Sunday, December 22, 2024

హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్‌లో గన్ మిస్ ఫైర్ : కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని నిద్రించే సమయంలో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సహచర సిబ్బంది ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భూపతి శ్రీకాంత్ మృతి చెందాడు. శ్రీకాంత్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా, గతంలో గన్ మిస్ ఫైర్ అయిన ఘటనల్లో పలువురు కానిస్టేబుల్స్, హోంగార్డ్ మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. గన్ శుభ్రం చేస్తున్న సమయంలో మిస్ ఫైర్ కావడం, విధులు మారే సమయంలో గన్ మిస్ ఫైర్ వంటి ఘటనల్లో పోలీస్ సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది మార్చి 28న కొమరం భీమ్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో గన్ మిస్ ఫైర్ కారణంగా రజనీకుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెందాడు.

ఈ ఏడాది జూన్ 29వ తేదీన హైద్రాబాద్ మింట్ కాంపౌండ్ లో సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రామయ్య అనే కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ కారణంగా మృతి చెందాడు. తుపాకీని శుభ్రం చేసే సమయంలో మిస్ ఫైర్ అయి రామయ్య మృతి చెందాడు. 2022 ఫిబ్రవరి 13న వరంగల్ జిల్లాకు చెందిన సంతోష్ యాదవ్ చేతిలో గన్ మిస్ ఫైర్ అయింది. డ్రిల్ సమయంలో గన్ ప్రమాదవశాత్తు పేలింది.దీంతో తీవ్రంగా గాయపడిన సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు.2021 మే 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సబ్ జైలులో తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ మృతి చెందాడు. విధులు ముగించుకుని తుపాకీని సహచర ఉద్యోగికి అందిస్తున్న సమయంలో గన్ మిస్ ఫైర్ అయింది. 2020 ఫిబ్రవరి 22న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తిర్యానీ పోలీస్ స్టేషన్ లో గన్ మిస్ ఫైర్ అయి కిరణ్ కుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెందాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News