Wednesday, December 4, 2024

హరీశ్‌రావుపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, రిటైర్డ్ డిసిపి రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు హరీష్ రావు, రాధాకిషన్ రావుపై 120(బి), 386,409,506, రెడ్ విత్ 34, ఐటియాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ అయిందని చక్రధర్ గౌడ్ గతంలో జూబ్లీహిల్స్ ఎసిపి, డిజిపికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం జూబ్లీహిల్స్ ఎసిపి చక్రధర్ గౌడ్‌ను విచారణకు పిలిచి ఫోన్ ట్యాపింగ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆధారాలు ఉంటే వెంటనే సమర్పించాలని చెప్పారు. సిద్ధిపేటలో రాజకీయంగా తనకు అడ్డు వస్తున్నానని హరీష్ రావు టాస్క్‌ఫోర్స్ అప్పటి డిసిపి రాధాకిషన్‌రావుతో కలిసి తన ఫోన్, భార్య, డ్రైవర్, బంధువుల ఫోన్లు ట్యాప్ చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, అరెస్టు చేసి టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు ముందుకు తీసుకుని వెళ్లారని తెలిపారు. తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత నుంచి తనకు బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయని పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో పోలీసులు రెండుసార్లు విచారణ చేశారు.

యాపిల్ ద్వారా మెసేజ్…
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని, తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు యాపిల్ కంపెనీ ద్వారా తనకు అలర్ట్ మెసేజ్ వచ్చిందని, దీనిపై గతంలో డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. గంటన్నర పాటు పోలీసులు విచారణ చేసి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు బీఆర్‌ఎస్ పార్టీలో చేరి హరీష్ రావుకు సరెండర్ అవ్వాలని, లేకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు దిగారని చెప్పారు. తన వ్యక్తిగత ఫోన్‌తో పాటు తన భార్య, డ్రైవర్, తమ కుటుంబ సభ్యుల ఫోన్లు అన్ని ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, తాము చెప్పినట్లు వినకపోతే తన కుటుంబాన్ని అంతం చేస్తామంటూ అప్పటి ట్రాన్స్‌పోర్టు డీసీపీ రాధా కిషన్ రావు బెదిరింపులకు దిగారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News