గంగారం: గంగారం మండలంలోని జంగాలపల్లిలో మహబూబాబాద్ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాల మేరకు గూడూరు సీఐ ఫణీందర్ ఆధ్వర్యంలో ఎస్సై దిలీప్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఫణీందర్ మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే వారిపై కఠిన చరయలు తీసుకుంటామన్నారు.
వీలైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని, మంచి వారికి పోలీసుల సహకారం ఎల్లపుడు ఉంటుందన్నారు. రాబోయేది ఎన్నికల సమయం కావున గ్రామంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని వర్గాలు సహకరించాలన్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే వారి సమాచారం వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. ఎస్సై దిలీప్ మాట్లాడుతూ. శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు.
ఈ సెర్చ్‌లో 20 లీటర్ల గుడుంబాతోపాటు 120 లీటర్ల బెల్లం పానకం, డ్రమ్ములను ధ్వంసం చేశారు. సదరు వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎస్సై రాణాప్రతాప్, ఆర్‌ఎస్సై శేఖర్, స్పెషల్ పార్టీ సిబ్బందితోపాటు గంగారం, కొత్తగూడ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.