తెలంగాణ బిజెపి ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియూ) విద్యార్థులపై కర్ర విరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం’ అంటూ తెలంగాణ బిజెపి ట్వీట్ చేసింది. యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలు భూమి వేలంపై తీవ్ర వివాదం గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. శాసనసభలో సైతం ఈ భూములకు, యూనివర్శిటీకి ఎటువంటి సంబంధం లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. అయినప్పటికీ 400 ఎకరాల భూముల వేలంపై యూనివర్సిటీలో ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా విద్యార్థులు గత కొద్ది రోజులుగా నిరసనలు, ర్యాలీలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం పలు ప్రాంతాల్లో జేసీబీలతో చెట్లను నరికి వేస్తున్నట్లు గమనించిన విద్యార్థులు ర్యాలీగా వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై స్పందించిన తెలంగాణ బిజెపి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో యూనివర్సిటీ భూముల రక్షించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించింది. ‘సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై కర్ర విరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం, విద్యార్థులు అని కూడా చూడకుండా, ఏమాత్రం కనికరం చూపకుండా పశువులను లాక్కెళ్లినట్టుగా లాక్కెళ్లి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను నిర్బంధించిందని ఆ ట్వీట్‌లో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఉచిత హామీలను నెరవేర్చడానికి హెసియూ భూములను అమ్మ దలచిన రేవంత్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను ‘గుంట నక్కలు‘గా వర్ణించిన రేవంత్ రెడ్డి అభ్యంతర వ్యాఖ్యలపై హెచ్‌సియూ విద్యార్థులు మండిపడి కాంగ్రెస్ సర్కారు తీరుపై, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని, భేషరతుగా క్షమాపణ చెప్పి, హెచ్‌సియూ భూముల అమ్మకాన్ని ఆపాలని విద్యార్థులు బిజెపి ఆ ట్వీట్‌లో డిమాండ్ చేసింది.
భావితరాలకు గజం జాగా కూడా మిగిల్చరా?
భావితరాలకు గజం జాగా కూడా మిగిల్చరా? అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. హెచ్‌సియూ భూముల వేలంపై ఆందోళన చేస్తున్న ఏబివిపి విద్యార్థులను అరెస్టు చేయడాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖంఢించారు. పోలీసుల ద్వారా భయాందోళనలకు గురిచేసి కాంగ్రెస్ పాలన చేయాలనుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్శిటీ భూములకే రక్షణ లేకపోతే ఎట్లా? అని ప్రశ్నించారు. ప్రతిష్టాత్మక సెంట్రల్ వర్శిటీని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.