మన తెలంగాణ/హైదరాబాద్: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో నగదు, మద్యం, ఆభరణాలు, కానుకలు పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నాయి. ఈనెల 9న నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ.307.2 కోట్లకు పైగా ఉన్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. గడచిన 24 గంటల్లో రూ.9.69 కోట్ల నగదు పట్టుబడగా, ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం నగదు రూ.105. 58 కోట్లు. శనివారం ఉదయం నుంచి రూ.1.35 లక్షల విలువైన మద్యం పట్టుబడగా స్వాధీనం చేసుకున్న మొత్తం సరుకు విలువ రూ.13.58 కోట్లు. 24 గంటల్లో రూ. 72 లక్షల విలువైన 232 కిలోల గంజాయి పట్టుబడింది. గడచిన 24గంటల్లో రూ.3.81 కోట్ల విలువైన బంగారం, 894 కిలోల వెండి, 190 క్యారెట్ల వజ్రాలు, 5 గ్రాముల ప్లాటినం స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.145.67 కోట్లు. వీటితో పాటు రూ.26.93 కోట్ల విలువైన ఇతర కానుకలు పట్టుబడ్డాయి. అక్టోబరు 20 ఉదయం నుంచి 24 గంటల్లో మొత్తం విలువ రూ.18.01 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఐటి దాడుల్లో ఎఎంఆర్ గ్రూప్ ఎండి మహేష్ ఇంట్లో రూ. 3 కోట్లు స్వాధీనం
రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు శనివారం బంజారాహిల్స్‌లోని తనిఖీలు చేపట్టగా ఎఎంఆర్ గ్రూప్ సంస్ధల చైర్మన్ మహేశ్ రెడ్డి కారులో రూ. 3 కోట్లు పట్టుబడ్డాయి. ఆ నగదుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఎన్నికల అధికారులకు అప్పగించారు. పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు అందజేసినట్లు తేలింది. మహేశ్ రెడ్డి ఏ పార్టీ కోసం నగదు తీసుకొచ్చారనే దానిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.