మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) సంచలన నిర్ణయం తీసుకొంది. ఉద్యోగానికి ఎంపికయ్యేలా చూస్తామంటూ మభ్యపెట్టే దళారుల సమాచారమందించిన వారికి నజరానా ప్రకటించింది. ఇచ్చిన సమాచారం ఆధారంగా గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా దళారులను నమ్మితే చిక్కుల్లో పడతారని హెచ్చరించింది. అలా ప్రయత్నించినట్లు నిరూపితమైన అభ్యర్థులపైనా వేటు తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు అర్హత లేకుండా పోతుందని వెల్లడించింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని, మెరిట్ ఆధారంగానే తుది జాబితా వెల్లడవుతుందని స్పష్టం చేసింది. అందువల్ల అభ్యర్థులు ఎలాంటి వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ప్రకటించింది.
పోలీసు తుది రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయినట్లు మండలి స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల్లో గత నెల 14-26 మధ్య చేపట్టిన ఈ ప్రక్రియలో 1,08,940 మంది అభ్యర్థులకు గాను 97,175 (89.2శాతం) మంది హాజరైనట్లు ప్రకటించింది. ఉద్యోగాలకు ఎంపికయ్యేలా చేస్తామని మభ్యపెట్టే దళారులను కనిపెట్టేందుకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టాస్క్ బృందాలను రంగంలోకి దింపినట్లు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. దళారుల గురించి తెలిస్తే 93937 11110 లేదా 93910 05006 కు సమాచారం అందించాలని, సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.
వయోపరిమితి విధింపు అసాధ్యం
టిఎస్‌ఎల్‌పిఆర్‌బి నియామక ప్రక్రియలో ముందస్తుగానే ధ్రువీకరణ పత్రాల్ని పరిశీలించడం సాధ్యం కాదని మండలి స్పష్టం చేసింది. మొత్తం 12.9 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. తొలిదశలోనే వాటిని పరిశీలించడం అసాధ్యమని పేర్కొంది. ఈ కారణంగానే తుది రాతపరీక్షకు ఎంపికైన తర్వాతే ధ్రువీకరణ పత్రాల్ని పరిశీలించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొంది. అందుకే వయసు విషయంలో నోటిఫికేషన్‌లో పొందుపరిచిన తేదీల ప్రకారం అర్హులైతేనే దరఖాస్తు చేసుకోవాలని అప్పుడే స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తు చేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, త్రివిధ దళాల ఉద్యోగులు, హోంగార్డులు, వితంతువులు, ఎన్‌సిసి శిక్షకులు, జనగణన విభాగంలో తాత్కాలిక ఉద్యోగులు, ఇలా ఒక్కో కేటగిరీలో పనిచేస్తున్న వారికి వయసులో ప్రత్యేకంగా సడలింపులు ఉండటంతోపాటు ఒక్కో పోస్టుకు పలు కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తులు చేసినట్లు పేర్కొంది. ఆ కారణంగానే టిఎస్‌ఎల్‌పిఆర్‌బి వెబ్‌సైట్ సాఫ్ట్‌వేర్‌లో వయసుకు పరిమితి విధించలేదని స్పష్టం చేసింది. ఇలాంటి సంక్షిష్టతల దృష్ట్యా వయోపరిమితిలో తాము అర్హులమే..? అని సరిపోల్చుకొన్న తర్వాతే దరఖాస్తు చేయాలని పదేపదే ప్రకటించినట్లు గుర్తు చేసింది. ఈ దశలో వయసు విషయంలో ఎలాంటి గందరగోళాన్ని సృష్టించొద్దని పేర్కొంది.
నమ్మి మోసపోవద్దు
మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థులను కోరారు. ఏ నియామక ప్రక్రియలోనైనా చివరిదశలో సహజంగానే దళారులు మోసగించే ప్రయత్నాలు చేస్తారని మండలి పేర్కొంది. దళారులు ఎలా మోసం చేస్తారనే వివరాలను వెల్లడించింది. ఉద్యోగానికి ఎంపిక చేసేందుకు ముందస్తుగానే బ్యాంకు ఉమ్మడిఖాతా తెరిపించి డబ్బు వేయిస్తారు. లేదంటే మధ్యవర్తి వద్ద పెట్టిస్తారు. ఒకవేళ అభ్యర్థి గనక మెరిట్ ప్రాతిపదికన ఎంపికైతే అది తమ చలవేనని చెప్పి డిపాజిట్ చేసిన డబ్బును లాగేసుకుంటారు. రాజకీయప్రముఖులతో లేదా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు నటిస్తారు. అభ్యర్థిని సచివాలయానికి లేదా ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకెళ్తారు. అభ్యర్థిని బయటే కూర్చుండబెట్టి.. మాట్లాడి వస్తామని లోపలికెళ్తారు. బయటికి వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చేలా మాట్లాడినట్లు నమ్మకం కలిగిస్తారు. అభ్యర్థిని నమ్మించేందుకు ఫోర్జరీ చేసిన ధ్రువీకరణ పత్రాలను తయారుచేస్తారు. నకిలీ ఈ-మెయిల్/వెబ్‌సైట్ పోస్ట్/వీడియోలను సృష్టిస్తారు.