Saturday, September 28, 2024

తుపాకులు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

వేరే రాష్ట్రం నుంచి పిస్తోళ్లు కొనుగోలు చేసిన హైదరాబాద్‌కు తీసుకుని వచ్చిన వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి పిస్తోల్, రివాల్వర్, తపంచా, ఎయిర్ పిస్తోళ్లు నాలుగు, 11 లైవ్ రౌండ్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బి నగర్ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని కాకినాడకు చెందిన బొల్లింకాల సాయిరామ్ రెడ్డి సూరారంలో ఉంటున్నాడు. డిగ్రీ డిస్ కంటీన్యూ చేసిన నిందితుడు కాకినాడలోని రేమండ్స్ షోరూంలో సేల్స్ మ్యాన్‌గా పనిచేశాడు. తర్వాత పని కోసం హైదరాబాద్‌కు వచ్చి నాగోల్‌లోని అమేజాన్ బ్రాంచ్‌లో నాలుగు నెలలు ఆఫీస్ బాయ్‌గా పనిచేశాడు. గతంలో సాయిరామ్‌రెడ్డి చోరీలు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత సుల భంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే నిందితుడికి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. అతడి ద్వారా తుపాకుల వ్యాపారం గురించి తెలుసుకున్నాడు. అక్కడి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ వేశాడు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వద్ద నుంచి ఏడు వెపన్స్ కొనుగోలు చేశాడు. వాటిని తీసుకుని వచ్చి హైదరాబాద్‌లో విక్రయించేందుకు ఆర్‌కె పురం వద్ద తిరుగుతుండగా మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి, నేరెడ్‌మెట్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇన్స్‌స్పెక్టర్లు సందీప్ కుమార్, జంగయ్య, పరమేశ్వర్ తదితరులు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News