Tuesday, January 21, 2025

పన్వార్ హత్య నిందితులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

24 గంటలోనే కేసు ఛేదించిన పోలీసులు, అదుపులో నలుగురు.. పరారీలో ఇద్దరు

మన తెలంగాణ/గోషామహల్: హైదరాబా ద్‌లోని షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేగంబజార్‌లో శుక్రవారం రాత్రి జరిగిన నీరజ్ పన్వార్ పరువు హత్య కేసును పోలీసులు 24 గంటల లోపు ఛేదించారు. హత్యకు పాల్పడిన 6 మంది నిందితుల్లో 4 మందిని కర్ణాటక సరిహద్దు పరిగి సమీపంలో పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలను వెస్ట్‌జోన్ డిసిపి జోయల్ డేవిస్ శనివారం మీడియాకు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడానికి కమిషనర్ ఆదేశాల మేరకు ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డిసిపి వెల్లడించారు. శుక్రవారం జరిగిన హత్య ఘటనలో ఇప్పటి వరకు 6 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించామని తదుపరి విచారణ భాగంగా ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటామని డిసిపి తెలిపారు. నిందితుల్లో 4 మందిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కేసులో ఎ1. అభినందన యాదవ్ (26), ఎ2.విజయ్ యాదవ్ (22), ఎ3.సంజయ్ జాదవ్ (25), ఎ4.రోహిత్ యాదవ్ (18), ఎ5.మహేష్ యాదవ్ (21), ఒక ఎ6. మైనర్ బాలుడుతో కలిసి మొత్తం 6 మంది కేసుపై కేసు నమోదు చేసినట్లు డిసిపి తెలిపారు. నిందితుల్లో మైనర్ బాలుడు తప్ప మిగిలిన 5 మంది హత్యకు గురైన నీరజ్ భార్య బంధువులే అని తెలిపారు. ఈ నిందితులు నీరజ్ పన్వార్‌ను ముందుగా బండరాయితో మోది ఆ తర్వాత కత్తులతో దాడి చేసి చంపారని తెలిపారు. అంతకు ముందు నిందితులు మద్యం సేవించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందన్నారు. ముందుగా నిందితులను ముందుగా కోర్టులో హాజరు పరచి ఆ తర్వాత కస్టడీలో తీసుకుని విచారించనున్న డిసిపి జోయల్ డేవిస్ తెలిపారు.

నా భర్త హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలి : సంజన మృతుడి భార్య

కులాంతర వివాహం చేసుకున్న తన భర్త నీరజ్ పన్వర్‌ను దారుణంగా కత్తులతో పొడిచి చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని మృతుడి భార్య సంజన డిమాండ్ చేశారు. శనివారం షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎదుట తన రెండు నెలల బాబుతో కలిసి ఆందోళన చేపట్టిన సంజన మీడియాతో మాట్లాడుతూ తన సోదరులే హత్యకు పాల్పడినట్లు ఆరోపించారు. యేడాది నుంచి తమకు తన కుటుంబీకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. నిందితులను ఉరి శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

కళ్ల ముందు పొడిచి చంపారు : మృతుడి తాత జగదీష్ పన్వర్

తన మనవడు నీరజ్ పన్వర్‌తో కలిసి బేగంబజార్ చేపల మార్కెట్ నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తమను వెంబడించిన ఐదుగురు దుండగులు తమకు అడ్డగించి కళ్లల్లో ఏదో చల్లడంతో తమకేమీ కనిపించలేదన్నారు. దీంతో దుండగులు మనవడు నీరజ్ పన్వర్ తలపై బండరాయితో బలంగా కొట్టి కింద పడేసి కత్తులతో పొడిచారన్నారు. తాను అడ్డుకునేందుకు యత్నించగా తనపై కూడా దాడి చేశారన్నారు. ఏడాది క్రితమే తాము అఫ్జల్‌గంజ్ ఠాణాలో ఫిర్యాదు చేశామన్నారు.

హత్యకు నిరసనగా వ్యాపారుల ర్యాలీ

నీరజ్ పన్వర్ హత్యకు నిరసనగా వందలాది మంది వ్యాపారులు బేగంబజార్‌లోని మిట్టీకాషేర్ నుంచి షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా నిందితులను వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. బేగంబజార్ వ్యాపారులంతా ముక్తకంఠంతో నీజర్ పన్వర్ హత్యను ఖండిస్తూ, పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టడం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

బేగంబజార్ బంద్…

నీరజ్‌పన్వర్ హత్యకు వ్యతిరేకంగా బేగంబజార్ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి మృతుడి కుటుంబీకులకు మద్దతు పలికారు. దీంతో ప్రతినిత్యం వేలాది మంది కొనుగోలుదారులతో కిటకిటలాడే బేగంబజార్ వెలవెలబోయింది. బేగంబజార్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి, ఎక్కడ నలుగురు కలిసి ముచ్చటించుకున్నా నీరజ్‌పన్వర్ హత్యోదంతంపై చర్చించుకుంటూ కనిపించారు.

కులోన్మాద హత్యకు గురైన నీరజ్ పన్వర్ భార్య, తన 2 నెలల బాబుతో పాటు బంధువులు, వ్యాపారులతో కలిసి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, విషయం తెలుసుకున్న పశ్చిమ మండల డిసిపి డి. జోయల్ డేవిస్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని మృతుని బంధువులకు న్యాయం జరిగేలా చూస్తానని నచ్చజెప్పారు. దీంతో ఆందోళన విరమించి వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News