Sunday, September 8, 2024

పుణె రోడ్డు ప్రమాదం నిందితుని తల్లి అరెస్టు

- Advertisement -
- Advertisement -

క్రితం నెల తన పోర్ష్ కారుతో ఇద్దరు యువకుల చావుకు కారణమైనట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 ఏళ్ల యువకుని తల్లిని పుణె పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని రక్తం నమూనాల స్థానంలో ఆమె నమూనాలు చూపినట్లు నిర్ధారణ అయిన తరువాత తల్లి శివాని అగర్వాల్‌ను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ‘పిటిఐ’కి వెల్లడించారు. శివాని అగర్వాల్ శుక్రవారం రాత్రి ముంబయి నుంచి పుణె వచ్చిన తరువాత ఆమె ఆచూకీ తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను కోర్టులో హాజరు పరచవలసి ఉంది. తమ దర్యాప్తులో భాగంగా పోలీసులు అబ్జర్వేషన్ హోమ్‌లో దాదాపు ఒక గంట సేపు యువకునితో అతని తల్లి సమక్షంలో మాట్లాడారు.

యువకుని ఈ నెల 5 వరకు అబ్జర్వేషన్ హోమ్‌కు రిమాండ్ చేసిన విషయం విదితమే. ‘మైనర్ తల్లి సమక్షంలో హోమ్ లోపల అతని విచారణను జరుపుతాం’ అని అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్) శైలేష్ బల్కవాడి చెప్పారు. మైనర్‌తో పోలీసులు మాట్లాడడానికి ముందు ఆయన ఆ విషయం చెప్పారు. టీనేజర్ దర్యాప్తునకు పోలీసులను జువెనైల్ జస్టిస్ బోర్డ్ (జెజెబి) శుక్రవారం అనుమతించింది. జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం, మైనర్ విచారణను తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించవలసి ఉంటుంది. ఇది ఇలా ఉండగా, టీన్ రక్తం నమూనాల స్థానంలో అతని తల్లి రక్తం నమూనాలు ఉంచారని ప్రమాదంపై దర్యాప్తులో తేలిందని పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News