Friday, January 3, 2025

ఖాకీవనంలో పేలిన ఫటిక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో : తెలంగాణ లో ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాల ని డిమాండ్ చేస్తూ బెటాలియన్ కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాష్ట్రంలోని వివిధ పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. సెలవుల విధానం మార్చడంపై పోలీ స్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు గత కొద్ది రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పాత సెలవుల విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెటాలియ న్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు, ఈ క్రమంలోనే వారు ఏకంగా సెక్రటేరియట్ ఎదుట ఆందోళన చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పాత సెలవుల విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. అయినా కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు, ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా శనివారం నుంచి కానిస్టేబుళ్లు యూనిఫాం వేసుకుని బెటాలియన్లలో ఆందోళనకు దిగారు. వరంగల్‌లోని మామునూర్, సిరిసిల్ల, మంచిర్యాల, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆందోళనలకు దిగారు.

దీంతో ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒకే పోలీస్ విధానం అమలయ్యే వరకు ఫ్యామిలీ వెల్ఫేర్ కల్పించాలన్నారు. బ్రిటిష్ కాలం నాటి విధి విధానాలను మార్చాలని స్పష్టం చేశారు. ఒకేచోట ఐదేండ్లు పోస్టింగ్ ఇచ్చి, కుటుంబాలకు కూడా సౌకర్యాలు కల్పించాలన్నారు. బెటాలియన్ వ్యవస్థలో ఫటిక్ పేరుతో చేసే వెట్టి చాకిరిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల ఇండ్లలో బానిస బతుకుల నుంచి విముక్తి కల్పించాలన్నారు. హోం శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, విధివిధానాలు, జీవనశైలి ఒకే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా, మామునూరు క్యాంపులో మొదలైన ఆందోళన సెక్రటేరియట్‌కు చేరింది. క్రమంగా రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లకు పాకింది. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, నల్గొండ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాలలో నిరసనలు చేపట్టారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్‌బ్రిడ్జిపై 13వ పటాలం పోలీసు భార్యలు తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగారు. గత రెండు రోజులుగా వీరు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఓవర్‌బ్రిడ్జి వద్ద రాస్తారోకో కార్యక్రమంలో ప్లకార్డులు ప్రదర్శించి వెంటనే ఏక్‌పోలీసు విధానం అమలు చేయాలని నినాదాలు చేశారు. పేరుకే పోలీసు ఉద్యోగం తమ భర్తలు వెట్టిచాకిరి చేస్తున్నారని, విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలకు సరైన సమయం కేటాయించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా, మునూర్ బెటాలియన్ ఆవరణలో ఏకంగా యూనిఫాం ధరించిన పోలీసులే నిరసనకు దిగారు. ‘ఏక్ పోలీస్ ముద్దు.. టిజిఎస్‌పిఎస్‌పికో హఠావో.. ఏక్ పోలీస్ బనావో’ అంటూ నినాదాలు చేశారు. నల్లగొండ జిల్లా అన్నెపర్తి బెటాలియన్‌లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై కానిస్టేబుళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ రూరల్ ఎస్‌ఐ సైదాబాబును సస్పెండ్ చేయాలని నిరసనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కుటుంబ సభ్యుల పట్ల నోటికి వచ్చినట్టు మాట్లాడాడని ఆరోపించారు.

తక్షణమే సైదాబాబుని సస్పెండ్ చేయాలని, లేనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్‌ఐ సైదాబాబు వద్దకు కానిస్టేబుళ్లు రావడంతో బెటాలియన్ అధికారులు అతనిని అక్కడిని నుంచి పంపించేశారు. తమ భర్తలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, 8 గంటలకు పైగా డ్యూటీ చేస్తుండటంతో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయంటూ పోలీసు భర్తల కోసం భార్యలు, కుటుంబ సభ్యులు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లిలో రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై 6వ బెటాలయిన్ కానిస్టేబుళ్ల భార్యలు ధర్నా చేపట్టారు. బెటాలియన్ కానిస్టేబుళ్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తరచూ పోస్టింగ్‌లు మార్చడంతో తమ పిల్లల చదువులకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని, తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా , ఇబ్రహీంపట్నంలో పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది.

రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ ఇబ్రహీంపట్నంలోని నాగార్జునసాగర్ హైవేపై కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. హోం శాఖ సిఎం రేవంత్‌రెడ్డి చేతుల్లోనే ఉందని, తమ బతుకులు కూడా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉన్నాయంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించగా తోపులాట చోటుచేసుకుంది. మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ధర్నా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

ఇదిలావుండగా, బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనపై డిజిపి జితేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమక్షశిణతో కూడిన ఫోర్స్‌లో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సెలవులపై పాత పద్ధతే అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళనలకు దిగడం సరికాదన్నారు. ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందని వ్యాఖ్యానించారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మన దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ సామాన్య జనానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపై వచ్చిన పోలీసులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News