Sunday, December 22, 2024

సైఫ్ వేధింపులు, కులం పేరుతో ర్యాగింగ్

- Advertisement -
- Advertisement -

సైఫ్ వేధింపులు, కులం పేరుతో ర్యాగింగ్
అందుకే మెడికో ప్రీతి ఆత్మహత్య
మొత్తం 970 పేజీలతో కోర్టులో పోలీసుల ఛార్జ్‌షీట్ దాఖలు
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికల్ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సీనియర్ విద్యార్ధి సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కులం పేరుతో ర్యాగింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. డిప్రెషన్‌కు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. మెడికల్ కాలేజ్‌లో ప్రీతి చేరిననాటి నుంచి సైఫ్ ఆమెను పలు రకాలుగా హేళన చేస్తూ వచ్చాడని వెల్లడించారు.

సైఫ్ వేధింపులు ఎక్కువ కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 70 మంది సాక్షులను విచారించామని, సైఫ్, ప్రీతి కాల్ డేటాను సైతం వెలికి తీసి అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరించామని వెల్లడించారు. ఈ మేరకు మొత్తం 970 పేజీలతో ఛార్జ్‌షీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. ఇదిలావుండగా, ప్రీతి నివసించిన హాస్టల్ గడిని పోలీసులు బుధవారం తెరిచారు. కెఎంసి హాస్టల్‌లో దాదాపు 4 నెలలుగా మూసి వున్న రూమ్ నెంబర్ 409ని ప్రీతి కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో పోలీసులు తెరిచారు. ఈ సమయంలో ప్రీతి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఆమెకు సంబంధించిన వస్తువులను, లగేజీని ప్యాక్ చేసిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదే సమయంలో ఆ గదిలో ఇంజెక్షన్లు, సూదులు, ఇతర వస్తువులు బయటపడ్డాయి. కాగా కెఎంసిలో అనస్థీషియ విభాగంలో పిజి మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఎంజిఎంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ప్రీతికి ఎంజీఎం ఆసుపత్రిలోనే మొదట అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో అదే రోజు హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి నిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స జరిగింది. కానీ ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆమెను కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం విశ్వప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి ప్రాణాలు విడిచింది. మరోవైపు ప్రీతిది ఆత్మహత్యా కాదని, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు, విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News