Monday, December 23, 2024

ఒడిశా అసెంబ్లీలో పోలవరంపై రచ్చ

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న పోలవరం డ్యాం ప్రాజెక్టుపై ఒడిశా అసెంబ్లీలో గురువారం తీవ్ర రభస జరిగింది. పోలవరం ప్రాజక్టు కారణంగా ఒడిశాలోని గిరిజనుల ప్రాబల్యంగల మల్కన్‌గిరి జిల్లాలోని భారీ విస్తీర్ణంలో భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టు వల్ల జరిగే నష్టాన్ని అంచనా వేసేందుకు ఒక సభా సంఘాన్ని నియమించాలని కోరుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు సభలో అలజడి సృష్టించారు. జీరో అవర్‌లో కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు రామచంద్ర కదం ఈ అంశాన్ని లేవనెత్తారు.

మల్కన్‌గిరి జిల్లాలో 1400 హెక్టార్ల నుంచి 1500 హెక్టార్ల భూమిని ముంపునకు గురిచేసే పోలవరం ప్రాజెక్టును బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా మల్కన్‌గిరి జిల్లాలోని అమాయక గిరిజనులు, పేద ప్రజలు బాధితులుగా మారనున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా బాధితులుగా మారే ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టును, మల్కన్‌గిరి జిల్లాలోని ప్రజలపై దాని ప్రభావాన్ని చర్చించేందుకు ఒక సభా సంఘాన్ని నియమించాలని ఆయన డిమాండు చేశారు.

పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఒడిశాలోని అడవులు, వన్యాప్రాణులు, స్థానిక పర్యావరణంపై కూడా పడుతుందని ఆయన చెప్పారు. ఒడిశా నుంచి ఎన్నికైన 20 మంది ఎంపీలు, దబుల్ ఇంజిన్ ప్రభుత్వం మల్కన్‌గిరి జిల్లా ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యాయని కదం ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీని సంతృప్తి పరిచి తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పోలవంరం ప్రాజెక్టును ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు.

కేంద్రం చర్యలను నిరసిస్తూ ప్రజా ఉద్యమాన్ని తమ పార్టీ చేపడుతుందని ఆయన తెలిపారు. పోలవరం అంశాన్ని కాంగ్రెస్ చేపట్టిన సమయంలో సభలో ఉన్న బిజెపి సభ్యులు మౌనంగా ఉన్నారు. స్పీకర్ సురమ పథి ఈ వ్యవహారంపై స్పందించకపోవడంతో ఇందుకు నిరసనగా కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు తారాప్రసాద్ బహినిపతి నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు సభ మధ్యలోకి దూసుకువెళ్లి పోలవరం ప్రాజెక్టుపై సభా సంఘం వేయాలని డిమాండు చేశారు. స్పీకర్ పోడియంపైకి ఎక్కేందుకు బహినిపతి ప్రయత్నించగా రిపోర్టర్లకు చెందిన టేబుల్‌పైన నిలబడి కదం నిరసన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News