సిటిబ్యూరోః కుటుంబ కలహాల వల్ల ఓ కానిస్టేబుల్ భార్యను గొంతు కోసి హత్య చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, రేపాలా పోస్టు, నర్సింహులగూడెంకు చెందిన కుంచం రాజ్‌కుమార్ ఎస్పిఎఫ్ కానిస్టేబుల్‌గా 2010లో ఎంపికయ్యాడు. వనస్థలిపురం, గౌతమి నగర్‌లో కుటుంబంతోపాటు ఉంటున్నాడు. రాజ్‌కుమార్‌కు, శోభకు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజ్‌కుమార్ హైకోర్టు నాల్గొనంబర్ గేట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య, భర్త మధ్య గత కొన్నేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గతంలో రాజ్‌కుమార్ యాదగిరిగుట్ట వద్ద విధులు నిర్వర్తించిన సమయంలో వేధిస్తుండడంతో శోభ అక్కడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినా కూడా రాజ్‌కుమార్ ప్రవర్తనలో మార్పురాలేదు.
అయినా కూడా రాజ్‌కుమార్, శోభను వేధించడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగింది, శోభను హత్య చేసేందుకు యత్నించగా ఇంటి పై అంతస్థు నుంచి కిందికి పరిగెత్తింది. ఆమె వెంట వచ్చిన రాజ్‌కుమార్ పట్టుకుని కత్తితో గొంతు కోశాడు, తల్లి రక్షించేందుకు యత్నించిన పెద్ద కుమారుడు సాత్విక్‌పై దాడి చేసేందుకు యత్నించగా తప్పించుకున్నాడు. బాలుడి రెండు చేతులకు గాయాలు కాగా, శోభ అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో నిందితుడు రాజ్‌కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే సాత్విక్ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని ఎల్‌బి నగర్ డిసిసి సాయిశ్రీ, ఎసిపి పురుషోత్తంరెడ్డి పరిశీలించారు. బాలుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు,క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని డిసిపి సాయిశ్రీ తెలిపారు. నిందితుడిపై 302,307 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అంత్యక్రియలకు డబ్బులు లేక…
అనారోగ్యంతో మృతిచెందిన సొంత అన్న అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో సోదరుడి శవాన్ని ముక్కలుగా నరికి గోనేసంచిలో పెట్టి రోడ్డుపై పడేసిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…రంగారెడ్డి జిల్లా, బండ్లగూడ ఎన్‌ఎఫ్‌సి కాలనీకి చెందిన అశోక్(50) పుట్టుకతో అంగవైకల్యం ఉంది. మద్యానికి బానిసగా మారిని అశోక్ అనారోగ్యం బారినపడ్డాడు. దీంతో అతడి తమ్ముడు, రాజు, చెల్లి స్వరూప ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికంగా ఉన్న డాన్‌బోస్కో ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నాడు. మూడు రోజుల క్రితం వైద్యులు అశోక్ బాడి చికిత్సకు స్పందించడంలేదని ఇంటికి తీసుకుని వెళ్లాలని చెప్పారు. దీంతో అశోక్‌ను ఇంటికి తీసుకుని వెళ్లారు. రాజు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, స్వరూప ఇంట్లోనే ఉంటోంది.
ఈ క్రమంలోనే గురువారం ఉదయం లేచి చూసేసరికి అశోక్ మృతిచెంది ఉన్నాడు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఏమి చేయాలో తోచలేదు. ఎవరిని డబ్బులు అడిగినా ఇవ్వరని, బాడీని ముక్కలుగా చేసి ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి గోనేసంచిలో పెట్టి ఆటోలో రాత్రి 10.30 గంటలకు తీసుకుని లంగర్‌హౌస్ దర్గా వద్దకు రాగానే చీకటిగా ఉండడంతో అక్కడ పడేశారు. ఇది గమనించిన స్థానికులు వారిని పట్టుకునేందుకు యత్నించగా ఆటోలో తప్పించుకుని పోయారు. వెంటనే పోలీసులకు సమచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వచ్చారు. స్థానిక సిసిటివిలను పరిశీలించగా ఆచూకీ లభించింది. వారు చెప్పింది విని పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వారిపై ఏ కేసు పెట్టాలో అర్ధం కాకా పోలీసులు తలపట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.