హైదరాబాద్‌లో 17 టీముల ఏర్పాటు
హైదరాబాద్‌లో 20, రాచకొండ 4ని కాపాడిన పోలీసులు
గత ఏడాది సైబరాబాద్‌లో 541మంది పిల్లలను కాపాడిన పోలీసులు
247 కేసులు నమోదు
హైదరాబాద్: ఆపరేషన్ ముస్కాన్‌కు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి ఏడాది బాల, బాలికలను పని నుంచి విముక్తి కల్పించేందుకు ఆపరేషన్ ముస్కాన్‌ను జులైలో చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ముస్కాన్ ని మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు చేపడుతున్నారు. ఇప్పటికే ఆపరేషన్ ముస్కాన్‌ను ప్రారంభించిన పోలీసులు 20మంది పిల్లలకు విముక్తి కల్పించారు. చిత్తుకాగితాలు ఏరుకోవడం, బాలకార్మికులుగా పనిచేయడం, మిస్సింగ్ పిల్లలను దర్పిన్ ద్వారా గుర్తించి వారి తల్లిదండ్రు వద్దకు చేర్చుతారు. గత ఏడాది వివిధ రకాల పనులు, భిక్షాటన చేస్తున్న బాలబాలికలు 541మందికి సైబరాబాద్ పోలీసులు విముక్తి కల్పించారు. బాలబాలికలతో పనులు చేయిస్తున్న 247మందిపై కేసులు నమోదు చేశారు. మిస్సింగ్, బాలకార్మికులు, వెట్టి చాకిరి చేస్తున్న వారు, కుటీర పరిశ్రమల్లో పనిచేస్తున్నవారు, భిక్షాటన చేస్తున్న వారిని పట్టుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
కొందరిని ఫేస్ రికగ్నిషన్, దర్పన్ యాప్, టిఎస్ కాప్ యాప్ ద్వారా బాలబాలికల తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పోలీసులు ఆపరేషన్ ముస్కాన్‌ను చేపట్టిన పోలీసులు వారం పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటి కోసం 17టీములను ఏర్పాటు చేశారు. బాల, బాలికలతో పనిచేయిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అన్ని శాఖల అధికారులతో కలిసి టీములను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కాపాడిన బాల, బాలికలను యూసుఫ్‌గూడలోని పునరావాస కేంద్రానికి తరలించారు. రాచకొండ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్8లో ఇబ్రహింపట్నంలో నలుగురు బాలకార్మికులకు విముక్తి కల్పించారు. పిల్లలతో అధిక గంటలు పనిచేయించడంతో పాటు తక్కువ వేతనాలు ఇస్తుండడంతో పోలీసులు దాడి చేసి విముక్తి కల్పించారు. పిల్లలతో పనిచేయిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇతర రాష్ట్రాల వారే ఎక్కువ…
ఆపరేషన్ ముస్కాన్‌లో రక్షించిన పిల్లల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారు. వారిని చిన్న చిన్న పరిశ్రమల్లో పనికి పెట్టుకునేందుకు తల్లిదండ్రులే పంపిస్తున్నారు. సంవత్సరానికి ఇంత చొప్పున తల్లిదండ్రులతో మాట్లాడుకుని ఇక్కడికి తీసుకుని వస్తున్నారు. ఇక్కడ వారికి సరిగ్గా తిండి పెట్టకుండా, వసతులు సరిగా ఏర్పాడు చేయకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. చాలామంది పిల్లలతో అధిక గంటలు పనిచేయిస్తున్నారు. బాలలతో పనిచేయించుకుని తక్కువగా వేతనాలు చెల్లిస్తున్నారు. వాటిని కూడా రెగ్యులర్‌గా ఇవ్వడంలేదు. స్పిన్నింగ్ మిల్లులో పనులు చేస్తున్న బాల కార్మికుల్లో ఎక్కువగా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఓడిసా, అస్సాం రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.