Monday, December 23, 2024

కొంప ముంచిన కూల్‌డ్రింక్..

- Advertisement -
- Advertisement -

లూధియానా: ఎనిమిది కోట్ల రూపాయలు దోచుకున్న ఓ దొంగ దంపతులు ఉచితంగా ఇచ్చే పది రూపాయల కూల్‌డ్రింక్‌కు ఆశపడి పోలీసులకు దొరిపోయారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం లూధియానాలోని సిఎంఎస్ సర్వీసెస్‌కు చెందిన కార్యాలయంలో ఈ నెల 10న మన్‌దీప్ కౌర్, ఆమె భర్త జస్విందర్ కౌర్ లు కలిసి సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి రూ.8 కోట్లు దోచుకున్నారు. దోపిడీ తర్వాత మన్‌దీప్ కౌర్, జస్విందర్ సింగ్‌లు సిక్కుల పుణ్యక్షేత్రమైన హేమకుండ్ సాహిబ్‌కు తీర్థయాత్రకు వెళ్లారు. తమ మిషన్ విజయవంతమైనందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్లినట్లు లూధియానా పోలీసు కమిషనర్ మన్‌దీప్ సింగ్ సిద్ధూ చెప్పారు. దేవుడిని దర్శించుకున్న తర్వాత నేపాల్‌కు పారిపోవాలని వాళ్లిద్దరూ నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

అయితే దోపిడీకి సహకరించిన మన్‌దీప్‌కౌర్ సహచరుడు గౌరవ్‌ను అరెస్టు చేసిన పోలీసులు కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టారు.అలాగే దొంగతనంతో సంబంధం ఉన్న 12 మందిలో 9 మందిని అరెస్టు చేశారు. అయితే మన్‌దీప్‌కౌర్, జస్విందర్ సింగ్ దంపతులు కేదార్‌నాథ్, హరిద్వార్, హేమకుండ్ సాహిబ్‌లను దర్శించుకోనున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.అయితే హేమకుండ్ సాహిబ్‌లో వారు ఉన్నట్లు తెలిసినా తీర్థయాత్రలకు వేలాది మంది వస్తుంటారు కాబట్టి అంతమందిలో ఆ జంటను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. దీంతో పోలీసులు వారిని గుర్తించడానికి ఓ ప్లాన్ వేశారు. ఈ ప్రణాళికలో భాగంగా దేవుడిని దర్శించడానికి వచ్చే యాత్రికుల కోసం ఉచిత కూల్‌డ్రింక్‌ను పంపిణీ చేశారు. పోలీసులు ఊహించినట్లుగానే ఉచిత కూల్‌డ్రింక్‌ను తీసుకోవడానికి మన్‌దీప్‌కౌర్, జస్విందర్ సింగ్‌లు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ముఖం కనిపించుకుండా ఉండడానికి వస్త్రం అడ్డుపెట్టుకున్నారు.

కానీ డ్రింక్ తాగడం కోసం ముఖంపై ఉన్న వస్త్రాలను తీశారు. దీంతో వెంటనే పోలీసులు వారిని గుర్తు పట్టారు. కానీ ఏమీ తెలియనట్లు నటించారు. హేమకుండ్ సాహిబ్ ప్రార్థనలు ముగించుకుని బైటికి వచ్చాక వెంబడించి ఇద్దర్నీ పట్టుకున్నారు. వారిద్దరి వద్దనుంచి రూ.21 లక్షల నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు పోలీసులు ‘లెట్స్ క్యాచ్ క్వీన్ బీ( రాణి తేనేటీగను పట్టుకుందాం) అని పేరు పెట్టారు. గతంలో బీమా ఏజంట్‌గా పని చేసిన మన్‌దీప్‌కౌర్ భారీగా అప్పులు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జసిదర్‌ను వివాహం చేసుకున్న ఆమె సంపన్నురాలుగా మారాలని భర్తతో కలిసి ఈ దోపిడీకి పాల్పడింది.ఈ జంట దోచుకున్న 8 కోట్లలో ఇప్పటివరకు దాదాపు రూ.6 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం జరిగిన వంద గంటల్లోనే దోషులను అరెస్టు చేశామని పంజాబ్ పోలీసు చీఫ్ గౌరవ్ యాదవ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News