Wednesday, January 22, 2025

నాగరాజు హత్య కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి ఇస్తూ గురువారం నాడు ఎల్‌బి నగర్ కోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను ఐదు రోజుల పాటు కస్టడీకి కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మోబిన్, మహ్మద్‌లను సరూర్‌నగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. గురువారం నాటి నుంచి ఈనెల 16 వరకు ఇద్దరిని ప్రశ్నించనున్నామని, విచారణలో నాగరాజు హత్యకు దారితీసిన కారణాలను పూర్తిగా తెలుసుకోనున్నామని పోలీసులు తెలిపారు.

అలాగే నాగరాజు హత్యకు ముందు అతని ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసిన విషయాలపై ఆరా తీయనున్నారు. ముఖ్యంగా నాగరాజు హత్య కేసులో మోబిన్, మహ్మద్‌లతో పాటు ఇంకా ఎంత మంది పాల్గొన్నారన్న విషయాలపై విచారణ చేపట్టనున్నారు. కాగా నాగరాజు హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలంలో ఐదుగురిని చూసినట్లు మృతుడి భార్య ఆశ్రిన్ పోలీసులకు వివరించింది. మిగతా ముగ్గురు ఎవరై ఉండొచ్చనే వివరాలను పోలీసులు మోబిన్, మహ్మద్‌లను విచారించి తెలుసుకోనున్నారు.

గతంలో తన తండ్రిని కూడా అన్న మోబిన్ కొట్టి చంపినట్లు ఆశ్రిన్ ఆరోపించింది. తన తమ్ముడిని సైతం తీవ్రంగా కొడతాడని క్రూరంగా వ్యవహరిస్తాడని పోలీసుల వద్ద అశ్రిన్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ప్రధాన నిందితుడైన మోబిన్ గత నేర చరిత్ర గురించి పోలీసులు కస్టడీలో ప్రశ్నించే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో 5 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత ఈ నెల 17న ఉదయం 10.30 గంటలకు ఎల్‌బినగర్ కోర్టులో నిందితులను హాజరుపర్చి అటు నుంచి చర్లపల్లి జైలు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News