భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం అవసరం ఉందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాయం నుంచి సండ్ర వెంకట్ వీరయ్య, ఎంఎల్ సి తాత మధు మీడియాతో మాట్లాడారు. పోలవరం బ్యాక్ వాటర్ సమస్యను అధ్యయనం చేయాలని కేంద్రంతో పాటు ఎపి ప్రభుత్వాన్ని కోరారు. ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణ కు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పోలవరాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోకపోతే గిరిజన ఆదివాసీ తెగలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. కరకట్టల నిర్మాణం ఎపి లోనూ యుద్ధ ప్రాతిపదికన జరగాలని సూచించారు. కేంద్ర జల సంఘం కూడా ఈ విషయం లో అధ్యయనం చేయాలన్నారు. భద్రాచలం దగ్గర 71 అడుగుల మేర నీరు ప్రవహించినా గ్రామాల్లో 75 అడుగులు దాటి నీరు ప్రవహించిందన్నారు. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలంటే కేంద్ర ప్రభుత్వ జోక్యం చేసుకోవాలన్నారు.
ఎమ్మెల్సీ తాత మధు మీడియాతో మాట్లాడుతూ…
వరదల్లోనూ సిఎం కెసిఆర్ సాహసోపేతంగా పర్యటించి సమర్థ నాయకత్వాన్ని చాటారని ఎంఎల్ సి తాత మధు ప్రశంసించారు. ప్రజలు మనోధైర్యం కోల్పోకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం పని చేశారని కొనియాడారు. ఇంతటి వరదల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా కెసిఆర్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని మెచ్చుకున్నారు. ఈ ప్రెస్ మీట్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే ఎం. నాగేశ్వర్ రావు, తదితరలు పాల్గొన్నారు.