నైజీరియాకు చెందిన వారితో కలిసి ఛీటింగ్
రూ.1.96కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్న నిందితులు
అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: అపెక్స్ బ్యాంక్( తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్) సర్వర్ హ్యాక్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఇద్దరు నిందితులను నగర సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నగరంలోని చందానగర్‌కు చెందిన యాసిన్ భాషా, ఎండి రఫీ టోలీచౌకిలోని నైజీరియన్లతో స్నేహం ఏర్పడింది. బ్యాంక్‌కు సంబంధించిన నేరాలు చేసేందుకు ఖాతా తెరువాలని 10శాతం కమీషన్ ఇస్తామని చెప్పడంతో ఇద్దరు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఖాతాలు తెరిచారు. నైజీరియాకు చెందిన నిందితులకు వాటి వివరాలు ఇవ్వడంతో వారు బ్యాంక్ నుంచి వివిధ బ్యాంకులకు రూ.1.96కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. నిందితుల బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ అయిన డబ్బులను విత్‌డ్రా చేసి నైజీరియన్లకు ఇచ్చారు. ఈ విషయం కనిపెట్టిన బ్యాంక్ రీజినల్ మేనేజర్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.