Monday, December 23, 2024

బండి దీక్ష భగ్నం, అరెస్టు

- Advertisement -
- Advertisement -

Police arrested Bandi Sanjay in Karimnagar

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలు, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి జాగరణ దీక్షకు సిద్ధమైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఆదేశాలను ధిక్కరించిన సంజయ్‌ను కరీంనగర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

మన తెలంగాణ\కరీంనగర్ : జాగరణ దీక్షకు పూనుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ను పోలీసులు ఆదివారంనాడు రాత్రి అదుపులోకి తీసుకుని దీక్షను భగ్నం చేశారు. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కాకుండా అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నందుకు పోలీసులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఆదేశాలను తుంగలోతొక్కుతూ ప్రజారోగ్యానికి భంగం కలిగించేలా బండి సంజయ్ మొండిగా వ్యవహరించడం మూలంగానే, నిబంధనలకు అనుగుణంగానే అరెస్ట్ చేశామని పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల బదిలీల్లో అమ్రాలు చోటుచేసుకుంటున్నాయని, 317జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో బండి సంజయ్ జాగరణదీక్ష తలపెట్టారు. సంజయ్ అరెస్ట్‌కు ముందు దీక్షా స్థలిలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. బిజెపి కార్యకర్తలు పోలీసులను కుర్చీలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు కార్యాలయం గేట్లను బలప్రయోగం ద్వారా తెరిచారు.

ఈ సందర్భంగా అరగంటసేపు అక్కడ హైడ్రామా కొనసాగింది. ఒమిక్రాన్ కేసులు దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా వ్యాపిస్తుండడంతో ప్రభుత్వం ఈ నెల 10వరకు సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. మరోవైపు కేంద్రం కూడా సమూహాలను నిషేధించాలని రాష్ట్రాలను స్పష్టంగా ఆదేశించింది. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు కూడా సమూహాలను నియంత్రించడం ద్వారానే కరోనాను చెక్ పెట్టాలని మార్గదర్శకాలను విడుదల చేసి, రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. అయినా వాటన్నింటిని ధిక్కరించి జాగరణకు పూనుకోవడంతో బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా ఆదివారం ఎంపి తన క్యాంపు కార్యాలయం వద్ద అనుచరులతో కలిసి దీక్ష చేయడానికి సిద్దపడ్డారు. ఎంపి సంజయ్ దీక్షకు ఎటువంటి అనుమతిలేదని పోలీస్ కమిషనర్ తెలిపారు. కొవిడ్ విస్తరిస్తున్న దృష్టా దీక్షలకు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వడంలేదని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నాయని ఆయన తెలిపారు. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర నిబంధనలు తోసిరాజని సంజయ్ దీక్షకు దిగడంతోనే పోలీసులు ఇలా ఆంక్షలు విధించి ఆయన్ను అరెస్ట్ చేశారు. కాగా, దీక్ష కోసం బీజేపీ నేతలెవరూ అనుమతి కోరలేదని కమిషనర్ తెలిపారు. అంతకుముందు దీక్ష శిబిరం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ సందర్భంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడీ కృష్ణారెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News