Tuesday, November 5, 2024

లాఠీలతో కొట్టారు…ముఖంపై మూత్రం పోశారు…. పోలీసుల అరాచకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇద్దరు మాంసం విక్రయదారులపై ఏడుగురు వ్యక్తులు దౌర్జన్యం చేశారు. ఆ ఇద్దరు మాంసం విక్రయదారులను కొట్టడమే కాకుండా వారి మొహంపై మూత్ర విసర్జన చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ ఏడుగురు నిందితులలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నట్లు వారు చెప్పారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో మార్చి 7న జరగినట్లు పోలీసులు చెప్పారు. మాంసం విక్రయదారులు కారులో వెళుతూ ఒక స్కూటర్‌ను ఢీకొన్న సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. గో సంరక్షకులమని చెప్పుకుంటున్న నిందితులు బాధితుల మొహంపై మూత్ర విసర్జన చేయడంతోపాటు వారిని చంపివేస్తామని కూడా బెదిరించినట్లు పోలీసులు గురువారం తెలిపారు. తమపై దాడి జరిగిన వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నాలుగు రోజుల వరకు పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. నిందితులు ఏడుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందని, నిందితులుగా ఉన్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని, వీరిలో ఒక ఎఎస్‌ఐ కూడా ఉన్నాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

ఘాజీపూర్ పశువధశాలకు మాంసాన్ని సరఫరా చేసే ముస్తఫాబాద్ ప్రాంత వాసి నవాబ్ తన సోదరుడు షోయబ్‌తో కలసి కారులో ఇంటికి వెళుతుండగా ఆనంద్ విహార్ సమీపంలో వారి కారు ఒక స్కూటర్‌ను ఢీకొంది. కారులో వారు మాంసాన్ని తీసుకువెళుతున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. కాగా..తనకు జరిగిన నష్టానికి రూ.4,000 పరిహారం ఇవ్వాలని స్కూటర్ వాళ్లు వారిని డిమాండ్ చేశాడు. ఆ సమయంలోనే ఒక పోలీసు వ్యాను అటుగా వచ్చింది. గొడవలో కల్పించుకున్న పోలీసులు నవాబ్ నుంచి రూ.2,500 తీసుకుని స్కూటరిస్టుకు ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు నవాబ్‌ను రూ. 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు చెల్లించకపోతే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తామని వారు బెదిరించారు.

పోలీసు వ్యానులో ఉన్న ముగ్గురు పోలీసులు మరో నలుగురు వ్యక్తులను పిలిపించి నవాబ్‌తోపాటు షోయబ్‌ను ఒక నిర్జన ప్రదేశం వద్దకు తీసుకెళ్లారు. వీరిద్దరిని చితకబాదారు. కత్తి చూపించి చేతులు కోసేస్తామని బెదిరించారు. తమ ఇద్దరి ముఖాలపై మూత్ర విసర్జన చేసి చంపేస్తామంటూ బెదిరించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ ముగ్గురు పోలీసులు తమ నుంచి రూ. 25,500 బెదిరించి వసూలు చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. తమ శరీరంలోకి నార్కోటిక్ వంటి పదార్థాన్ని ఇంజెక్ట్ చేసి ఖాళీ పత్రాలపై సంతకాలు కూడా తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. గాయాలతో ఉన్న బాధితులు ఇద్దరినీ జిటిబి ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News