హెచ్‌సిఎస్‌సి, హైదరాబాద్ సిటీ పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహణ
ప్రారంభించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: సైబర్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ గురించి పిల్లలకు అవగాహన కల్పించేందుకే అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. హెచ్‌సిఎస్‌సి, డబ్లూఎన్‌ఎస్, హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం సైబర్ సేఫ్టి ఫర్ చిల్డ్రన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిపుణులతో సైబర్ సేఫ్టీపై పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఇండియా, చైనా ఇంటర్‌నెట్ వాడడంలో ముందు ఉన్నాయని అన్నారు. పాఠశాలల ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రు వారి పిల్లలు సైబర్ సేఫ్టీ తరగతులకు హాజరయ్యేలా చూడాలని కోరారు. ఇంటర్‌నెట్‌ను వాడుతున్న వారు భద్రతను కూడా చూసుకోవాలని అన్నారు.
ఆన్‌లైన్ క్లాసుల వల్ల చిన్నారులు ఇంటర్‌నెట్‌ను ఎక్కువగా వాడుతున్నారని అన్నారు. వీటి ద్వారా తెలియని ప్రమాదాలు కూడా ఎదురుకావచ్చని అన్నారు. మొదటి దఫా కార్యక్రమంలో నగరంలోని 100 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పిల్లలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. పిల్లలు ఇంటర్‌నెట్ వాడుతున్నప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖగోయల్ అన్నారు. సైబర్ వేధింపులు, సోషల్ మీడియాలో వెంటాడడం, ఆర్థిక నేరాలను అరికట్టడం కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ సిపి అవినాష్ మహంతి, జాయింట్ సిపి తరుణ్‌జోషి, హెచ్‌సిఎస్‌సి డాక్టర్ ప్రశాంతి, షామిని మురుగేష్, కేశవ్, గజాలా షేక్ తదితరులు పాల్గొన్నారు.
Police Awareness for children on cyber safety