కనిపించింది. వెంటనే సిబ్బంది పురుగుల మందు కలిపినట్లు గ్రహించి మధ్యాహ్న భోజనం వండలేదు. నీళ్ల ట్యాంకులోనూ కలిపినట్లు గుర్తించి పిల్లలు నీటి కుళాయిల వద్దకు వెళ్లకుండా ఆపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.