Monday, December 23, 2024

నిజాలు ‘జల’ సమాధి

- Advertisement -
- Advertisement -

పోలవరం బ్యాక్ వాటర్‌లో అసత్యాల వరద

జులైలో భద్రాచంలం వద్ద 71అడుగులకు 1986 ఆగస్టు 75.6అడుగుల నీటిమట్టం
కనికట్టేనా? సిడబ్ల్యుసి సాంకేతిక అధ్యయనంలోనే లోపమా? కేంద్రం చెవికెక్కని ముంపు రాష్ట్రాల గోడు

మన తెలంగాణ/హైదరాబాద్ :వందల కొద్దీ గ్రామాలను వరదనీటిలో ముంచేసి లక్షలాది మంది ప్రజలు తరతరాలుగా నమ్ముకున్న సెంటిమెట్లు, విధానాలు, సంస్కృతి సంప్రదాయాలను, చారిత్రిక ఆనవాళ్లతో సహా శా శ్వతంగా జలసమాధి చేయబోతున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపులో ఏది నిజం అన్నది నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తోం ది. వాతావరణంలో అనూహ్య మార్పులు చో టు చేసుకుంటున్నాయి. ఉన్నట్టుండి ఉష్ణోగ్రత లు పెరిగిపోతున్నయి. ఉలుకు పలుకూ లేకుండానే ఎల్‌నినో రూపంలో ఉపద్రవాలు నదీపరివాహక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ద క్షిణ భారతదేశంలో కృష్ణానదికి వచ్చిన 2009 నాటి ఆకస్మిక వరదల్లో నదికి ఇరువైపు లా మునకేసిన వందలాది గ్రామాలు దశాబ్దకాలం దాటినా తేరుకోలేకపోతున్నా యి. ఈ ఏడాది జులైలో గోదావరికి పరివాహకంగా భారీవరదలు తెలంగాణలోని పలుజిల్లా ల్లో తీరగ్రామాల జనజీవనాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఆ నాటి దృశ్యాలు. అనుభవించిన కష్టాలు, వివిధ రంగాలకు జరిగిన నష్టాలు నిజం కాదన్న రీతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరు ఈ ప్రాంత ప్రజల గాయంపై పుండుమీద కారం చల్లినట్టు బాధిస్తోంది.

పోలవరం బ్యాక్‌వాటర్ ముంపు సమస్యలపై జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన నాలుగు రాష్ట్రాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వెఖరి పట్ల తెలంగాణ ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. చారిత్రక భద్రాచలం పట్టణం గోదావరి వరదనీటిలో మునకకు పోలవరం బ్యాక్ వాటర్‌కు సంబంధం లేదని జల్‌శక్తిశాఖ అధికారుల తాజా ప్రకటన పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఇంకా నిర్మాణంలోనే వుంది. 1978 ఆగస్టు 7 ఈ ప్రాజెక్టుకు సిడబ్యుసి ఆమోదముద్ర వేసింది. గోదావరి వాటర్ ట్రిబ్యునల్ కూడా దీన్ని ఆమోదించినట్టు కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పట్ల ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినా, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పోలవరం రిజర్వాయర్ వెనుక జలాలు ఎంత వరకు ప్రభావితం చూపుతాయన్న అంశంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పలు సందేహాలకు తావిస్తోందటున్నారు. గోదావరి నదీలో వందేళ్ల నీటి ప్రవాహాల చరిత్రను ఆధారంగా తీసుకునే గరిష్టంగా 28.5లక్షల క్యూసెక్కుల వరదనీటిని దృష్టిలోపెట్టుకుని పోలవరం ప్రాజెక్టును రూపొందించారు.

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను కేంద్రం నెత్తికెత్తుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 50లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు సులువుగా వదిలేవిధంగా మార్చిన డిజైన్లకు క్షణం కూడా జాప్యం చేయకుండా సిడబ్ల్యుసి ఆమోదముద్ర వేసింది. ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర అభిప్రాయాలను నామమాత్రంగా కూడా పట్టించుకోలేదు.సామర్థ్ధం పెంపు ద్వారా తెలంగాణలో అదనంగా ముంపేమి ఉండదని, భద్రాచలం మునగదని అందుకు తాము అభయం ఇస్తున్న రీతిలో తెలంగాణ, చత్తీస్‌గఢ్ , ఒడిశా రాష్ట్రాలను బుజ్జగించే ప్రయత్నం చేసింది. ఒక వైపున జులై రెండవ వారంలో వచ్చినభారీ వరదలు, భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం అన్ని ప్రమాద హెచ్చరికలను దాటిపోయి అందనంత ఎత్తులో 71అడుగులుకు చేరిన రికార్డులను సైతం కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. నదిలో 43అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కంటే 28అడుగుల ఎత్తులో, రెండవ ప్రమాద హెచ్చరిక కంటే 23అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహించింది.

నదిలో 53అడుగుల మూడవ ప్రమాద హెచ్చరికను గంట వ్యవధిలోనే దాటేసి 18అడుగుల ఎత్తులో గోదావరి నది ఉప్పోంగి ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదారు రోజుల పాటు గోదావరి వరదనీటిలో గ్రామీణ జన జీవనం తడిసి మోసులెత్తింది. పోలవరం వద్ద కాఫర్ డ్యాం అడ్డుకాకపోతే స్పిల్‌వే మీదుగా గోదావరి వరదనీరు దిగువకు జారుకోవాలంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. పోలవరం జలాశయంలో నీటిని కూడా నిలువ చేయలేదు. స్పిల్ డిజైన్లు 50లక్షల క్యూసెక్కులకు మార్చినట్టు చెబుతోంది. మరి ఎగువ వస్తున్న వరద వచ్చింది వచ్చినట్టుగా పోలవరం స్పిల్‌వే మీదుగా సాఫీగా ఎందుకు సాగలేదో సిడబ్ల్యుసి వివరించాల్సిన అవసరం ఉందంటున్నారు. భద్రాచలం వద్ద 71అడుగుల ఎత్తున నీటిమట్టం ఎగువన 24కిలోమీటర్ల దూరాన ఉన్న దుమ్ముగూడెం దాకా పోటెత్తి తీర ప్రాంత గ్రామాలకు గోదావరి తన ప్రళయరూపాన్ని చూపింది. నది ఉప్పొంగి 24లక్షల క్యూస్కెల నీటి ప్రవాహం 5రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నరకం చూపింది. ఎగువన మహారాష్ట్ర , చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో వర్షం వెలిసి పోయి ప్రాణహిత, సీలేరు,ఇంద్రావతి తదితర గోదావరి ఉపనదుల్లో వరద తగ్గినా పోలవరం బ్యాక్‌వాటర్‌పోటు మాత్రం భద్రాద్రిజిల్లాను వదల్లేదు.

ఇప్పుడే ఇలా ఉంటే ..ప్రాజెక్టు పూర్తయ్యాక ఎలా!:

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పూర్తి కాకముందే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ దుమ్ముగూడెం వరకూ ఎగదన్నింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక పోలవరం రిజర్వాయర్‌లో 180టిఎంసీలకు పైగా నీటిని నిలువ చేస్తారు. అప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎగువన గోదావరి నదికి ఇరువైపులా కాంటూర్ లెవల్స్ వరకూ పుష్కలంగా నీరు నిలువ వుంటుంది. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం నాలుగు సార్లు ప్రమాద హెచ్చరికలు దాటేసింది. వాతవారణంలో మార్పుల వల్ల ఇటు వంటి పరిస్థితులు ఇక ప్రతిఏటా సాధారణం అయ్యేఅవకాశం లేకపోలేదని వాతావరణ రంగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే ఇక ఉత్తర తెలంగాణ ప్రాంతం ప్రత్యేకించి గోదావరి నదితో ముడిపడి ఉన్న మంజీరా, మానేరు, కిన్నెర సాని , కడెం, ప్రాణహిత , తదితర ఉపనదులకు గోదావరిబ్యాక్ వాటర్ పోటు నిత్యకృత్యం అవుంతుందన్న ఆందోళనలు పుట్టుకొస్తున్నాయి.

మరో మారు అధ్యయనం చేయిస్తే కేంద్రానికి వచ్చే నష్టమేమిటో:

భారీ వర్షాలు , వరదల సమయంలో గోదావరి నదికి వచ్చే వరద ప్రవాహాలు, పోలవరం బ్యాక వాటర్ విస్తరించే పరిధిపై మరో మారు అధ్యయనం చేయిస్తే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటన్న ప్రశ్నలు తెలంగాణ , చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలనుంచి పుట్టుకొస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగం రోజురోజుకు నవీన పోకడలతో ప్రగతికి కొత్త బాటలు వేస్తోంది. నూతన టెక్నాలజీతో రూపొందిన పరికరాలను ఉపయోగించుకుని గోదావరి వదర ప్రవాహాలపై తాజాగా అధ్యయనం జరపాల్సిందే అన్న డిమాండ్లు పెరగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించకుండా ఆధునిక సర్వేల ద్వారా పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై నిజాలు నిగ్గుతేల్చాలని మూడు రాష్ట్రాల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News