Wednesday, January 22, 2025

తెలుగు కుర్రాడికి చిత్రహింసలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఇరవయ్యేళ్ల ఓ కుర్రాణ్ని చిత్రహింసలు పెట్టి, వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ముగ్గురు వ్యక్తుల్ని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం కోసం అమెరికాలోని తన బంధువు ఇంటికి వెళ్తే, అతడే కిరాతకుడిగా మారి ఏడు నెలలుగా దారుణంగా హింసించిన వైనమిది. ఒక మనిషి మరో మనిషి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం తాను ఇంతకుముందు ఎక్కడా చూడలేదని ప్రాసిక్యూటర్ సైతం ఆవేదన వ్యక్తం చేశారంటే, ఆ కుర్రాణ్ని ఎన్నిరకాలుగా హింసించారో ఊహించుకోవచ్చు. దారుణానికి పాల్పడిన వ్యక్తి పేరు వెంకటేశ్ రెడ్డి సత్తారు (35). ఈ దారుణ సంఘటనలో వెంకటేశ్‌కు నిఖిల్ వర్మ పెన్మత్స, శ్రవణ్ వర్మ అనే మరో ఇద్దరు సహకరించారు. పేర్లను బట్టి వీరంతా తెలుగువారేనని తెలుస్తోంది. ఇండియాకు చెందిన 20 ఏళ్ల కుర్రాడు (పేరు గోప్యంగా ఉంచారు) ఉద్యోగం కోసమని ఏడు నెలల క్రితం మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ చార్లెస్ కౌంటీలో ఉండే వరుసకు సోదరుడయ్యే వెంకటేశ్ రెడ్డి ఇంటికి వెళ్లాడు.

అప్పటినుంచీ వెంకటేశ్ అతన్ని తన గుప్పిట్లోనే ఉంచుకుని, దారుణమైన చిత్రహింసలు మొదలుపెట్టాడు. ఉదయం లేవగానే ఇంటి పనులు చేసి, వెంకటేశ్ రెడ్డి చేసే ఉద్యోగానికి సంబంధించి ఆన్ లైన్లో పనులు చేసి పెట్టాలి. సాయంత్రం కాగానే మళ్లీ బట్టలుతకడం, గిన్నెలు తోమడం వంటి పనులు చేయాలి. కనీసం కడుపునిండా తిండిగానీ, కంటి నిండా నిద్రగాని పోనిచ్చేవారు కాదని ఆ కుర్రాడు పోలీసుల ముందు వాపోయాడు. రాత్రి పనంతా పూర్తయ్యాక, రెండు గంటల సేపు వెంకటేశ్ రెడ్డికి మసాజ్ చేయాలి. తాను ఏం చేస్తున్నానో నిరంతరం వెంకటేశ్ రెడ్డి సిసి టీవీలో చూస్తూ ఉంటాడని బాధితుడు చెప్పాడు. నిర్మాణంలో ఉన్న బేస్ మెంట్లో కటిక నేల మీద పడుకోవాలి. మూడు గంటలే నిద్ర పోనిచ్చేవారనీ, ఆ తర్వాత నిద్రలేపి, పనులు చేయించేవాడనీ అతను చెప్పాడు. పని చేయకపోతే, కరెంటు వైర్లతో, పీవీసీ పైపులతో ఒళ్లంతా వాతలు తేలేటట్లు కొట్టేవాడట. వెంకటేశ్ తోపాటు నిఖిల్, శ్రవణ్ కూడా తనను హింసించేవారని ఆ కుర్రాడు చెప్పాడు.

వెంకటేశ్ కు మరో రెండు ఇళ్లు ఉన్నాయని, అక్కడ కూడా తనతో చాకిరీ చేయించేవాడనీ చెప్పాడు. ఒక రోజు ఆ కుర్రాణ్ని గమనించిన పొరుగు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. అతని ఒంట్లో ఎముకలు విరిగిపోయి ఉన్నాయని, ఒళ్లంతా గాయాలున్నాయని పోలీసులు చెప్పారు. నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసి, బాధిత కుర్రాడిని ఆస్పత్రిలో చేర్చారు. అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌ఆర్‌ఐ సత్తారు వెంకటేష్ రెడ్డికి, తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వైసిపి తన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈ ఘటనను వైయస్‌ఆర్‌సిపి తీవ్రంగా ఖండిస్తుందని తెలిపింది. ఈ కేసులో ఉన్న సత్తారు వెంకటేష్ రెడ్డి చేసిన నేరం అతని వ్యక్తిగతం అని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరణ ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News