Sunday, September 8, 2024

భారత్‌లో పిఓకె అంతర్భాగం అవుతుంది: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

సీరంపూర్: పాక్ ఆక్రమిత కశ్మీరు(పిఓకె) త్వరలోనే భారత్‌లో అంతర్భాగమవుతందని, తాము స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని సీరంపూర్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ 2019లో 370 అధికరణను రద్దు చేసిన తర్వాత కల్లోలపూరిత కశ్మీరులో శాంతి పునరుద్ధరణ జరిగిందని, ఇప్పుడు పిఓకెలో కూడా ఆజాదీ కోసం నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని అన్నారు. గతంలో కూడా కశ్మీరులో ఆజాదీ అంటూ నినాదాలు వినిపించేవని, ఇప్పుడు పిఓకెలో కూడా అవే నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయని ఆయన చెప్పారు. గతంలో కశ్మీరులో రాళ్ల దాడి జరిగేదని, ఇప్పుడు పిఓకెలో కూడా రాళ్లదాడి జరుగుతోందని ఆయన చెప్పారు. పిఓకెను స్వాధీనం చేసుకోవాలన్న డిమాండుపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని, పిఓకెని స్వాధీనం చేసుకోవద్దని మణి శంకర్ అయ్యర్ వంటి కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, కాని తాను ఒకటే చెబుతున్నానని, పిఓకె భారత్‌లో అంతర్భాగమని, దాన్ని స్వాథీనం చేసుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు అవినీతిపరులైన ఇండియా కూటమి నాయకులకు, ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఒక్కపైనా అవినీతి ఆరోపణ లేని నిజాయితీపరుడైన నరేంద్ర మోడీకి మధ్య ఎంపికగా అమిత్ షా అభివర్ణించారు. చొరబాటుదారులు కావాలో లేక శరణార్థుల కోసం సిఎఎ కావాలో బెంగాల్ నిర్ణయించుకోవాలని ఆయన చెప్పారు. జీహాద్ కోసమా లేక వికాస్ కోసమా అని బెంగాల్ ఓటర్లు నిర్ణయించుకోవాలని ఆయన కోరారు. సిఎఎని వ్యతిరేకిస్తున్నందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓటు బ్యాంకును సంతృప్తిపరచడానికి ఆమె చొరబాటుదారులకు మద్దతుగా ర్యాలీలు తీస్తున్నారని ఆయన ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News